ITR Filing: ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా?.. ముందుగా ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి-itr filing key exemptions and deductions every taxpayer should know ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Itr Filing: ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా?.. ముందుగా ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి

ITR Filing: ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా?.. ముందుగా ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి

HT Telugu Desk HT Telugu
Jun 21, 2024 03:38 PM IST

ITR Filing: ఐటీఆర్ ఫైలింగ్ సీజన్ ప్రారంభమైంది. ఐటీఆర్ ఫైలింగ్ ను సులభతరం చేసిన తరువాత, సొంతంగానే ఆదాయ పన్ను రిటర్న్స్ ను దాఖలు చేసుకునేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే, ఐటీఆర్ దాఖలు చేసే ముందు ఈ ముఖ్యమైన విషయాలను తప్పక తెలుసుకోండి.

ఐటీఆర్ ఫైల్ చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి
ఐటీఆర్ ఫైల్ చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి

ITR Filing: ఆదాయ పన్ను స్లాబ్స్ లోకి వచ్చే ప్రతీ ఉద్యోగి తప్పక ఆదాయ పన్ను రిటర్న్స్ ను దాఖలు చేయాలి. అయితే, ఐటీఆర్ దాఖలు చేసే ముందు ప్రతీ వ్యక్తి కొన్ని ముఖ్యమైన విషయాలు, ఐటీ చట్టం లోని సెక్షన్ల వివరాలు తెలుసుకుని ఉండడం మంచిది. ఉద్యోగి వేతనంలో అలవెన్స్ లు, మినహాయింపులు చాలా ముఖ్యమైనవి. మినహాయింపులతో పన్ను భారం గణనీయంగా తగ్గుతుంది. సాధారణ అలవెన్సులకు ఉదాహరణలు ఇంటి అద్దె భత్యం (HRA), లీవ్ ట్రావెల్ అలవెన్స్ (LTA),, పిల్లల విద్యా భత్యం.. మొదలైనవి. ప్రతి అలవెన్స్ ను క్లెయిమ్ చేయడానికి నిర్దిష్ట అర్హత ప్రమాణాలు ఉంటాయి.

yearly horoscope entry point

అలవెన్స్ లపై అవగాహన పెంచుకోండి

కొన్ని అలవెన్సులకు కొన్ని పరిమితుల వరకు ఆదాయ పన్ను నుండి మినహాయింపు లభిస్తుంది. ఇది మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గిస్తుంది. దాంతో, మీరు చెల్లించాల్సిన పన్ను మొత్తం కూడా తగ్గుతుంది. ఈ పన్ను మినహాయింపులను పొందడానికి, మీరు మీ ఆదాయ పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసేటప్పుడు అవసరమైన డాక్యుమెంటేషన్ ను అందించాలి.

డిడక్షన్స్, ఎగ్జెంప్షన్స్ మధ్య తేడా

అయితే పన్ను చెల్లింపుదారులు డిడక్షన్స్, ఎగ్జెంప్షన్స్ మధ్య ఉన్న ప్రాథమిక వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి. ఐటీఆర్ (ITR) ను దాఖలు చేసే సమయంలో ఈ వివరాలను నిశితంగా పరిశీలించాలి. డిడక్షన్లు మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించే నిర్దిష్ట ఖర్చులను సూచిస్తాయి. వీటిలో సెక్షన్ 80 సీ కింద వచ్చే పీపీఎఫ్, ఇఎల్ఎస్ఎస్ వంటివి ఉంటాయి. అలాగే, సెక్షన్ 80 డీ కింద వచ్చే మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు, ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 24 కింద వచ్చే గృహ రుణ వడ్డీ ఉంటాయి. ఎగ్జెంప్షన్స్ విషయానికి వస్తే, ఎగ్జెంప్షన్స్ పన్ను నుండి పూర్తిగా మినహాయించిన ఆదాయ రకాలను సూచిస్తాయి. హెచ్ ఆర్ ఏ, ఎల్ టీఏ వంటి అలవెన్సులు ఈ కోవలోకి వస్తాయి. వీటి వల్ల కూడా మీరు పన్ను చెల్లించాల్సిన ఆదాయ మొత్తం గణనీయంగా తగ్గుతుంది.

డిడక్షన్స్ లో కొన్ని..

  1. హోం లోన్ పై వడ్డీ: ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 24 కింద హోమ్ లోన్ వడ్డీని క్లెయిమ్ చేయొచ్చు. సంబంధిత ఆర్థిక సంవత్సరంలో గృహ రుణంపై మీరు చెల్లించిన వడ్డీని మీ ఆదాయం నుంచి మినహాయించవచ్చు. తద్వారా మీరు పన్ను చెల్లించాల్సిన ఆదాయ మొత్తం తగ్గుతంది. ఇల్లు కొనడానికి, లేదా నిర్మించడానికి లేదా పునరుద్ధరించడానికి తీసుకున్న రుణాలపై చెల్లించే వడ్డీ ని క్లెయిమ్ చేసుకోవచ్చు.
  • ఆ ఇంట్లో మీరే నివసిస్తున్నట్లయితే: నిర్ణీత సమయంలోగా నిర్మాణాన్ని పూర్తి చేసినట్లయితే, మీరు ఒక ఆర్థిక సంవత్సరానికి రూ. 2 లక్షల వరకు మినహాయింపు పొందడానికి అర్హులవుతారు.
  • ఇంటిని అద్దెకు ఇచ్చినట్లయితే: మీరు మీ హోమ్ లోన్ నుండి తీసివేయగల వడ్డీ మొత్తానికి గరిష్ట పరిమితి లేదు; మీరు చెల్లించిన పూర్తి మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చు.
  1. మీ గృహ రుణం నుండి మీరు మినహాయించగల వడ్డీ మొత్తంపై గరిష్ట పరిమితి లేదు. మీరు చెల్లించిన పూర్తి మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు.

సెక్షన్ 80 సీ కింద మినహాయింపు

ఆదాయ పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80C భారతదేశంలో పన్ను ఆదా కోసం ఒక అత్యుత్తమ మార్గం. సెక్షన్ 80 సీ కింద పలు పెట్టుబడులు, వ్యయాలకు పన్ను మినహాయింపు పొందవచ్చు. అవి..

  • పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF): ఇది దీర్ఘకాలిక పెట్టుబడి ప్రణాళిక. దీనితో లాభదాయకమైన వడ్డీ రేటు తో పాటు పన్ను మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది.
  • ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF): వేతనం ద్వారా ఆదాయం పొందుతున్నవారికి రిటైర్మెంట్ అనంతర అవసరాలను తీర్చే లక్ష్యంతో రూపొందించిన ప్రణాళిక. దీనిలో ఉద్యోగి తన వద్ద ఉద్యోగం చేసే మొత్తం కాలానికి అటు యజమాని, ఇటు ఉద్యోగి కాంట్రిబ్యూషన్ చెల్లించాల్సి ఉంటుంది. దీనితో పన్ను మినహాయింపు తో పాటు, మంచి వడ్డీ లభిస్తుంది.
  • ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ (ELSS): స్టాక్స్ లో పెట్టుబడి పెట్టే, పన్ను మినహాయింపులు, వృద్ధి అవకాశాలను అందించే మ్యూచువల్ ఫండ్ ప్లాన్స్.
  • నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC): ఇది పన్ను ప్రయోజనాలు, ప్రభుత్వ గ్యారెంటీతో కచ్చితమైన రాబడిని అందించే ఫిక్స్డ్-ఇన్ కమ్ డిపాజిట్ ప్రోగ్రామ్.
  • ట్యూషన్ ఖర్చు: ప్రతి సంవత్సరం ఇద్దరు పిల్లల విద్య కోసం చెల్లించిన మొత్తంలో రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.
  • సెక్షన్ 80 సీ కింద ప్రతి ఆర్థిక సంవత్సరానికి గరిష్టంగా రూ .1.5 లక్షల తగ్గింపు పొందవచ్చు. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ (ULIP), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), సుకన్య సమృద్ధి యోజన (SSY), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ఈ చట్టంలోని సెక్షన్ 80 సి కింద అందుబాటులో ఉన్న మరిన్ని పెట్టుబడి ఎంపికలు.

మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం

  1. మీ వయస్సుతో సంబంధం లేకుండా మీకు, జీవిత భాగస్వామికి, మీపై ఆధారపడిన పిల్లలకు చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియంలకు రూ.25,000 వరకు క్లెయిమ్ చేయవచ్చు.
  2. 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న తల్లిదండ్రులకు చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియంలకు రూ .50,000 వరకు క్లెయిమ్ చేయవచ్చు.
  3. ఈ క్లెయిమ్ లకు ప్రీమియం చెల్లింపు రసీదులు, పాలసీ పత్రాలు అవసరమవుతాయి.

స్వచ్చంద సంస్థలకు విరాళాలు

ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80G కింద స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చిన విరాళాలకు పన్ను మినహాయింపు ఉంటుంది. గుర్తింపు పొందిన లాభాపేక్షలేని సంస్థలకు ఇచ్చిన విరాళాలపై 50% మినహాయింపు వర్తిస్తుంది. గ్రామీణాభివృద్ధి లేదా శాస్త్రీయ పరిశోధనల కోసం కృషి చేస్తున్న సంస్థలకు ఇచ్చే విరాళాలపై 100% మినహాయింపు లభిస్తుంది.

Whats_app_banner