Recharge Plans : కొత్తగా ప్రకటించిన ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలు తగ్గించిన జియో, ఎయిర్‌టెల్
Recharge Plans : టెలికాం ఆపరేటర్లు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ తమ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ధరలు తగ్గించాయి. వీటిలో వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ మాత్రమే ఉంటాయి.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) మార్గదర్శకాల తర్వాత టెలికాం ఆపరేటర్లు వాయిస్, ఎస్ఎంఎస్ కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చాయి. కొత్త ట్రాయ్ మార్గదర్శకాలు పెరుగుతున్న టెలికాం సేవల వ్యయాన్ని నిర్వహించడం, మొబైల్ వినియోగదారులు ఇంటర్నెట్ లేదా 5జీ డేటా సేవలను ఎంచుకోనప్పుడు సరసమైన రీఛార్జ్ ప్లాన్లను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే తాజాగా ఎయిర్‌టెల్, జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధరలను తగ్గించాయి. ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం..

జియో రీఛార్జ్ ప్లాన్స్
రిలయన్స్ జియో ఇటీవల రూ.1958, రూ.458లకు కొత్త వాయిస్ కాల్స్, టెక్స్ట్ మెసేజెస్ (ఎస్ఎంఎస్) ప్లాన్లను ప్రకటించింది. తరువాత జియో తన ప్యాక్ ధరలను తగ్గించింది. కొన్ని మార్పులు చేసింది. ఈ ప్లాన్ల ధరలు రూ.1748, రూ.448కి తగ్గాయి. ధరలను తగ్గించినప్పటికీ, రిలయన్స్ తక్కువ రోజులు లేదా పరిమిత ప్రయోజనాలు వంటి ప్లాన్‌లో కొన్ని మార్పులు చేసింది.
జియో రూ.1748 రీఛార్జ్ ప్లాన్లో అపరిమిత కాలింగ్, 3600 ఎస్ఎంఎస్‌లు ఉన్నాయి. ఇది 336 రోజుల వాలిడిటీతో ఉంటుంది. ఇది మునుపటి 365 రోజుల వాలిడిటీతో పోలిస్తే 29 రోజులు తక్కువ. ఇందులో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి జియో యాప్స్ యాక్సెస్ ఉంటుంది. మరోవైపు రూ.448 రీఛార్జ్ ప్లాన్ మొబైల్ వినియోగదారులకు 1000 ఎస్ఎంఎస్‌లు, అపరిమిత కాల్స్‌ను 84 రోజుల పాటు అందిస్తుంది. జియో రూ.10 ధర తగ్గింపు మినహా ప్లాన్లలో ఎటువంటి మార్పులు చేయలేదు.
ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్స్
ఎయిర్‌టెల్ తన వార్షిక ప్లాన్‌ను రూ.1,959 నుంచి రూ.1,849కి సవరించింది. ఈ ప్లాన్ 365 రోజుల చెల్లుబాటు, అపరిమిత వాయిస్ కాల్‌లు, 3,600 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది. ఇతర ప్రయోజనాలు చూస్తే.. అపోలో 24/7 సర్కిల్ సభ్యత్వం, ఉచిత హలో ట్యూన్ సేవ ఉంటుంది. రూ. 499 రీఛార్జ్ ప్లాన్‌ను రూ. 469కు తీసుకొచ్చారు. ఈ ప్లాన్‌లో 84 రోజుల చెల్లుబాటు, అపరిమిత వాయిస్ కాల్‌లు, 900 ఎస్ఎంఎస్‌లు ఉన్నాయి. అపోలో 24/7 సర్కిల్ సభ్యత్వం, ఉచిత హలో ట్యూన్ సేవ వస్తుంది.
స్వల్ప మార్పులతో సవరించిన ప్లాన్లు ఇంటర్నెట్ ఉపయోగించని కస్టమర్లకు బాగుంటాయి. ట్రాయ్ ఆదేశాలతో కేవలం వాయిస్, ఎస్ఎంఎస్ ప్లాన్లను టెలికాం కంపెనీలు తీసుకొచ్చాయి.