Honda-Nissan Merger : నిస్సాన్-హోండా విలీనానికి బ్రేక్ పడనుందా? ఈ డీల్ ఎందుకు ఆగుతోంది?
Honda-Nissan Merger : నిస్సాన్-హోండా విలీనానికి సంబంధించిన విషయంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. హోండా విలీన ప్రతిపాదనను తిరస్కరించాలని నిస్సాన్ బోర్డు యోచిస్తోందా?
జపాన్ ఆటోమొబైల్ పరిశ్రమలో పెను ప్రకంపనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. 2024 డిసెంబర్‌లో ప్రకటించిన నిస్సాన్, హోండా మధ్య విలీనం ప్రతిపాదన ఇప్పుడు ప్రమాదంలో పడేలా కనిపిస్తోంది. హోండా విలీన ప్రతిపాదనను తిరస్కరించాలని నిస్సాన్ బోర్డు యోచిస్తుందా? ఈ మేరకు వార్తలు వస్తున్నాయి.

ఫైనల్ నిర్ణయం ఎప్పుడు?
నిస్సాన్‌ను హోండా అనుబంధ సంస్థగా మార్చాలన్న హోండా ప్రతిపాదనను తిరస్కరించవచ్చని నిస్సాన్ సూచించింది. ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తే రెండు సంస్థల మధ్య విలీన చర్చలు ఇక క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. బుధవారం నిస్సాన్ బోర్డు సమావేశం ఉంటుందని, ఈ సమావేశంలో ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకోవచ్చని చెబుతున్నారు.
కొందరు వ్యతిరేకం
హోండా ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు 47 బిలియన్ డాలర్లుగా అంచనా. ఇది నిస్సాన్ విలువకు 5 రెట్లు ఎక్కువ. ఈ కారణంగా విలీనం కింద హోండా.. నిస్సాన్ వాటాలను కొనుగోలు చేసి దాని అనుబంధ సంస్థగా చేయాలని భావించింది. అయితే ఈ ప్రతిపాదనను పలువురు సీనియర్ నిస్సాన్ ఎగ్జిక్యూటివ్‌లు వ్యతిరేకిస్తుండగా, మరికొందరు సమర్థిస్తున్నారు.
డీల్ ఏమవుతుందో
ఈ డీల్ విజయవంతమైతే ప్రపంచంలో మరో అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా అవతరించనుంది హోండా, నిస్సాన్. కానీ, ఇప్పుడు చర్చల్లో జాప్యం, విభేదాల కారణంగా ఈ ప్లాన్ దెబ్బతింటుందని వార్తలు వస్తున్నాయి. బుధవారం హోండా షేర్లు 3.2 శాతం పెరగ్గా, నిస్సాన్ షేర్లు మొదట పడిపోయినా ఆ తర్వాత 2.7 శాతం పెరిగాయి. ఈ డీల్ భవితవ్యంపై ఇన్వెస్టర్లు అయోమయంలో ఉన్నట్లు కూడా స్పష్టమవుతోంది.
రెనాల్ట్, మిత్సుబిషి మోటార్స్
నిస్సాన్ విలీనంలో రెనాల్ట్, మిత్సుబిషి మోటార్స్ కూడా అడ్డుపడే అవకాశం ఉందని అంటున్నారు. వీటికి నిస్సాన్‌లో వాటాలు ఉన్నాయి. రెనాల్ట్ ప్రతినిధులు జపాన్ చేరుకుని ఈ ఒప్పందానికి అదనపు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు మిత్సుబిషి మోటార్స్ కార్పొరేషన్ విలీనంలో చేరబోమని ఇప్పటికే సంకేతాలిచ్చింది. హోండా, నిస్సాన్ మధ్య తుది ఒప్పందం కుదిరిన తర్వాతే తమ నిర్ణయాన్ని పరిశీలిస్తామని కంపెనీ తెలిపింది.
ఓకే అయితే
హోండా, నిస్సాన్ చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, ఒప్పందం ఫైనల్ ఫ్రేమ్ వర్క్ 2025 ఫిబ్రవరి మధ్య నాటికి సిద్ధమవుతుందని కొందరు అంటున్నారు. అదే సమయంలో ఈ విలీనం విజయవంతమైతే 2026 ఆగస్టులో జాయింట్ హోల్డింగ్ కంపెనీ షేర్లు మార్కెట్లో లిస్ట్ అవుతాయి. అయితే ఈ ఆఫర్‌ను నిస్సాన్ తిరస్కరిస్తుందనే వార్తలతో ఈ డీల్ భవితవ్యంపై అనుమానాలు ఉన్నాయి. రెండు సంస్థలు తమ విభేదాలను పరిష్కరించుకుని డీల్ చేసుకుంటాయా? లేదా? చూడాలి.
టాపిక్