JIO BHARAT PHONE: జియో భారత్ ఫోన్‌లో జియో సౌండ్ పే సేవలను ఉచితంగా పొందవచ్చని రిలయన్స్ జియో ప్రకటించింది. వ్యాపారులు యూపీఐ చెల్లింపులు పొందిన సమయంలో, ఎటువంటి సౌండ్ బాక్స్ అవసరం లేకుండానే ఈ జియో సౌండ్ పే ఫీచర్ ద్వారా సౌండ్ అలర్ట్‌లను పొందవచ్చు.
దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 5 కోట్ల మంది చిన్న, సూక్ష్మ స్థాయి వ్యాపారులు ఈ జియో సౌండ్ పే ఫీచర్ ను ఉచితంగా పొందడం ద్వారా సంవత్సరానికి రూ. 1,500 ఆదా చేస్తారు. సాధారణంగా ఆ మొత్తాన్ని వారు సౌండ్ బాక్స్ సేవల కోసం చెల్లిస్తారు. జియో (jio) సౌండ్ పే సేవల ద్వారా ఆ మొత్తాన్ని వారు ఆదా చేయగలుగుతారు.
‘‘ప్రతి భారతీయుడిని శక్తివంతం చేయడంలో జియో యొక్క నిబద్ధతను నొక్కి చెప్పే సాహసోపేతమైన చర్యలో, కంపెనీ ఈరోజు తన జియో భారత్ (JIO BHARAT) పరికరం కోసం ఒక విప్లవాత్మకమైన కొత్త ఫీచర్‌ను ప్రకటించింది. ఇది దేశవ్యాప్తంగా 5 కోట్ల చిన్న తరహా వ్యాపారులకు అంకితం చేయబడింది. ఈ వినూత్న ఆవిష్కరణ జియోసౌండ్‌పే ప్రతి UPI చెల్లింపుకు తక్షణ, బహుభాషా ఆడియో నిర్ధారణలను అందించడం ద్వారా వ్యాపారికి ఉపయోగపడుతుంది. అతి చిన్న కిరాణా దుకాణాలు, కూరగాయల విక్రేతలు, రోడ్‌సైడ్ తినుబండారాల వ్యాపారులు ఈ సేవలను ఉచితంగా పొందవచ్చు’’ అని జియో ప్రకటించింది.
ప్రస్తుతం చిన్న, సూక్ష్మ వ్యాపారులు యూపీఐ చెల్లింపులు పొందినప్పుడు సౌండ్ అలర్ట్ లు పొందడానికి సౌండ్ బాక్స్ సేవలను ఉపయోగిస్తారు. అందుకోసం నెలకు దాదాపు రూ.125 చెల్లిస్తారు. ఇప్పుడు, జియోసౌండ్‌పే ఉచితంగా అందించడంతో, జియోభారత్ వినియోగదారులు సంవత్సరానికి రూ.1,500 ఆదా చేస్తారు. ఒక సంవత్సరం క్రితం ప్రారంభించబడిన జియోభారత్ ఫోన్, ప్రపంచంలోనే అత్యంత సరసమైన 4G ఫోన్. ఈ ఫోన్ ను కేవలం రూ.699 కే కొనుగోలు చేయవచ్చు. అంటే, కొత్త జియోభారత్ ఫోన్‌ను కొనుగోలు చేసే ఏ వ్యాపారి అయినా ఫోన్ కు చెల్లించిన మొత్తాన్ని కేవలం 6 నెలల్లోనే తిరిగి పొందవచ్చు.