Old House Buying : పాత ఇల్లు కొనేముందు ఈ విషయాలు తప్పకుండా గుర్తుపెట్టుకోండి
Old House Buying : కొత్త ఇళ్ళు లేదా అపార్ట్‌మెంటులో కొనడం కంటే పాత ఇళ్లను కొనడం కాస్త తక్కువ ఖర్చుతో కూడుకున్నది. కానీ పాత ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి.

పాత ఇల్లు కొన్నప్పుడు చిట్కాలు
ఊర్లో అయినా.. సిటీలో అయినా పాత ఇంటిని కొంటున్నమంటే దాని చుట్టు పక్కల ఉన్న పరిస్థితిని కూడా అర్థం చేసుకవాలి. సాధారణంగా పాత ఇల్లు మౌలిక సదుపాయాల కొరతతో సహా ఇతర సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఈ ఆస్తిని కొనుగోలు చేసే ముందు దానికి సంబంధించి పలు విషయాలను జాగ్రత్తగా చూడాలి.
కొన్ని పాత ఇళ్లకు మంచి కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు, అవసరమైన సేవలు దగ్గరలో ఉంటాయి. పాతవి కొనుగోలుదారులకు బడ్జెట్ అనుకూలమైనవి. అయితే పాత ఇల్లు మరమ్మతులు, పునరుద్ధరణలు ఖరీదైనవిగా ఉంటాయి. పాత భవనాలకు ఆధునిక మౌలిక సదుపాయాలు ఉండవు. భవనం సరైన డాక్యుమెంటేషన్‌ను ఏర్పాటు చేయడం కూడా కష్టం అవ్వొచ్చు. పాత ఆస్తిని కొనడం లాభదాయకమైన పెట్టుబడి అయినప్పటికీ ఇన్వెస్ట్ చేసేముందు కొన్ని విషయాలు చూసుకోవాలి.
- ఇల్లు ఉన్న ప్రాంతం ప్రధాన రోడ్లు, ప్రజా రవాణా, ఆసుపత్రులు, పాఠశాలలు, మార్కెట్లకు దగ్గరగా ఉందో లేదో చెక్ చేయండి. మీ లైఫ్‌స్టైల్‌కి మీరు ఎంచుకునే ప్రాంతం సరిపోతుందో లేదో కూడా చూసుకోవాలి. నీరు, విద్యుత్, ఇంటర్నెట్ సేవలు వంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయని చూసుకోండి.
- పాత ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు దాని విలువ కాలక్రమేణా ఎలా మారుతుందో అంచనా వేయాలి. డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ఇల్లు ఖరీదైనవిగా ఉంటాయి. అది భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది. పాత భవనాలను కూడా బాగా నిర్వహిస్తే, మరమ్మతు ఖర్చులను ఆదా చేయవచ్చు. సిటీకి దగ్గరలో ఉన్నవి అయితే మీకు భవిష్యత్తులో మంచి రాబడులు తెచ్చిపెడతాయి.
- భవనం పాతది కాబట్టి.. మొత్తం భవనం నిర్మాణాన్ని చెక్ చేయాలి. ఊహించని ఖర్చులను నివారించడానికి ఇది చాలా కీలకం అవుతుంది. భవనం పునాది, గోడలు పగుళ్లు, లీకేజీలు, ప్లంబింగ్, విద్యుత్ వ్యవస్థలు, పైపులు, డ్రెయిన్లు, వైరింగ్ కోసం ముందే చూడాలి. ఎందుకంటే ఇల్లు కొన్నాక ఈ ఖర్చే తడిసిమోపెడు అవుతుంది. నిర్మాణ సమయంలో ఉపయోగించిన పదార్థాల గురించి కూడా ఆరా తీయాలి. అవి కొంచెం ఎక్కువ కాలం ఉంటాయా లేదా వాటిని మార్చాల్సిన అవసరం ఉందా అని తెలుసుకోండి.
- మీరు కొన్న పాత ఇంటిని తిరిగి అమ్మినప్పుడు మీరు ఖర్చు చేసిన డబ్బు తిరిగి వస్తుందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే కొనుగోలు ధర కంటే తక్కువకు ఇళ్ళు అమ్ముడుపోయిన ఉదాహరణలు చాలా ఉన్నాయి. నిపుణుల సహాయంతో పాత ఇల్లు కొనండి.
- పాత ఇంటి మీద పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక పరిస్థితిని అంచనా వేయండి. కొనుగోలు ధరను మాత్రమే కాకుండా రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీకి సంబంధించిన ఖర్చులను కూడా పరిగణించాలి. ఆస్తి కొనుగోలు ప్రక్రియలో చర్చలు పూర్తయిన తర్వాత డౌన్ పేమెంట్ అవసరం. మీ దగ్గర అంత డబ్బు ఉందా, గృహ రుణం తీసుకుంటే నెలవారీ ఈఎంఐ చెల్లించగలరా అని ఆలోచించండి.
- ఆరోగ్యకరమైన జీవన ప్రదేశానికి సరైన వెంటిలేషన్, సహజ వెలుతురు చాలా అవసరం. కిటికీలు, తలుపులు మంచి స్థితిలో ఉన్నాయని నిర్ధారించుకోండి. ఇంట్లోకి విద్యుత్ దీపాల కంటే సహజ కాంతి ఎక్కువగా వస్తుందో లేదో, వంటగది, బాత్రూమ్ బాగా వెంటిలేషన్ ఉన్నాయో లేదో చూడండి. మంచి గాలి, వెలుతురు వచ్చే ఇల్లు ఆరోగ్యకరమైన జీవితానికి బాగుంటుంది.
మరిన్ని స్టాక్‌మార్కెట్, కంపెనీల ఫైనాన్షియల్ రిజల్ట్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, గాడ్జెట్లు, స్మార్ట్ఫోన్లు, టెక్నాలజీ, గోల్డ్ ప్రైస్ తదితర తాజా వార్తలను చూడండి.