Ola Share Price : ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి ఓలా షేర్లు.. పెట్టుబడిదారులకు రూ.40,000 కోట్లు లాస్
Ola Share Price : భవిష్ అగర్వాల్ నేతృత్వంలోని ఓలా ఎలక్ట్రిక్ షేర్లలో నిరంతర క్షీణత పెట్టుబడిదారులపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. అత్యధిక వాల్యుయేషన్ తర్వాత కంపెనీ షేర్లు దాదాపు రూ.40,000 కోట్లు నష్టపోయాయి.

భవిష్ అగర్వాల్ నేతృత్వంలోని ఓలా ఎలక్ట్రిక్ షేర్లు పడిపోతూనే ఉన్నాయి. సుమారు రూ.40,000 కోట్లు తుడిచిపెట్టుకుపోవడంతో పెట్టుబడిదారులు తీవ్రంగా ప్రభావితమయ్యారు. లిస్టింగ్ తర్వాత ప్రారంభ పెరుగుదల రూ.66,000 కోట్ల విలువైన కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇప్పుడు రూ.26,187.81 కోట్లకు తగ్గింది.
గత ఏడాది ఆగస్టులో ఒక్కో షేరుకు రూ.76 చొప్పున అరంగేట్రం చేసిన ఈ స్టాక్, నిరంతర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మంగళవారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో ఇది 3 శాతానికి పైగా తగ్గి ఆల్ టైమ్ కనిష్ట స్థాయి రూ.58.84కి చేరుకుంది.
పెరుగుతున్న నష్టాలు, తగ్గుతున్న ఆదాయం, కొనసాగుతున్న సేవా సంబంధిత సమస్యలు, మరోవైపు భారత స్టాక్ మార్కెట్ల పతనం ఈ స్టాక్ తగ్గడానికి కారణమయ్యాయి. గత వారం ఈ ఎలక్ట్రిక్ సంస్థ దాని ఏకీకృత నికర నష్టం 50 శాతం పెరిగిందని నివేదించింది. ఇది Q3 FY24లో రూ.376 కోట్ల నుండి Q3 FY25లో రూ.564 కోట్లకు పెరిగింది.
సంస్థ నిర్వహణ ఆదాయం కూడా 19 శాతం తగ్గి రూ.1,296 కోట్ల నుండి రూ.1,045 కోట్లకు పడిపోయింది. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఈ త్రైమాసికంలో అధిక పోటీ తీవ్రత, సేవా సవాళ్ల కారణంగా నష్టాలు పెరిగాయని కంపెనీ పేర్కొంది. అయితే ఎలక్ట్రిక్ మొబిలిటీ అగ్రిగేటర్ సర్వీస్ సమస్యలు పరిష్కరమయ్యాయయని, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో తన ఉనికిని పెంచుకోవడంపై దృష్టి సారించిందని కంపెనీ చెప్పింది.
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో కంపెనీ మార్కెట్ వాటా గత ఏడాది డిసెంబర్‌లో 20 శాతం కంటే తక్కువగా పడిపోయింది. ఫిబ్రవరి 7న జరిగిన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో అక్టోబర్ నెలలో పండుగ అమ్మకాల కారణంగా బలమైన పనితీరు కనిపించిందని తెలిపింది. అయితే అధిక పోటీ తీవ్రత, సేవా సవాళ్ల కారణంగా మొత్తం త్రైమాసికం బలహీనంగా ఉందని కంపెనీ పేర్కొంది.
తప్పుదారి పట్టించే ప్రకటనలు, అన్యాయమైన వాణిజ్య పద్ధతుల ఆరోపణలపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) కంపెనీకి షో-కాజ్ నోటీసు జారీ చేసింది. కొనసాగుతున్న దర్యాప్తునకు సంబంధించి ఓలా ఎలక్ట్రిక్ నుండి అనేక వివరణలను కోరింది.
అయితే ఓలా ఎలక్ట్రిక్ తన స్టోర్ నెట్‌వర్క్‌ను విస్తరించింది. సేవా సంబంధిత సమస్యలను పరిష్కరించినట్లు పేర్కొంది.
సంబంధిత కథనం