కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో చాలా కాలంగా చర్చలో ఉన్న 8వ వేతన సంఘం గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. గతంలో 8వ వేతన సంఘం జనవరి 1, 2026 నుండి అమలు అవుతుందని భావించారు. మీడియా నివేదికల ప్రకారం 8వ వేతన సంఘం జనవరి 1, 2026 నుండి అమలు అయ్యేలా లేదు. ఇప్పుడు అది ఆలస్యం కావచ్చు అని మీడియా నివేదికలు చెబుతున్నాయి.
8వ వేతన సంఘం సిఫార్సులను సకాలంలో అమలు చేయకపోతే, జనవరి 1, 2026న లేదా ఆ తర్వాత పదవీ విరమణ చేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారి సవరించిన వేతనం, పెన్షన్ ప్రయోజనాలలో జాప్యం జరగవచ్చు. ప్రభుత్వం జనవరి 16, 2025న 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కానీ ఇంకా కమిషన్‌కు ఛైర్మన్‌ను నియమించలేదు. ఇంకా దాని సేవా నిబంధనలు ఖరారు అవ్వలేదు. దాని సిఫార్సులు సకాలంలో అమలు చేస్తారా లేదా అనేది ఇప్పుడు ఉన్న ప్రశ్న.
ఏప్రిల్ 2024లో జారీ చేసిన సర్క్యులర్ ఆధారంగా 8వ వేతన సంఘం ఏర్పాటు అవుతుందా లేదా అనే ప్రశ్న తలెత్తింది. ఆ నివేదికలో దాదాపు 35 పోస్టులను డిప్యుటేషన్ ప్రాతిపదికన భర్తీ చేయడాన్ని ప్రస్తావించారు. అయితే దీనిపై తర్వాత అధికారిక నియామకం ప్రకటించలేదు. కమిషన్ ఇంకా తన పనిని ప్రారంభించలేదు. మునుపటి కమిషన్ల సిఫార్సులను అమలు చేయడానికి 12 నుండి 18 నెలలు పట్టింది. జనవరి 1, 2026 నుంచి అమలు కష్టమేననే అభిప్రాయం చాలా మంది ఉంది.
ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి ఈ సిఫార్సుల ఆర్థిక అమలు 2026-27 కేంద్ర బడ్జెట్‌లో మాత్రమే ప్రతిబింబిస్తుందని, దీని అమలు ఆలస్యం కావచ్చని అన్నారు.
8వ వేతన సంఘం దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సుమారు 65 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. 7వ వేతన సంఘం అమలులో జాప్యం జరిగినప్పటికీ గడువు తర్వాత పదవీ విరమణ చేసే ఉద్యోగులు కూడా బకాయిలు పొందేందుకు అర్హులని చూపిస్తుంది. 7వ వేతన సంఘం సిఫార్సులను అమలు చేయడంలో ప్రభుత్వం ఒక సంవత్సరం ఆలస్యం చేసింది. కానీ తరువాత ఉద్యోగులు, పెన్షనర్లకు పరిహారం అందించింది. 8వ వేతన సంఘం విషయంలోనూ అలానే ఉండే అవకాశం ఉంది.