రూ.2000 పైబడిన యూపీఐ లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించబోతోందా? ఈ ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటులో సమాధానం ఇచ్చారు. ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ రూ.2000 యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని చెప్పారు.
రూ.2,000 కంటే ఎక్కువ యూపీఐ లేదా యూపీఐ లావాదేవీలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆలోచిస్తోందా? అని ఇటీవల ఎగువసభలో మంత్రిని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు. రూ.2,000 కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించాలని జీఎస్టీ కౌన్సిల్ నుంచి ఎలాంటి సూచన రాలేదు. జీఎస్టీ రేట్లు, మినహాయింపులు పూర్తిగా జీఎస్టీ కౌన్సిల్ సూచనలపై ఆధారపడి ఉంటాయని కేంద్ర మంత్రి తెలిపారు.
కర్ణాటకలోని వ్యాపారులకు యూపీఐ లావాదేవీల డేటా ఆధారంగా జీఎస్టీ డిమాండ్ నోటీసులు అందిన తర్వాత ఈ సమాధానం వచ్చింది. కర్ణాటకలోని చిన్న తరహా వ్యాపారులకు జారీ చేసిన జీఎస్టీ నోటీసులు రాష్ట్ర ప్రభుత్వమే పంపిందని, కేంద్ర ప్రభుత్వం కాదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా గత వారం అన్నారు.
పన్ను నోటీసులు జారీ చేయడంలో రాష్ట్రానికి ఎటువంటి పాత్ర లేదని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె.శివకుమార్ చేసిన కామెంట్స్‌పై స్పందిస్తూ కేంద్రమంత్రి మాట్లాడారు. 'చిన్న వ్యాపారులకు జీఎస్‌టీ బకాయిల నోటీసులు జారీ చేసింది కర్ణాటక వాణిజ్య పన్ను అధికారులే. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తన ప్రమేయం లేదని నటిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. ఇది బాధ్యత నుండి తప్పించుకునే ప్రయత్నం తప్ప మరొకటి కాదు.'అని జోషి అన్నారు.
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ నోటీసులు జారీ చేసి ఉంటే, అనేక ఇతర రాష్ట్రాల వ్యాపారులకు అవి అందేవని కేంద్రమంత్రి అన్నారు. కానీ అలా మరెక్కడా జరగలేదన్నారు. ఈ నోటీసులు కర్ణాటకలో మాత్రమే ఎందుకు ఇచ్చారని జోషి ప్రశ్నించారు.
మరోవైపు యూపీఐ లావాదేవీలపై ఆర్బీఐ గవర్నర్ చేసిన కామెంట్స్ కూడా ఇటీవల జనాల్లో చర్చకు వచ్చింది. గత కొంత కాలంగా యూపీఐ లావాదేవీలను ఛార్జ్ చేయాలనే చర్చ జోరందుకుంది. గత వారం ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడిన ఆర్బీఐ గవర్నర్ యూపీఐ లావాదేవీలపై ఛార్జీ విధించాలని సూచించారు. ఎందుకంటే ఈ వ్యవస్థను నడపడానికి డబ్బు అవసరమన్నారు. ఎవరైనా ఖర్చును భరించవలసి ఉంటుందని, ఇటీవలి కాలంలో యూపీఐ లావాదేవీలు వేగంగా పెరిగాయన్నారు.