ఒక్క క్లిక్‌తో రుణం ఇచ్చే మినీ లోన్ యాప్స్‌ వాడటం సురక్షితమేనా? ఒక్కసారి ఇది చదవండి!-is it safe to use mini loan apps that offer loans with one click read this ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఒక్క క్లిక్‌తో రుణం ఇచ్చే మినీ లోన్ యాప్స్‌ వాడటం సురక్షితమేనా? ఒక్కసారి ఇది చదవండి!

ఒక్క క్లిక్‌తో రుణం ఇచ్చే మినీ లోన్ యాప్స్‌ వాడటం సురక్షితమేనా? ఒక్కసారి ఇది చదవండి!

Anand Sai HT Telugu

ప్రస్తుతం లోన్ యాప్‌ల నుండి రుణం పొందడం చాలా ఈజీ అయిపోయింది. మినీ లోన్ యాప్‌లు రుణగ్రహీతల అనుభవాన్ని మార్చాయి. సురక్షితమైన లోన్ యాప్‌లను ఎలా ఎంచుకోవాలి?

మినీ లోన్​ యాప్స్

టీవలి కాలంలో కేవలం ఒక క్లిక్‌తో తక్షణమే లోన్ పొందవచ్చు. మినీ లోన్ యాప్‌లు రుణం పొందే విధానాన్ని ఈజీగా చేసేశాయి. ఇది రుణగ్రహీతల అనుభవాన్ని కూడా మార్చింది. టెక్నాలజీ పెరగడంతో మినీ లోన్ యాప్‌లు మరింత సౌకర్యవంతంగా మారాయి. ఈ యాప్‌లు భారతదేశంలో చిన్న మొత్తాలు, స్వల్పకాలిక తక్షణ రుణాలను అందించడం ద్వారా ప్రజలకు దగ్గరవుతున్నాయి. కానీ ఇవి సురక్షితమేనా? మినీ లోన్ యాప్‌ల ద్వారా లోన్ పొందే ముందు గమనించాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఎందుకంటే లోన్ యాప్స్ ద్వారా మరణాలు కూడా చూశాం.

చిన్న మెుత్తంలో రుణం

సాధారణంగా ఈ యాప్‌లు రూ.5,000 నుండి రూ.1 లక్ష వరకు రుణాలను అందిస్తాయి. అన్ని ప్రక్రియలు డిజిటల్‌గా ఉంటాయి. డబ్బు నిమిషాల్లో మీ ఖాతాకు చేరుతుంది. భారతదేశంలో మినీ లోన్ యాప్‌లను ఉపయోగించే వారి సంఖ్య పెరుగుతోంది. చాలా మంది రుణగ్రహీతలకు చిన్న మొత్తంలో రుణం అవసరం ఉంటుంది. అటువంటి పరిస్థితులలో ఈ యాప్‌లు పెద్ద మొత్తంలో రుణం పొందడం అనే క్లిష్టమైన ప్రక్రియ లేకుండానే ఆర్థిక అవసరాలను తీర్చడంలో సహాయపడతాయి. ఈ యాప్‌లు సాధారణంగా NBFCలు లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో నియంత్రించే ఆర్థిక సేవల సంస్థలతో నడుస్తాయి.

త్వరగానే లోన్

ఇవి ఎక్కువగా ప్రాచుర్యం పొందడానికి ప్రధాన కారణం వాటి వేగం, సౌలభ్యం. బ్యాంకుకు వెళ్లినట్టుగా దరఖాస్తులు నింపాల్సిన అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్, ఆధార్, పాన్ కార్డ్, బ్యాంక్ స్టేట్‌మెంట్ వంటి కొన్ని పత్రాలు కావాలి. మీకు క్రెడిట్ చరిత్ర లేకపోయినా మీరు రుణం పొందవచ్చు. క్రెడిట్ చరిత్ర లేని వారికి రుణాలు ఇవ్వడానికి సాంప్రదాయ బ్యాంకులు వెనకాడతాయి. ఈ యాప్‌లు మొబైల్ వినియోగం, ప్రత్యామ్నాయ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుంటాయి.

చాలా మినీ లోన్ యాప్‌లు 15-30 నిమిషాల్లో డబ్బును పంపిణీ చేస్తాయి. మీరు తక్కువ తిరిగి చెల్లించే వ్యవధిని ఎంచుకోవచ్చు. కాలపరిమితి కొన్ని రోజుల నుండి కొన్ని నెలల వరకు ఉండవచ్చు. కొన్ని యాప్‌లు ఎటువంటి జరిమానాలు లేకుండా మీ లోన్‌ను ముందుగానే చెల్లించడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి.

పూర్తి సమాచారం తెలుసుకోండి

ఏదైనా లోన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకునే ముందు దాని గురించి తెలుసుకోవడం ముఖ్యం. యాప్ ఆర్బీఐలో రిజిస్టర్ అయిందా లేదా లైసెన్స్ పొందిన బ్యాంక్ లేదా NBFC మద్దతు ఉందా అని చెక్ చేయండి. గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్‌ స్టోర్‌లో కామెంట్స్ చదవండి. రుణం తీసుకునే ముందు వడ్డీ రేటు, తిరిగి చెల్లించే షెడ్యూల్ గురించి స్పష్టంగా తెలుసుకోండి. యాప్ గురించి పూర్తి సమాచారం మీరు తెలుసుకోని ఉండాలి.

పర్మిషన్స్ ఎక్కువ అడిగితే

ఫోన్‌లో ఎక్కువ పర్మిషన్స్ అడిగే లేదా తక్షణ వాపసులను డిమాండ్ చేసే యాప్‌లను ఉపయోగించడం ఆపివేయండి. మినీ లోన్ యాప్‌లు సాధారణంగా రూ.5,000 నుండి రూ.1 లక్ష వరకు రుణాలను అందిస్తాయి. కొన్ని ప్లాట్‌ఫామ్‌లు అర్హత కలిగిన రుణగ్రహీతలకు రూ.2 నుంచి 4 లక్షల వరకు రుణాలను అందిస్తాయి.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.