iPad Air 2024: రెండేళ్ల నిరీక్షణకు తెర; లేటెస్ట్ ఎం2 చిప్ తో ఐప్యాడ్ ఎయిర్ 2024 సిరీస్ లాంచ్
iPad Air 2024: ల్యాండ్ స్కేప్ కెమెరా, సెంటర్ స్టేజ్, సరికొత్త ఎం2 చిప్ వంటి ఫీచర్లతో ఐప్యాడ్ ఎయిర్ ను యాపిల్ లాంచ్ చేసింది. దాదాపు రెండు సంవత్సరాల తరువాత ఆపిల్ ఐ ప్యాడ్ మోడల్స్ ను అప్ డేట్ చేసింది. లేటెస్ట్ గా లాంచ్ అయిన ఐ ప్యాడ్ ఎయిర్ 2024 మోడల్ ధర, ఫీచర్లు, ఇతర వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
iPad Air 2024: దాదాపు 2 సంవత్సరాల నిరీక్షణ తరువాత, ఆపిల్ చివరికి మే 7 న లెట్ లూజ్ ఈవెంట్ లో కొత్త ఐప్యాడ్ ఎయిర్ తో తన ఐప్యాడ్ లైనప్ ను అప్ డేట్ చేసింది. ఐ ప్యాడ్ డివైజెస్ ను మార్కెట్లోకి తీసుకువచ్చిననాటి నుంచి ఇది అతి పెద్ద లాంచింగ్ ప్రకటన అని యాపిల్ పేర్కొంది. సాధారణ పత్రికా ప్రకటన ద్వారా విడుదల చేసిన మాక్ బుక్ ల మాదిరిగా కాకుండా, ఐప్యాడ్ ఎయిర్ (iPad Air 2024)ను కంపెనీ లైవ్-స్ట్రీమింగ్ వీడియో ద్వారా ప్రవేశపెట్టింది. దీని ఫీచర్లు, స్పెక్స్, ధర ల వివరాలు మీ కోసం..
ఐప్యాడ్ ఎయిర్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
కొత్త ఐప్యాడ్ ఎయిర్ ను రెండు స్క్రీన్ సైజుల్లో విడుదల చేశారు. అవి ఒకటి 11-అంగుళాల స్క్రీన్ సైజ్ కాగా, మరొకటి 13 అంగుళాల స్క్రీన్ సైజ్. ఈ రెండింటిలో సెంటర్ స్టేజ్ వంటి సుపరిచిత ఆపిల్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ మోడల్స్ లో కెమెరాను స్క్రీన్ పై ల్యాండ్ స్కేప్ ఎడ్జ్ కు మార్చారు. ఆ ఎడ్జ్ లోనే స్పేషియల్ ఆడియో, స్టీరియో స్పీకర్లు కూడా ఉంటాయి.
ఆపిల్ సిలికాన్ ఎం2 చిప్
లేటెస్ట్ గా లాంచ్ చేసిన ఐప్యాడ్ ఎయిర్ సిరీస్ లో కొత్త ఆపిల్ సిలికాన్ ఎం2 చిప్ ను తొలిసారి పొందుపర్చారు. ఎం1 ఐప్యాడ్ ఎయిర్ కంటే ఇది 50 శాతం వేగవంతమైనదని ఆపిల్ సంస్థ పేర్కొంది. ఇది విజువల్ లుక్ అప్, మెరుగైన ఇమేజ్ ఎడిటింగ్ సామర్థ్యాలు వంటి మెషిన్ లెర్నింగ్ ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. ఇది మ్యాజిక్ కీబోర్డ్, ఆపిల్ పెన్సిల్ తో పనిచేస్తుందని ఆపిల్ పేర్కొంది. అంతేకాక, ఇది ఆపిల్ పెన్సిల్ యొక్క హోవర్ ఫీచర్ ను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఈ సరికొత్త ఐ ప్యాడ్ లో స్టోరేజీని కూడా పెంచారు. 64 జీబీ నుంచి 128 జీబీ స్టోరేజ్ ను స్టాండర్డ్ గా తీసుకొచ్చింది. కొత్త ఐప్యాడ్ ఎయిర్ ఇప్పుడు 1 టిబి వరకు స్టోరేజ్ కు మద్దతు ఇస్తుంది.
ఐప్యాడ్ ఎయిర్ ధర, లభ్యత
స్టోరేజ్ ను పెంచినప్పటికీ, ఐప్యాడ్ ఎయిర్ ధరలో ఆపిల్ మార్పు చేయలేదు. 11 అంగుళాల ఐప్యాడ్ ఎయిర్ ప్రారంభ ధర 599 డాలర్లు కాగా, 13 అంగుళాల వేరియంట్ ధర 799 డాలర్లుగా నిర్ణయించారు. భారతదేశంలో, 11 అంగుళాల ఐప్యాడ్ ఎయిర్ వై-ఫై మోడల్ రూ .59900, వై-ఫై + సెల్యులార్ మోడల్ రూ .74900 నుండి ప్రారంభమవుతుంది. 13 అంగుళాల ఐప్యాడ్ ఎయిర్ వైఫై మోడల్ ధర రూ.79,900 కాగా, వై-ఫై+ సెల్యులార్ మోడల్ ధర రూ.94,900గా నిర్ణయించారు.
నాలుగు కలర్స్ లో..
ఐప్యాడ్ ఎయిర్ 2024 మోడల్స్ లోని రెండు వేరియంట్లను మే 7వ తేదీ నుంచి ప్రి ఆర్డర్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న వారం రోజుల్లోగా డెలివరీ ఉంటుందని ఆపిల్ వెల్లడించింది. కాగా, ఈ సరికొత్త ఐప్యాడ్ ఎయిర్ బ్లూ, స్టార్ లైట్, పర్పుల్, స్పేస్ గ్రే అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కాగా, ఐప్యాడ్ ఎయిర్ లో ఇప్పటికీ ఫేస్ ఐడీ లేకపోవడం గమనార్హం. టచ్ ఐడీ ఇప్పటికీ మద్దతు ఇస్తుంది. 5జీ కనెక్టివిటీని కూడా సపోర్ట్ చేస్తుంది.