Personal loan tips : ఇన్స్టెంట్ పర్సనల్ లోన్‌కి ప్రీ- అప్రూవ్డ్ లోన్‌కి తేడా ఏంటి?
Instant personal loan vs pre approved loan : ఇన్స్టెంట్ పర్సనల్ లోన్‌కి ప్రీ- అప్రూవ్డ్ పర్సనల్ లోన్‌కి మధ్య వ్యత్యాసం ఏంటి? ఈ రెండింటిలో ఒకదాన్ని పిక్ చేసే ముందు ఏ విషయాలను పరిగణలోకీ తీసుకోవాలి? ఇక్కడ తెలుసుకోండి..
ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ అని, ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్ అని.. ఇలా రోజు మీకు కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయా? అయితే, అసలు ఇన్స్టెంట్ పర్సనల్ లోన్‌కి, ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్‌కి మధ్య వ్యత్యాసం ఏంటో మీకు తెలుసా? ఈ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకునే ముందు ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలో తెలుసా? ఇక్కడ చూసేయండి..

ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ అంటే ఏమిటి?
ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ అనేది మీరు ఎక్కువ రోజులు వేచి ఉండకుండా తక్షణమే పొందగల డబ్బు! ఒక కస్టమర్‌కి సంబంధించిన ఇకేవైసీ ఇప్పటికే పూర్తయిన సందర్భాల్లో ఈ తరహా లోన్లు చాలా సాధారణం. పాన్‌తో లింక్ చేసిన మొబైల్ నెంబర్‌ను షేర్ చేసి ఆన్లైన్ వెరిఫికేషన్ చేయించుకుంటే చాలు.
లోన్ ఇచ్చే సంస్థ మీ మొబైల్ నెంబరును ధృవీకరించడానికి ఒక OTPని పంపుతుంది. కస్టమర్ ఆ OTPని ఎంటర్ చేసినప్పుడు, రుణదాత అతని/ఆమె క్రెడిట్ స్కోర్ సహా ప్రొఫైల్‌ను వెరిఫై చేస్తారు. దీని ఆధారంగా కస్టమర్‌కు లోన్ ఆఫర్ పంపిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇక్కడ మీరు ఇకేవైసీని పూర్తి చేసిన తర్వాత మీకు లోన్ ఆఫర్ వస్తుంది.
ప్రీ-అప్రూవ్డ్ లోన్ అంటే ఏమిటి?
కస్టమర్ ప్రొఫైల్ ఆధారంగా వారికి ఇచ్చే లోన్ ఆఫర్ ఇది. ఉదాహరణకు.. చాలా ఎక్కువ క్రెడిట్ స్కోర్ (720 కంటే ఎక్కువ) ఉన్నవారు బ్యాంకు నుంచి రూ .5 లక్షలు రుణం తీసుకునే ఆఫర్ పొందొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే.. మీ వివరాలు ముందే ఉంటాయి కాబట్టి, బ్యాంక్ మీకు ఎంత లోన్ ఇవ్వాలో ముందే నిర్ణయించి, దానిని ఆఫర్ చేస్తుంది.
ఏ విషయాలను పరిగణలోకి తీసుకోవాలి?
1. వడ్డీ రేటు: ఏ లోన్ తీసుకున్నా ముందు పరిగణనలోకి తీసుకోవాల్సిన ముఖ్యమైన అంశం.. వడ్డీ రేటు. కొన్నిసార్లు, ప్రీ-అప్రూవ్డ్ లోన్ విషయంలో బ్యాంకులు అధిక వడ్డీ రేటును వసూలు చేస్తాయి. కాబట్టి, మీకు ఇప్పటికే ఆఫర్ ఉన్నా, ఇతర ఆప్షన్స్‌ని కూడా చూడటం బెటర్.
2. రుణదాత క్రెడిబులిటీ: సదరు కంపెనీ గుర్తింపును కూడా పరిగణలోకి తీసుకోవడం చాలా అవసరం. ఒక బ్యాంకు ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్ ఇచ్చినంత మాత్రాన, అది మీ ఉత్తమ ప్రయోజనాల కోసమే అని అనుకోకూడదు! ఏదైనా వ్యాపారమే. ఎవరూ ఊరికే డబ్బులు ఇవ్వరు.
ఇందులో కొన్ని హిడెన్ ఛార్జీలు ఉండవచ్చు. కాబట్టి, రుణదాత ప్రతిష్ఠను, గుర్తింపును చెక్ చేసి, ఆ ఆఫర్ మంచిదేనా? కాదా? అని నిర్ధారించుకోవాలి.
3. అమౌంట్: చివరిగా.. మీ రుణ అవసరాన్ని తీర్చడానికి ఆఫర్ చేసిన డబ్బు ఇది సరిపోతుందా? లేదా? చూసుకోండి. సరిపోతే మంచిదే! సరిపోకపోతే.. వేరే ఆప్షన్ని చూసుకోవడం బెటర్. ఇక్కడ నుంచి ఒక రుణాన్ని, అక్కడి నుంచి ఇంకో లోన్ని తీసుకుంటే ఆర్థిక భారం మరింత పెరుగుతుంది.
(గమనిక: లోన్ తీసుకోవడం రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం అని గుర్తుపెట్టుకోవాలి.)
సంబంధిత కథనం