జీతం పొందే ఉద్యోగులు జూన్ 15 నాటికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఫారం 16 పొందుతారు. బడ్జెట్‌లో చేసిన ప్రకటన అమలు కారణంగా ఈ సంవత్సరం ఫారం 16లో అనేక పెద్ద మార్పులు కనిపిస్తాయి. ఐటీఆర్ ఫారం 16 జీతం పొందే ఉద్యోగులకు ఒక ముఖ్యమైన పత్రం. ఇందులో మూడు కీలక మార్పులు కనిపిస్తాయి.
సాధారణంగా ఫారమ్ 16లో ఉద్యోగి వేతనం నుంచి మినహాయించిన టాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్(టీడీఎస్) కనిపించేది. కొత్త మార్పుతో ఈసారి ఫారమ్ 16 ఇతర వనరుల నుండి వచ్చే ఆదాయంపై టీడీఎస్, కొన్ని ఖర్చులపై తీసుకున్న టీసీఎస్ వివరాలు కూడా ఉంటాయి. మీరు మీ యజమానికి ఫారమ్ 12BBA సమర్పించినట్లయితే మాత్రమే ఇది సాధ్యమవుతుంది. జీతం పొందే ఉద్యోగులు తమ ఇతర ఆదాయ వనరులపై టీడీఎస్, టీసీఎస్ వివరాలను తెలిపితే దాని ఆధారంగా మెుత్తం ట్యాక్స్ ఎంత డిడక్ట్ అయిందో సవరిస్తారు.
బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను విధానం కింద జీతం పొందే వ్యక్తులకు స్టాండర్డ్ మినహాయింపును రూ.50,000 నుండి రూ.75,000కి ప్రభుత్వం పెంచింది. అటువంటి పరిస్థితిలో మీరు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటే ఫారమ్ 16లో టీడీఎస్ తగ్గింపుపై స్టాండర్డ్ డిడక్షన్ కింద రూ.75,000 తగ్గింపు లభిస్తుంది. కొత్త పన్ను విధానం నుండి పాత పన్ను విధానానికి మారితే స్టాండర్డ్ డిడక్షన్‌గా రూ. 50,000 మాత్రమే క్లెయిమ్ చేయగలరు.
కొత్త పన్ను విధానం ప్రకారం, ఉద్యోగులు సెక్షన్ 80CCD (2) కింద వారి ప్రాథమిక జీతంలో 14 శాతం వరకు తగ్గింపును క్లెయిమ్ చేయవచ్చు. ఉద్యోగి ఎన్పీఎస్ ఖాతాకు యజమాని సహకారంపై ఈ తగ్గింపును క్లెయిమ్ చేయవచ్చు. మీరు జీతం నుండి టీడీఎస్ కోసం కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటేనే ఈ అధిక తగ్గింపు మీ ఫారం 16లో కనిపిస్తుంది. అయితే ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు పన్ను విధానాన్ని కొత్త నుండి పాతదిగా మార్చినట్లయితే, తగ్గింపు తగ్గుతుంది. పాత పన్ను విధానంలో ఉద్యోగి ఎన్పీఎస్‌కి మారితే సెక్షన్ 80CCD (2) కింద తన ప్రాథమిక జీతంలో 10 శాతం మాత్రమే తగ్గింపును క్లెయిమ్ చేయడానికి అర్హులు.