YouTube: వీడియోల వ్యూ కౌంట్, అప్లోడ్ తేదీలను యూట్యూబ్ దాచిపెడుతోందా?.. ఎందుకలా చేస్తోంది?
YouTube: హోం పేజీలో వ్యూ కౌంట్ లను, కంటెంట్ ను అప్ లోడ్ చేసిన తేదీలను యూట్యూబ్ దాచిపెడుతోందని ఒక యూజర్ వెల్లడించాడు. దీనిపై యూట్యూబ్ స్పందించింది. కొన్ని బ్రౌజర్ ఎక్స్టెన్షన్లను ఎనేబుల్ చేసినప్పుడు ఇది సంభవిస్తుందని యూట్యూబ్ పేర్కొంది.
YouTube: యూజర్ల అనుభవాన్ని మెరుగుపరచడానికి యూట్యూబ్ వంటి పెద్ద ప్లాట్ ఫామ్స్ లో యూజర్ ఇంటర్ ఫేస్ లో తరచూ మార్పులు జరుగుతుంటాయి. కొన్ని సార్లు కొన్ని అప్ డేట్స్ యూజర్లకు నచ్చవు. ప్రత్యేకించి, తాము అప్ లోడ్ చేసిన వీడియోలు నచ్చని వారి సంఖ్యను తెలిపే డిస్ లైక్ కౌంట్ వంటి కొలమానాలను తొలగించేటప్పుడు యూజర్లు నెగటివ్ గా స్పందిస్తారు. తాజాగా, అలాంటి అప్ డేట్ ఒకటి యూట్యూబ్ లో విమర్శలకు గురవుతోంది.
ఎక్స్ లో చర్చ
డెక్సెర్ట్ తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ విషయాన్నిఎక్స్ యూజర్ by@vidIQ గుర్తించారు. యూట్యూబ్ హోం పేజీలో వీడియోను వీక్షించిన వారి సంఖ్యను తెలిపే వీడియో వ్యూ నంబర్ ను, ఆ వీడియోను అప్ లోడ్ చేసిన తేదీలను యూట్యూబ్ కనిపించకుండా చేస్తోందని డెక్సెర్ట్ తాజా నివేదిక వెల్లడించింది. యూట్యూబ్ యూజర్లు దీనిపై పెద్దగా సంతోషంగా లేరని డెక్సెర్టో పేర్కొన్నారు. వ్యూ కౌంట్లను తొలగించడం వల్ల సమస్యేమీ లేదని, తేదీలను తొలగించడం మాత్రం సరైనది కాదని కొందరు పేర్కొన్నారు. ‘‘ ఆ వీడియోకు ఎన్ని వ్యూస్ వచ్చాయన్నది నాకు ముఖ్యం కాదు. కానీ అప్ లోడ్ చేసిన తేదీ తెలియాలి కదా. ఏదైనా అంశంపై లేటెస్ట్ గా వచ్చిన వీడియోను చూడాలనుకుంటాం కదా’’ అని ఎక్స్ యూజర్ @ThatNerdMert అన్నారు.
ఈ మార్పు మంచిదే..
అయితే, ఈ మార్పు తక్కువ వ్యూస్ ఉన్న వీడియోలకు వ్యతిరేకంగా పక్షపాతాన్ని తగ్గించడం ద్వారా కొత్త సృష్టికర్తలకు ప్రయోజనం చేకూరుస్తుందని కొందరు వాదించారు. అయితే, కొత్త హోమ్ పేజీ డిజైన్ ను యూట్యూబ్ పరీక్షిస్తోంది. అందులో భాగంగానే వ్యూస్ సంఖ్యను, అప్ లోడ్ చేసిన తేదీలను దాచి ఉంచే అప్ డేట్ ను కూడా పరీక్షిస్తోంది. అయితే, ఈ వార్త వైరల్ గా మారడంతో యూట్యూబ్ దీనిపై వివరణ ఇచ్చింది.
యూట్యూబ్ స్పందన
డెక్సెర్ట్ కు యూట్యూబ్ (youtube) బదులిస్తూ, ‘‘కొన్ని బ్రౌజర్ ఎక్స్టెన్షన్లను ఎనేబుల్ చేసి వీక్షకులు యూట్యూబ్ చూస్తున్నట్లయితే ఇది జరగవచ్చు. వారు ఈ ఎక్సటెన్షన్ లను నిలిపివేస్తే, ఆటోమేటిక్ గా మళ్లీ వ్యూస్, అప్లోడ్ డేట్ కనిపిస్తాయి. ఎక్స్ టెన్షన్ నిలిపేసినా ఈ హోమ్ పేజీలో ఈ సమస్యను ఎదుర్కొంటే, వారు మాకు ఫిర్యాదు చేయవచ్చు’’ అని యూట్యూబ్ వివరించింది.