ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలతో ఇండియాలోని సామాన్యుడిపై ఆర్థిక పిడుగు పడే అవకాశం ఉంది! ఈ రెండు దేశాల మధ్య అనిశ్చితి.. ప్రపంచ ఇంధన మార్కెట్లపై, ముఖ్యంగా ముడి చమురు ధరలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది. మధ్యప్రాచ్యం ప్రపంచంలోనే అతిపెద్ద ముడి చమురు ఉత్పత్తి చేసే ప్రాంతాలలో ఒకటి కాబట్టి, ఈ ప్రాంతంలో ఏదైనా సంఘర్షణ జరిగితే, అది చమురు ధరలను నేరుగా ప్రభావితం చేస్తుంది. పశ్చిమ ఆసియా ప్రాంతం నుండి సరఫరాకు అంతరాయం కలుగుతుందనే ఆందోళనల మధ్య, ఈ ఘర్షణ ఇప్పటికే ప్రపంచ ఇంధన మార్కెట్లను ప్రభావితం చేయడం ప్రారంభించింది. చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఫలితంగా భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేకపోలేదు!
వారం రోజుల క్రితం 70 డాలర్లకు దిగువ ఉన్న బ్రెంట్ క్రూడ్.. ప్రస్తుత ఉద్రిక్తతల కారణంగా తాజాగా 75.42 డాలర్లకు చేరింది. ఒకనొక దశలో ఇది 78 డాలర్లను సైతం టచ్ చేసింది. ఇది బ్రెంట్ క్రూడ్‌కు ఐదు నెలల గరిష్ట ధర!. ముడి చమురు ధరల పెరుగుదల ఇంధన ఖర్చులను, రవాణా ఛార్జీలను కూడా పెంచుతాన్న విషయం తెలిసిందే. భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ప్రపంచ ముడి చమురు ధరలతో నేరుగా ముడిపడి ఉన్నాయి. ప్రపంచ ముడి చమురు ధరలు పెరిగితే, భారతదేశంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్ డీజిల్ ధరలను పెంచే అవకాశం ఉంది. చివరికి ఇది వాహనదారుల ఇంధన బిల్లులపై ప్రభావం చూపుతుంది.
ఈ ఘర్షణ స్వల్పకాలికంగా చమురు, గ్యాస్ ధరలను పెంచే అవకాశం ఉందని అంచనాలు మొదలయ్యాయి. అయితే, ఇజ్రాయెల్ ఇరాన్ సంఘర్షణ ఇండియాలో చమురు ఎగుమతులకు నేరుగా అంతరాయం కలిగించనంత కాలం, ఇది దీర్ఘకాలికంగా ధరల ఒత్తిడిని కొనసాగించదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగానే ఉన్నాయి. దేశంలోని వివిధ నగరాల్లో లీటరు పెట్రోల్ ధర దాదాపు రూ. 100 పలుకుతుండగా, డీజిల్ ధర కూడా ఆ మార్కుకు దగ్గరగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో, ఈ పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వాహనదారులపై, అలాగే మొత్తం ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడిని పెంచుతుంది.
జూన్ 15న నాటికి, దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 94.77, లీటరు డీజిల్ ధర రూ. 87.67గా ఉంది. ముంబైలో లీటరు పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ. 103.50, రూ. 90.03గా ఉన్నాయి. చెన్నైలో లీటరు పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ. 100.80, రూ. 92.39గా నమోదయ్యాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ. 107.46గాను, లీటరు డీజిల్ ధర రూ. 95.70గాను కొనసాగుతోంది.
సంబంధిత కథనం