personal loan: పర్సనల్ లోన్ తో స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారా?.. ఈ రిస్క్స్ ఉన్నాయి చూడండి..
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నవారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. కొరొనా అనంతరం పెరిగిన డీ మ్యాట్ ఖాతాల సంఖ్యే అందుకు నిదర్శనం. స్టాక్స్ పై పెట్టుబడులతో భారీగా లాభాలు పొందవచ్చన్న ఆశతో చాలామంది బ్యాంక్ ల్లో పర్సనల్ లోన్స్ తీసుకుంటున్నారు. అందులో అడ్వాంటేజెస్ తో పాటు రిస్క్ లు కూడా ఉన్నాయి.
Investing with a personal loan: స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ఉద్దేశ్యంతో బ్యాంక్ ల నుంచి పర్సనల్ లోన్ తీసుకోవడంలో రిస్క్ తో పాటు అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ కోసం పర్సనల్ లోన్ తీసుకోవడంలో కొంత ప్రయోజనం ఉన్నప్పటికీ, ఆర్థిక నిపుణుల సలహాతో సరిగ్గా ప్లాన్ చేయకపోతే.. అది భారీ నష్టాలకు దారి తీయవచ్చు.
పర్సనల్ లోన్స్ అంటే..?
పర్సనల్ లోన్ అనేది వ్యక్తిగత అవసరాలు లేదా అనూహ్య ఖర్చుల కోసం తీసుకునే రుణం. తిరిగి తీర్చే సామర్ధ్యంపై ఆధారపడి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఈ రుణాలను బ్యాంక్ లు, ఫైనాన్స్ సంస్థలు ఇస్తుంటాయి. ఈ రుణాన్ని సులభంగా పొందవచ్చు. సెక్యూర్డ్ లోన్లతో పోలిస్తే రుణాలు ఇచ్చే బ్యాంక్ లు లేదా ఫైనాన్స్ సంస్థలకు రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వ్యక్తిగత రుణాలకు సాధారణంగా అధిక వడ్డీరేటు ఉంటుంది. వ్యక్తిగత రుణాలపై అందించే వడ్డీ రేట్లు సంవత్సరానికి 16% నుండి 44% మధ్య ఉంటుంది. ఇవి సాధారణంగా మీ క్రెడిట్ స్కోర్, గత క్రెడిట్ హిస్టరీ, రుణదాతతో మీ సంబంధంపై ఆధారపడి ఉంటాయి.
పర్సనల్ లోన్స్ తో స్టాక్స్ లో పెట్టుబడులు: ప్రయోజనాలు
- పర్సనల్ లోన్ తీసుకుని స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడంలొ కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్స్ లో భారీ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, వాటిపై నుంచి వచ్చే రాబడులపై నమ్మకం ఉంటే, పర్సనల్ లోన్ తీసుకోవడం తెలివైన చర్య అవుతుంది.
- వ్యక్తిగత రుణాల ద్వారా, నిధులను త్వరగా యాక్సెస్ చేయవచ్చు. తద్వారా ఐపీఓ (IPO) ల్లో, ఇతర టైమ్ సెన్సిటివ్ స్టాక్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు.
- వ్యక్తిగత రుణాల మరో ప్రయోజనం, ఇవి తీసుకోవడానికి ఎలాంటి తనఖా లేదా పూచీకత్తు అవసరం లేదు. అందువల్ల, మీరు నష్టపోయినా, మీ స్థిరాస్తులను కోల్పోరు.
- వ్యక్తిగత రుణాన్ని పెట్టుబడి (investment) అవసరాల కోసం ఉపయోగించడం మంచి అవకాశమని రెలిగేర్ ఫిన్వెస్ట్ సీఈఓ పంకజ్ శర్మ అన్నారు. ‘‘స్టాక్స్ లో పెట్టుబడి పెట్టడం లేదా చిన్న వ్యాపారాన్ని ప్రారంభించడం వంటి ఆశాజనక వెంచర్లకు వ్యక్తిగత రుణాలు నిధులను త్వరగా అందిస్తాయి. అవి సరళమైన దరఖాస్తు ప్రక్రియను కలిగి ఉంటాయి’’ అని వివరించారు.
పర్సనల్ లోన్స్ తో స్టాక్స్ లో పెట్టుబడులు: రిస్క్స్
- వ్యక్తిగత రుణాలకు సాధారణంగా మార్కెట్లోని ఇతర రుణాలతో పోలిస్తే అధిక వడ్డీ రేట్లు ఉంటాయి. అందువల్ల, మీ రుణంపై వసూలు చేసే వడ్డీ మీ పెట్టుబడి రాబడి కంటే ఎక్కువగా ఉంటే, పెట్టుబడి కోసం వ్యక్తిగత రుణం తీసుకోవడం నష్టమే.
- స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ (mutual funds) మార్కెట్ యొక్క అస్థిరత కారణంగా రిస్క్ తో కూడిన పెట్టుబడులు. అందువల్ల, మీరు లాభం పొందుతారనే గ్యారంటీ లేదు. పెట్టుబడి రాబడుల నుండి రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించగలుగుతారన్న గ్యారెంటీ ఉండదు. అందువల్ల ఇతర ఆదాయ మార్గంతో వ్యక్తిగత రుణాలను తీర్చే పరిస్థితి లేకపోతే, పర్సనల్ లోన్స్ తో స్టాక్స్ (stock market) లో పెట్టుబడులు పెట్టడం రిస్క్ తో కూడుకున్నదే.
- మీరు మీ పెట్టుబడి నుండి లాభం పొందడంలో విఫలమై, రుణాన్ని సకాలంలో చెల్లించలేకపోతే, మీరు తీసుకున్న రుణ భారం పెరిగిపోతూ ఉంటుంది. ఇది మిమ్మల్ని అప్పుల ఊబిలోకి నెడ్తుంది. ఈఎంఐలను సకాలంలో చెల్లించనట్లయితే, మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. అది భవిష్యత్తులో మీరు తీసుకోబోయే రుణాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
- సాధారణంగా వ్యక్తిగత రుణాలకు వడ్డీ రేట్ ఎక్కువగా ఉంటుంది. రీపేమెంట్ టర్మ్స్ తక్కువగా ఉంటుంది. అందువల్ల, పర్సనల్ లోన్ తీసుకుని పెట్టుబడులు పెట్టే ముందు అన్ని రిస్క్ లు, ప్రయోజనాలను బేరీజు వేసుకోవడం సముచితం.
పెట్టుబడుల కోసం వ్యక్తిగత రుణం తీసుకునే ముందు గమనించాల్సిన అంశాలు
- మార్కెట్లో పెట్టుబడి పెట్టడం రిస్క్ లతో కూడుకున్నది. అది మిమ్మల్ని అప్పుల్లోకి నెట్టవచ్చు. అందువల్ల, మీ సామర్థ్యాలను అర్థం చేసుకోవడం, అంచనా వేసుకోవడం చాలా ముఖ్యం.
- మీ పెట్టుబడి నుండి మీరు ఆశిస్తున్న రాబడిని, మీరు చెల్లించే వడ్డీని కంపేర్ చేయండి. మీరు చెల్లించే వడ్డీ కన్నా మీ పెట్టుబడులపై రాబడి ఎక్కువగా ఉంటుందని నిశ్చయించుకోండి. రాబడులు ఎక్కువగా లేకపోతే పర్సనల్ లోన్ తీసుకోవడం మంచిది కాదు.
- పెట్టుబడి పెట్టే ముందు, మీకు ఇతర స్థిరమైన ఆదాయ మార్గం ఉండేలా చూసుకోండి. ఒకవేళ పెట్టుబడిపై నష్టాలను ఎదుర్కొన్నట్లయితే రుణాన్ని తిరిగి చెల్లించడానికి అదనపు నిధులు ఉన్నాయని నిర్ధారించుకోండి.
- వ్యక్తిగత రుణాలతో పాటు, మీ బడ్జెట్ కు బాగా సరిపోయే ప్రత్యామ్నాయ ఎంపికలను కూడా అన్వేషించండి.
ముగింపు
పెట్టుబడుల కోసం వ్యక్తిగత రుణం తీసుకోవడం రిస్క్ తో కూడుకున్నది. ఏదైనా ఊహించని నష్టాలను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటేనే ఆ నిర్ణయం తీసుకోవాలి. సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లడం చాలా ముఖ్యం. నష్టాలు ఎదురైతే, ఉపయోగించగల అత్యవసర నిధులను సిద్ధంగా ఉంచుకోవాలి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మార్కెట్ నియమనిబంధనలతో పాటు పెట్టుబడులపై ఆర్బీఐ మార్గదర్శకాలను అర్థం చేసుకోవడం మంచిది.
టాపిక్