అమెరికా సహా పలు ఇతర దేశాల్లో యూట్యూబ్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లక్షలాది మంది యూజర్లకు ఈ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ పనిచేయలేదు. యూట్యూబ్ సేవల్లో భారీ అంతరాయం ఏర్పడినట్లు డౌన్‌డిటెక్టర్ ప్లాట్‌ఫామ్ సైతం చూపించింది. దాదాపు 2,03,763 మంది యూజర్లు యూట్యూబ్ పనిచేయడం లేదని నివేదించారు. ఫలితంగా ఇతర సోషల్ మీడియా వేదికల్లో యూట్యూబ్‌పై మీమ్స్, జోక్స్ వెల్లువెత్తుతున్నాయి.
యూట్యూబ్ ప్రధాన సేవలే కాకుండా, ఆ సంస్థకు చెందిన యూట్యూబ్ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్, అలాగే యూట్యూబ్ టీవీలలో కూడా వేలాది మంది యూజర్లు అంతరాయాన్ని ఎదుర్కొన్నారు.
యూట్యూబ్ మ్యూజిక్‌లో 4,873 మందికి పైగా యూజర్లు అంతరాయాన్ని నివేదించారు. యూట్యూబ్ టీవీలో 2,379 మందికి పైగా సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలిపారు.
యూట్యూబ్ డౌన్ అవ్వడంతో యూజర్లు ఎదుర్కొన్న సమస్యల్లో 54 శాతం వీడియో, మ్యూజిక్ స్ట్రీమింగ్‌కు సంబంధించినవేనని డౌన్‌డిటెక్టర్ పేర్కొంది.
యూట్యూబ్ సపోర్ట్ టీమ్ 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) వేదికగా యూజర్ల ఫిర్యాదులకు చురుకుగా సమాధానం ఇస్తోంది! యాప్‌ని ఎలా అన్-ఇన్స్టాల్ చేసి, రీ-ఇన్స్టాల్ చేయాలి? వంటి వివరాలను పంచుకుంటోంది.
కొంతసేపటికి ఈ వ్యవహారంపై యూట్యూబ్ సంస్థ స్పందించింది.
“మొబైల్ డివైజ్‌లలో యూట్యూబ్ క్రాష్ అవుతోందని మీరు చెప్పిన విషయాన్ని పరిశీలిస్తున్నాము. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఇలా అవ్వొచ్చు. “యాప్ అన్ఎక్స్పెక్టెడ్లీ క్లోజ్డ్” అని మీకు కనిపించవచ్చు,” అని యూట్యూబ్ పేర్కొంది.
అనంతరం కొంతసేపటికి యూట్యూబ్ మరో ప్రకటన చేసింది.
“సమస్యను పరిష్కరించాము. మొబైల్లో యాప్ ఇక క్రాష్ అవ్వదు! ఐఓఎస్ డివైజ్ వాడుతుంటే మాత్రం, యాప్‌ని ఒకసారి రీఇన్‌స్టాల్ చేయండి. మీ సహనానికి ధన్యవాదాలు,” అని వెల్లడించింది.
కాగా ఇది డీడీఓఎస్ దాడి అయి ఉండవచ్చని కొన్ని వాదనలు ఉన్నప్పటికీ, ఈ అంతరాయానికి గల కారణంపై యూట్యూబ్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
యూట్యూబ్ సేవల్లో ఏర్పడిన అంతరాయాలు ఎక్కువగా అమెరికా నుంచే నమోదయ్యాయి! డౌన్‌డిటెక్టర్ ప్రకారం.. అమెరికాలోని అన్ని ప్రధాన నగరాల్లో యూట్యూబ్ సేవలు దెబ్బతిన్నాయి. వీటిలో సియాటెల్, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిల్స్, ఫీనిక్స్, చికాగో, న్యూయార్క్, వాషింగ్టన్, డెట్రాయిట్ వంటి నగరాల్లో సమస్య తీవ్రంగా ఉంది.
యూట్యూబ్ డౌన్ అవ్వడంతో ఎక్స్ (ట్విట్టర్)లో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు చాలా మంది యూట్యూబ్ గురించి తెేలుసుకునేందుకు ఎక్స్‌ని వినియోగిస్తున్నారు.
“యూట్యూబ్ పనిచేయడం లేదు! వాస్తవానికి నా ఫోన్ పనిచేయడం లేదేమో అనుకున్నాను. కానీ యూట్యూబ్ పనిచేయడం లేదు,” అని ఒక నెటిజన్ చెప్పుకొచ్చారు.
“నా వై-ఫైలో సమస్య అనుకున్నా! నిజంగానే యూట్యూబ్ పనిచేయడం లేదని తెలిసింది,” అని ఎక్స్‌లో మరొకరు పేర్కొన్నారు.