Before Bike Riding : బైక్ స్టార్ట్ చేసే ముందు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయాలు-keep these important things in your mind before you start bike must follow rules ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Before Bike Riding : బైక్ స్టార్ట్ చేసే ముందు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయాలు

Before Bike Riding : బైక్ స్టార్ట్ చేసే ముందు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయాలు

Anand Sai HT Telugu
Jul 09, 2024 02:22 PM IST

Before Bike Riding Things : బైక్ స్టార్ట్ చేసి జాలీగా రైడ్‌కు వెళ్లవచ్చు అనుకుంటారు చాలా మంది. అర్జంట్ పని మీద వెళ్లేటప్పుడు కూడా కొన్ని విషయాలు మరిచిపోతారు. దీని ద్వారా మీకే నష్టం, బైక్ స్టార్ట్ చేసేముందు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఉన్నాయి.

బైక్ స్టార్ట్ చేసే ముందు పాటించాల్సిన నియమాలు
బైక్ స్టార్ట్ చేసే ముందు పాటించాల్సిన నియమాలు

ఇటీవలి కాలంలో ఇంటికో బైక్ ఉంది. ఒక మోటార్ సైకిల్ లేని కుటుంబాలు చాలా తక్కువ. మోటార్ సైకిల్ నడపాలంటే ట్రాఫిక్ రూల్స్, సేఫ్టీ రూల్స్ పాటించాలి. చాలా మంది రైడర్‌లకు ప్రాథమిక నియమాలు తెలుసు. కానీ అవగాహన లేకపోవడం వల్లనో, పట్టించుకోకపోవడం వల్లనో కొన్ని నిబంధనలు పాటించడం లేదు. మోటార్‌సైకిల్‌ను నడపడానికి అవసరమైన పత్రాల నుండి వాహన సవరణల వరకు ప్రతిదీ అత్యవసరమే. బైక్ ఉపయోగిస్తున్నప్పుడు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఉన్నాయి.

అవసరమైన పేపర్స్

రొడ్డు ఎక్కేముందే మీ బైక్ పత్రాలు, మీ లైసెన్స్, అవసరమైన పత్రాలు మీ చేతిలో ఉన్నాయని నిర్ధారించుకోండి. మోటారు వాహనాల చట్టం ప్రకారం బైక్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ, పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికేట్‌ను ఎల్లప్పుడూ దగ్గర పెట్టుకోవాలి.

బైక్ ఇన్సూరెన్స్

మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం బైక్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. ప్రమాదం జరిగినప్పుడు ఈ బీమా కనీసం థర్డ్ పార్టీ బాధ్యతను కవర్ చేయాలి. బీమా లేకుండా ద్విచక్ర వాహనం నడిపినందుకు జరిమానా లేదా లైసెన్స్‌ను జప్తు చేసే అధికారం అధికారులకు ఉంటుంది.

పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికేట్

సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్, 1989 ప్రకారం ఒక సంవత్సరం కంటే పాత అన్ని వాహనాలు తప్పనిసరిగా ఆమోదించన పరీక్ష కేంద్రం నుండి చెల్లుబాటు అయ్యే కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ తీసుకోవాలి. PUC సర్టిఫికేట్‌ను పునరుద్ధరించడంలో విఫలమైతే జరిమానా లేదా వాహన రిజిస్ట్రేషన్ నిలిపివేయవచ్చు. కారుతో బయటకు వెళ్లేటప్పుడు చాలా మంది పట్టించుకోని విషయాల్లో ఇది కూడా ఒకటి.

మోడిఫికేషన్

ఈ రోజుల్లో వాహనాలను మోడిఫై చేయడం ఒక ట్రెండ్. కానీ మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇంజిన్ శబ్దాన్ని పెంచే ఎగ్జాస్ట్ మోడ్‌లు, RTO అనుమతి లేకుండా నిర్మాణ మార్పులు వంటి చట్టవిరుద్ధమైన మార్పులు అన్నీ చట్టవిరుద్ధం. వాహనం రంగు మార్చుకోవాలంటే ఆర్టీఓ అనుమతి తప్పనిసరి. అయితే అధిక వేరియంట్ స్పెసిఫికేషన్‌తో సరిపోలడానికి డీకాల్స్ జోడించడం, వింగ్‌లెట్‌లను ఇన్‌స్టాల్ చేయడం లేదా టైర్లను అప్‌గ్రేడ్ చేయడం అనుమతి ఉంది. ఈ నియమాలను పాటించడం ద్వారా మీరు బైక్ నడిపితే ఎలాంటి సమస్య ఉండదు.

నో ఎంట్రీ చూసుకోండి..

మీరు సుదీర్ఘ ప్రయాణాన్ని ప్లాన్ చేస్తున్నప్పుడు ద్విచక్ర వాహనాలతో నో ఎంట్రీ ఎక్స్‌ప్రెస్‌వేలను నివారించడం చాలా అవసరం. సాధారణంగా ఎక్స్‌ప్రెస్ హైవేలపై ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాల ప్రవేశం నిషేదించారు. అయితే ఈ విషయం తెలియక చాలా మంది ఇలాంటి రోడ్లపై వాహనాలు నడుపుతున్నారు. ప్రమాదాలకు గురవుతున్నారు. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే, యమునా ఎక్స్‌ప్రెస్‌వే, ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే మినహా ఎక్స్‌ప్రెస్‌వేలపై సాధారణంగా ద్విచక్ర వాహనాలను అనుమతి లేదు. ఢిల్లీ-డెహ్రాడూన్, గంగా ఎక్స్‌ప్రెస్ వే, మైసూర్-బెంగళూరు వంటి కొత్త ఎక్స్‌ప్రెస్ వేలు గెజిట్ నోటిఫికేషన్‌ల ద్వారా ద్విచక్ర వాహనాలను నిషేధించాయి. దీన్ని ఉల్లంఘిస్తే జరిమానా విధించవచ్చు. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పైకి కూడా బైక్ నిషేధం.

హెల్మెట్ తప్పనిసరి

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. చాలా మంది హెల్మెట్ లేకుండా బైక్‌పై ప్రయాణం చేస్తుంటారు. ఏదో ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తారని మాత్రమే హెల్మెట్ పెట్టుకుంటారు. కానీ ఇది మీ ప్రాణానికి ప్రమాదం. మీరు తప్పకుండా మంచి హెల్మెట్ వాడాలి. మీ రోడ్డు మీద పడి ప్రాణాలు కోల్పోతే.. మీ కుటుంబం అంతా రోడ్డు మీదకు రావాల్సిన పరిస్థితి వస్తుంది.. జాగ్రత్త..

WhatsApp channel