Interarch Building IPO: జీఎంపీ రూ. 325; ఈ ఐపీఓ కు ఇన్వెస్టర్లు క్యూ కడ్తున్నారు..-interarch building ipo day 2 gmp subscription status to review apply or not ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Interarch Building Ipo: జీఎంపీ రూ. 325; ఈ ఐపీఓ కు ఇన్వెస్టర్లు క్యూ కడ్తున్నారు..

Interarch Building IPO: జీఎంపీ రూ. 325; ఈ ఐపీఓ కు ఇన్వెస్టర్లు క్యూ కడ్తున్నారు..

HT Telugu Desk HT Telugu
Aug 20, 2024 03:18 PM IST

ఇంటర్ ఆర్చ్ బిల్డింగ్ ఐపీఓ కు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఆగస్ట్ 20న, ఐపీఓ ఓపెన్ అయిన రెండో రోజు, ఈ ఐపీఓ 8 రెట్లు సబ్ స్క్రైబ్ అయింది. నేడు గ్రే మార్కెట్లో కంపెనీ షేర్లు రూ.326 ప్రీమియంతో లభిస్తున్నాయని మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు..

ఇంటర్ ఆర్చ్ బిల్డింగ్ ఐపీఓ
ఇంటర్ ఆర్చ్ బిల్డింగ్ ఐపీఓ

Interarch Building IPO: నోయిడాకు చెందిన ఇంటర్ ఆర్చ్ కన్స్ట్రక్షన్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, పూర్తి ప్రీ-ఇంజనీరింగ్డ్ స్టీల్ కన్స్ట్రక్షన్ సొల్యూషన్లను అందించడంలో అగ్రగామిగా ఉంది. ఇది 19 ఆగస్టు 2024 న భారత ప్రైమరీ మార్కెట్లోకి వచ్చింది. ఇంటర్ ఆర్చ్ కన్ స్ట్రక్షన్ ప్రొడక్ట్స్ ఐపీఓ కోసం బిడ్డింగ్ 2024 ఆగస్టు 21 వరకు అంటే ఈ వారం బుధవారం వరకు తెరిచి ఉంటుంది. ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ను రూ.850 నుంచి రూ. 900 మధ్య కంపెనీ నిర్ణయించింది. ఆగస్టు 21న ఐపీఓ ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.179.49 కోట్లను కంపెనీ సమీకరించింది.

రిటైలర్లకు 35% రిజర్వ్..

ఈ ఐపీఓలో రిటైల్ ఇన్వెస్టర్లకు ఇష్యూ పరిమాణంలో ముప్పై ఐదు శాతం, అర్హత కలిగిన సంస్థాగత ఇన్వెస్టర్లకు 50%, నాన్ ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు మిగిలిన పదిహేను శాతం షేర్లను రిజర్వ్ చేశారు. రిటైల్ ఇన్వెస్టర్ల ఒక్కో లాట్ లో కనీసం 16 ఈక్విటీ షేర్ల చొప్పున 17 లాట్స్ కు అప్లై చేయవచ్చు. ఒక్కో లాట్ కు కనీసం రూ. 14,400 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఐపీఓ షేర్స్ అలాట్ మెంట్ ఆగస్టు 22న ఉంటుంది. అదే రోజు రిఫండ్స్ ప్రారంభించి, ఆగస్టు 23, శుక్రవారం షేర్లను కేటాయింపుదారుల డీమ్యాట్ ఖాతాల్లో జమ చేస్తారు. ఇంటర్ ఆర్చ్ బిల్డింగ్ ఐపీఓ షేర్లు ఆగస్టు 26 సోమవారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.

ఇంటర్ ఆర్చ్ బిల్డింగ్ కంపెనీ వివరాలు..

ఇంటర్ ఆర్చ్ బిల్డింగ్ ప్రొడక్ట్స్ అనేది భారతదేశంలో ప్రీ-ఇంజనీరింగ్డ్ స్టీల్ కన్స్ట్రక్షన్ సొల్యూషన్స్ అందించే ప్రముఖ ప్రొవైడర్. స్టీల్ నిర్మాణాల వ్యవస్థాపన, నిర్మాణం కోసం డిజైన్, ఇంజనీరింగ్, తయారీ, ఆన్-సైట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నైపుణ్యాల ఇంటిగ్రేటెడ్ సేవలను అందిస్తుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నిర్వహణ ఆదాయం రూ.1,123.93 కోట్ల నుంచి రూ.1,293.30 కోట్లకు, పన్ను అనంతర లాభం రూ.81.46 కోట్ల నుంచి రూ.86.26 కోట్లకు పెరిగాయి.

ఐపీఓ కు అప్లై చేయొచ్చా?

స్టోక్స్ బాక్స్ రీసెర్చ్ సంస్థ ఇంటర్ ఆర్చ్ బిల్డింగ్ ఐపీఓ (IPO) కు సబ్ స్క్రైబ్ ట్యాగ్ ఇచ్చింది. ‘‘ఇంటర్ ఆర్చ్ సంస్థకు బలమైన మార్కెట్ స్థానం ఉంది. ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్, వైవిధ్యమైన కస్టమర్ బేస్ ఉంది. సమర్థవంతంగా, సకాలంలో ప్రాజెక్ట్ ను అమలు చేస్తుందన్న పేరు ఉంది. అందువల్ల, ఇన్వెస్టర్లు మీడియం నుండి దీర్ఘకాలిక దృక్పథంతో ఈ ఐపీఓకు సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు’’ అని స్టోక్స్ బాక్స్ రీసెర్చ్ అనలిస్ట్ పార్థ్ షా చెప్పారు. స్వస్తికా ఇన్వెస్ట్ మెంట్ కూడా ఈ ఇష్యూకు 'సబ్ స్క్రైబ్' ట్యాగ్ ఇచ్చింది.

ఇంటర్ ఆర్చ్ బిల్డింగ్ ప్రొడక్ట్స్ ఐపీఓ సబ్ స్క్రిప్షన్ స్టేటస్

ఇంటర్ ఆర్చ్ బిల్డింగ్ ప్రొడక్ట్స్ ఐపీఓకు నాన్ ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి బలమైన స్పందన బిడ్డింగ్ రెండో రోజు కూడా కొనసాగింది. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి కూడా మంచి స్పందన లభించింది. ఈ ఐపీఓకు రెండో రోజు మధ్యాహ్నం వరకు 7.12 రెట్లు సబ్ స్క్రిప్షన్ లభించింది. నాన్ ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు 19.49 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్లు 5.49 రెట్లు సబ్ స్క్రైబ్ చేశారు. క్వాలిఫైడ్ ఇన్ స్టిట్యూషనల్ బయ్యర్స్ (QIB) కోటా 30% సబ్ స్క్రైబ్ అయింది. ఎంప్లాయీస్ షేర్ 8.05 రెట్లు బుక్ అయింది.

ఇంటర్ ఆర్చ్ బిల్డింగ్ ఐపీఓ వివరాలు

ప్రస్తుత ప్రమోటర్లు, షేర్ హోల్డర్లు 44.48 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (OFS )తో పాటు రూ.200 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనున్నారు. టాప్ ప్రైసింగ్ బ్యాండ్ ప్రకారం ఓఎఫ్ఎస్ విలువ సుమారు రూ.400 కోట్లు. కొత్త ఇష్యూ ద్వారా వచ్చే నికర ఆదాయం సాధారణ కంపెనీ లక్ష్యాలు, సాంకేతిక మెరుగుదలలు, మూలధన వ్యయాలకు వెళ్తుంది.

ఇంటర్ ఆర్చ్ బిల్డింగ్ ప్రొడక్ట్స్ జీఎంపీ

ఇంటర్ ఆర్చ్ బిల్డింగ్ IPO జీఎంపీ (GMP) నేడు +325 గా ఉంది. దీంతో గ్రే మార్కెట్లో ఇంటర్ ఆర్చ్ బిల్డింగ్ ప్రొడక్ట్స్ షేరు ధర రూ.325 వద్ద ట్రేడవుతోందని investorgain.com తెలిపింది. అంటే, గ్రే మార్కెట్లో ప్రస్తుత ప్రీమియంను పరిగణనలోకి తీసుకుంటే, ఇంటర్ ఆర్చ్ బిల్డింగ్ ప్రొడక్ట్స్ షేరు ధర అంచనా లిస్టింగ్ ధర రూ .1,225 గా ఉండవచ్చు. ఇది ఐపీఓ ధర రూ .900 కంటే 36.11% ఎక్కువ.

సూచన: ఈ వ్యాసంలోని అభిప్రాయాలు, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులవి. ఇవి హెచ్ టీ తెలుగు అభిప్రాయాలకు ప్రాతినిధ్యం వహించవు. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించాలని మేము పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము.