MG Windsor EV : ఒకే నగరంలో ఒకే రోజు 101 కార్లను డెలివరీ చేసిన ఎంజీ విండ్సర్
MG Windsor EV : జెఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటర్ రికార్డు సృష్టించింది. ఒకే నగరంలో ఒకే రోజున 101 ఎంజీ విండ్సర్ ఈవీ కార్లను డెలివరీ చేసింది.
ఎంజీ విండ్సర్ 101 యూనిట్ల మెగా డెలివరీని తీసుకుంది. ఇది భారతదేశపు మొట్టమొదటి ఇంటెలిజెంట్ సీయూవీ (క్రాస్ఓవర్ యుటిలిటీ వెహికల్)గా పేరొందింది. తమిళనాడులోని చెన్నైలో వినియోగదారులకు ఒకే రోజు 101 కార్లను డెలివరీ చేసింది. దేశంలో ఈ కొత్త కారుకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. కంపెనీ గత నెలలో కూడా బెంగళూరులో మెగా డెలివరీని అందించింది. ఇప్పుడు చెన్నైలో కూడా ఒకే రోజు 101 మంది కస్టమర్లను ఆశ్చర్యపరిచింది.
సెప్టెంబర్ 11న ప్రారంభించిన కొత్త ఎంజీ విండ్సర్ బుకింగ్ ప్రకటించిన 24 గంటల్లోనే 15,176 బుకింగ్‌లను సంపాదించింది. భారతదేశంలో ప్రయాణికులకు మంచి సౌకర్యాన్ని అందించే.. ఈవీగా మైలురాయిని సాధించింది. అక్టోబర్ 2024లో గణనీయమైన అమ్మకాలను నమోదు చేసిన కంపెనీ 3,116 కార్లను విక్రయించింది. అక్టోబర్‌లో మొత్తం ప్యాసింజర్ ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలలో ఎంజీ విండ్సర్ 30 శాతం వాటాను కలిగి ఉంది.
ఈ కారు కొత్త ఏరోడైనమిక్ డిజైన్, విశాలమైన, ప్రీమియం ఇంటీరియర్, భద్రత, స్మార్ట్ కనెక్టివిటీ, మంచి డ్రైవింగ్ సౌకర్యంతోపాటుగా ఇతర ఫీచర్లతో వస్తుంది. ఇది ప్యూర్ EV ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించారు. విలాసవంతమైన అనుభూతిని అందిస్తుంది.
ఈ కారు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 332 కి.మీల రేంజ్ అందిస్తుంది. భారతదేశంలో ఎంజీ విండ్సర్ ధర రూ. 13,49,800 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ప్రత్యేకమైన బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్(BaaS) ప్రోగ్రామ్ కింద.. ఇది రూ.3.5తో లభిస్తుందని కంపెనీ పేర్కొంది.
ఎంజీ విండ్సర్‌లోని ఏరో లాంజ్ సీట్లు గొప్ప విశ్రాంతిని అందిస్తాయి. విశాలమైన 604-లీటర్ బూట్ స్పేస్ సామాను కోసం స్థలాన్ని అందిస్తుంది. విండ్సర్ IP67-సర్టిఫైడ్ 38kWh బ్యాటరీని కలిగి ఉంది. ఇది మన్నిక, భద్రతను ఇస్తుంది. ఈ కారులో ఎకో, ఎకో+, నార్మల్, స్పోర్ట్ అనే నాలుగు డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. దాని ఇన్ఫినిటీ వ్యూ గ్లాస్ రూఫ్, 2700mm అద్భుతమైన వీల్‌బేస్ కారు లోపల ఉన్న ప్రయాణికులకు లగ్జరీ అనుభూతిని కలిగిస్తుంది. ఎంజీ విండ్సర్ తన MG-Jio ఇన్నోవేటివ్ కనెక్టివిటీ ప్లాట్‌ఫామ్ (ICP)తో స్మార్ట్ కనెక్టివిటీ, ఇన్-కార్ టెక్నాలజీతో మరింత మందికి నచ్చుతుందని కంపెనీ తెలిపింది.
ఇది హోమ్-టు-కార్ ఫంక్షనాలిటీ, 100కి పైగా AI పవర్డ్ వాయిస్ కమాండ్‌ల వంటి అధునాతన ఫీచర్‌లను కలిగి ఉంది. డ్రైవర్లు అనేక భారతీయ భాషలలో వాయిస్ కమాండ్‌లను ఉపయోగించి అవసరమైన ఫంక్షన్స్ నియంత్రించవచ్చు. ఇన్ఫోటైన్‌మెంట్‌ను యాక్సెస్ చేయవచ్చు.
15.6-అంగుళాల గ్రాండ్‌వ్యూ టచ్ డిస్‌ప్లే సహజమైన నావిగేషన్, ఎంటర్టైన్‌మెంట్ ఆప్షన్స్ అందిస్తుంది. రియల్ టైమ్ నావిగేషన్, రిమోట్ వెహికల్ కంట్రోల్, సేఫ్టీ అలర్ట్‌లతో సహా 80 ప్లస్ కనెక్ట్ చేసిన ఫీచర్‌లతో వస్తుంది. ఇది ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్, ఎసెన్స్ అనే మూడు వేరియంట్‌లలో కొనుగోలు చేయవచ్చు. నాలుగు కలర్ ఆప్షన్స్‌తో వస్తుంది.