Inactive Gmail account: చాన్నాళ్లుగా జీమెయిల్ ను వాడడం లేదా?.. వెంటనే యాక్టివేట్ చేసుకోండి.. లేదంటే డిలీటే..
Inactive Gmail account: చాలా రోజులుగా వాడని, ఇనాక్టివ్ గా ఉన్న జీ మెయిల్ అకౌంట్లను పూర్తిగా డిలీట్ చేయాలని గూగుల్ నిర్ణయించింది. త్వరలో ఆ ప్రక్రియను ప్రారంభించనుంది.
Inactive Gmail account: జీమెయిల్ ను ప్రక్షాళన చేయడానికి గూగుల్ సిద్ధమైంది. చాలాకాలంగా ఉపయోగించని జీమెయిల్ ఖాతాలను తొలగించాలని నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా జీమెయిల్ చాలా పాపులర్ ఈ- మెయిలింగ్ సర్వీస్. సెక్యూరిటీతో పాటు పలు ఇతర ఫీచర్స్ ఈ మెయిల్ సర్వీస్ ను పోటీదారుల కన్నా ముందుంచుతున్నాయి.
మొత్తంగా డిలీట్
గతంలో ఇనాక్టివ్ జీమెయిల్ (Gmail) ఖాతాల విషయంలో గూగుల్ వేరేగా వ్యవహరించేది. ఆ ఖాతాలోని కంటెంట్ ను మాత్రం డిలీట్ చేసి, ఖాతాను అలాగే ఉంచేది. కానీ, ఇటీవల ఈ విధానంలో మార్పును తీసుకువచ్చింది. చాన్నాళ్లుగా ఎలాంటి యాక్టవిటీస్ లేకుండా, నిష్క్రియగా ఉన్న జీమెయిల్ ఖాతాలను పూర్తిగా డిలీట్ చేయాలని నిర్ణయించింది.
ఏ అకౌంట్స్ రిస్క్
గూగుల్ కొత్త పాలసీ ప్రకారం, గత రెండేళ్లుగా ఏదైనా జీమెయిల్ (Gmail) ఖాతా ఇన్‌యాక్టివ్‌గా ఉంటే.. Google Drive, Meet, డాక్స్, అలాగే, ఫోటోలతో సహా Google Workspace లోని వివరాలను, మొత్తం కంటెంట్ ను గూగుల్ తొలగిస్తుంది. ఆ అకౌంట్ తో లింక్ అయి ఉన్న యూట్యూబ్ కంటెంట్ ను కూడా తొలగిస్తుంది. ఈ విధానం వ్యక్తిగత ఖాతాలకు మాత్రమే వర్తిస్తుందని, సంస్థలకు సంబంధించిన ఖాతాలకు కాదని గూగుల్ స్పష్టం చేసింది. డిసెంబర్ నెల నుంచి దశలవారీగా ఈ ప్రక్షాళన ప్రక్రియ ప్రారంభిస్తామని వెల్లడించింది. అకౌంట్ ను ఓపెన్ చేసి, ఒక్క సారి కూడా వాడని ఖాతాలను మొదట డిలీట్ చేస్తామని తెలిపింది.
ఇలా చేయండి
చాన్నాళ్లుగా వాడని జీమెయిల్ అకౌంట్ లు డిలీట్ కాకూడదనుకునేవారు, ఆ ఖాతాలను కంటిన్యూ చేయాలనుకునే వారు తరచుగా, వాటిలోకి లాగిన్ అవుతూ ఉండాలి. లేదా, ఆ అకౌంట్ ద్వారా ఏదైనా గూగుల్ సర్వీస్ ను వినియోగించుకున్నా సరిపోతుంది. దాంతో, మీ జీమెయిల్ అకౌంట్ యాక్టివ్ గా ఉంటుంది.