ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ యాపిల్ ఐఫోన్ 17 సిరీస్‌ని విడుదల చేసి కొన్ని వారాలు మాత్రమే అయింది. అప్పుడే తదుపరి సిరీస్ అయిన ఐఫోన్ 18 గురించి పుకార్లు, లీక్‌లు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొట్టడం మొదలుపెట్టాయి. ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లోకెల్లా అతిపెద్ద రూమర్ ఏంటంటే.. యాపిల్ సంస్థ 2026లో అసలు ఐఫోన్ 18 బేస్ మోడల్‌ను విడుదల చేయకపోవచ్చు! దాన్ని 2027 ప్రథమార్థం తర్వాత లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ రూమర్లు స్టాండర్డ్ ఐఫోన్ 18 గురించి మాత్రమే. ఐఫోన్ 18 సిరీస్‌లోని ఇతర మోడల్స్ అయిన ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్, పుకార్లలో ఉన్న ఐఫోన్ 18 ఫోల్డ్ మాత్రం వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుత నివేదికల ప్రకారం.. రాబోయే ఐఫోన్ 18 లైనప్, ఐఫోన్ 17 సిరీస్‌తో పోలిస్తే చాలా భిన్నంగా ఉండవచ్చు. ఎందుకంటే, తదుపరి ప్రధాన ఐఫోన్ విడుదల మొత్తం ప్రీమియం మోడల్స్‌పైనే దృష్టి పెట్టేలా ఉండబోతోంది. ఇందులో ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్, ఐఫోన్ ఎయిర్ 2, పుకార్లలో ఉన్న ఫోల్డెబుల్ ఐఫోన్ ఉండవచ్చు. మామూలు ఐఫోన్ 18 మోడల్‌ను మాత్రం ఐఫోన్ 18ఈతో కలిపి 2027లో లాంచ్ అవ్వొచ్చు!
మొత్తంగా చూస్తే, 2026లో విడుదలయ్యే ఐఫోన్ లైనప్‌లో ఐదు కొత్త మోడల్స్ ఉండవచ్చు:
ఐఫోన్ 17ఈ (వేసవి ప్రారంభంలో విడుదల కావచ్చు)
ఐఫోన్ 18 ప్రో
ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్
ఐఫోన్ ఎయిర్ 2
ఐఫోన్ 18 ఫోల్డ్
ఇలాంటి విషయం వినడం ఇదే మొదటిసారి కాదు. గతంలో, ఐఫోన్ 17 సిరీస్ విడుదల కాకముందే, తన కచ్చితమైన అంచనాలకు ప్రసిద్ధి చెందిన ప్రముఖ విశ్లేషకుడు మింగ్-చి కువో కూడా ఇదే విషయాన్ని చెప్పారు.
ఈ కొత్త వ్యూహం వల్ల యాపిల్ తన ప్రీమియం మోడల్స్‌పై మరింత దృష్టి సారించడానికి వీలవుతుంది. ఇదే నిజమై, బేస్ మోడల్ లాంచ్ కాకపోతే, ఇన్నేళ్లుగా యాపిల్ పాటిస్తున్న ఆనవాయితీకి బ్రేక్ పడనుంది!
ఇది కాకుండా, రాబోయే ఐఫోన్ 18లో కొత్త తరం యాపిల్ సిలికాన్ ఏ20 చిప్‌ను చూడవచ్చు. ఇది ఐఫోన్ 17లో ఉన్న ఏ19 చిప్ కంటే మెరుగైనది. అదనంగా, ఐఫోన్ 17 సిరీస్ మొత్తం మోడల్స్‌లో మొదటిసారిగా ప్రవేశపెట్టిన 18-మెగాపిక్సెల్ సెంటర్ స్టేజ్ కెమెరాను ఐఫోన్ 18లో కూడా కొనసాగించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.
సంబంధిత కథనం