టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో.. ఇవి ఇండియాలో లీడింగ్ టెక్ కంపెనీలు. వీటిల్లో ఉద్యోగం చేయాలని ఐటీ ప్రొఫెషనల్స్ కలలు కంటూ ఉంటారు. అయితే ప్రముఖ సామాజిక మాధ్యమం రెడ్డిట్‌లో వైరల్ అయిన పోస్ట్.. దేశ ఐటీ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారికి షాక్‌కి గురిచేస్తోంది! ఇండియాలోని కొన్ని బడా ఐటీ కంపెనీల్లో నుంచి రిక్రూట్మెంట్ చేసుకోకూడదని.. అమెరికాకు చెందిన రిక్రూటర్ 'గైడ్‌లైన్స్'లో ఉన్నట్టు ఓ వ్యక్తి రెడ్డిట్‌లో పోస్ట్ చేశాడు. అసలేం జరిగిందంటే..
ఓ రిక్రూటర్ తనకు అనుకోకుండా 'సీక్రెట్ ఇంటర్నల్ సెలక్షన్ గైడ్‌లైన్స్'ని షేర్ చేసినట్టు రెడ్డిట్ యూజర్ చెప్పుకొచ్చాడు. ఒక వ్యక్తిని ఉద్యోగానికి ఎంపిక చేసే సమయంలో ఏ విషయాలను పరిశీలించాలి? అన్న వివరాలను అందులో ఉన్నాయని అతను వెల్లడించాడు.
గైడ్‌లైన్స్ ప్రకారం.. టాప్ యూనివర్సిటీల్లో కంప్యూటర్ సైన్స్ చదివిన వారికి ప్రాధాన్యత లభిస్తుంది. అదే సమయంలో పలు కంపెనీల్లో పనిచేసిన వారిని ఉద్యోగంలో తీసుకోకుడదు.
"ఎంఐటీ, స్టాన్‌ఫర్డ్, యూసీ బెర్క్లే, యూఐయూసీ, యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ, కాల్టెక్ వంటి వర్సిటీల్లో సీఎస్‌లో బ్యాచిలర్ లేదా మాస్టర్స్ చేసిన వారికి ఉద్యోగం ఇవ్వాలి. ఇతర స్కూల్స్‌లో 4.0 కన్నా ఎక్కువ జీపీఏతో పాస్ అయిన వారికి మినహాయింపు లభించవచ్చు. 4-10ఏళ్ల సాఫ్ట్వేర్ ఎక్స్‌పీరియెన్స్, జావాస్క్రిప్ట్, ఏఐ/ఎల్ఎల్ఎంలో అనుభవం ఉండాలి," అని ఆ రిక్రూటర్ గైడ్‌లైన్స్‌లో ఉంది.
"స్టార్టప్ ఎక్స్‌పీరియెన్స్ ఉంటే తప్ప కొన్ని బడా కంపెనీల నుంచి రిక్రూట్ చేసుకోకూడదు. కన్సల్టింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వారు అస్సలు వద్దు," అని కూడా అందులో ఉంది.
ఇంటెల్, సిస్కో, హెచ్‌పీ, టీసీఎస్, మహీంద్రా, ఇన్ఫోసిస్, క్యాప్‌జెమినీ, డెల్, కాగ్నిసెంట్, విప్రో వంటి కంపెనీల బ్లాక్‌లిస్ట్‌లో ఉన్నాయి. ఈ కంపెనీల్లో పనిచేసిన వారు ఉద్యోగానికి సెట్ అవ్వరు అని రిక్రూటర్ గైడ్‌లైన్స్‌లో రాసి ఉంది.
ఇదంతా రెడ్డిట్‌లో షేర్ చేస్తూ.. తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు ఆ యూజర్. ఆ గైడ్‌లైన్స్‌లో చాలా వరకు క్రైటీరియాని కలిగి ఉన్నప్పటికీ, ఉద్యోగం రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. పోస్ట్‌లో ఉన్నది నిజమే అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
అయితే కొందరు మాత్రం.. రెడ్డిట్ యూజర్ పోస్ట్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
"అది నిజంగానే రిక్రూటర్ గైడ్లైన్స అనడానికి ఆధారాలేంటి? ఫేక్ స్క్రీన్‌షాట్ తయారు చేసి గైడ్‌లైన్స్‌ని రాసుకుని ఉండొచ్చు," అని కొందరు అంటున్నారు.
ఈ వ్యవహారంపై సబ్రెడ్డిట్ మాడరేటర్ మైకెల్ నొవాటీ స్పందించారు.
"ఆ స్క్రీన్‌షాట్ ఫేక్ అన్న వాదనలపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ యూజర్ నాకు మరిన్ని ఆధారాలు పంపించారు. ఈమెయిల్ అథెంటిక్ అన్న విషయాన్ని రెడ్డిట్ ద్వారా నిరూపించడం కష్టం. కానీ ఆధారాలు ఉంటే క్రెడిబులిటీ పెరుగుతుంది. నాకు మరిన్ని ఆధారాలు అందాయి," అని మైకెల్ చెప్పారు.
సంబంధిత కథనం