Movie tickets in Zomato : ఇక జొమాటోలో సినిమా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు! పేటీఎంతో భారీ డీల్ ఫిక్స్..
Zomato Paytm deal : పేటీఎంతో జొమాటో డీల్ ఫిక్స్ అయ్యింది. ఇప్పుడు జొమాటోలో సినిమా టికెట్లు, ఈవెంట్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. పేటీఎంకు చెందిన మూవీ, ఈవెంట్స్ టికెటింగ్ వ్యాపారాలను కొనుగోలు చేయనున్నట్టు జొమాటో ఓ ప్రకటన విడుదల చేసింది.
ఫుడ్ డెలివరీ, ఈ-కామర్స్ రంగంలో దూసుకెళుతున్న జొమాటో, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్లోకి కూడా ప్రవేశించింది. ఫుడ్ మాత్రమే కాదు, ఇకపై జొమాటోలో సినిమా టికెట్లను సైతం బుక్ చేసుకోవచ్చు! ఈ మేరకు డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎంకు చెందిన మూవీ, ఈవెంట్స్ టికెటింగ్ వ్యాపారాలను 244.2 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయనున్నట్లు జొమాటో ప్రకటించింది.
పేటీఎంతో డీల్ ఫిక్స్..
ప్రస్తుతం రిలయన్స్ మద్దతు ఉన్న బుక్ మై షో ఈ రంగంలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. పేటీఎంతో భారీ డీల్‌తో సినిమాలు, లైవ్ ఈవెంట్ల కోసం భారతదేశ ఆన్లైన్ టికెటింగ్ మార్కెట్లో జొమాటో ఎంట్రీ ఇస్తోంది.
సినిమా టికెట్లు, ఈవెంట్ బుకింగ్స్‌లో బుక్ మై షో రారాజుగా కొనసాగుతోంది. కానీ ఆ సంస్థకు పోటీని ఇవ్వగలుగుతున్న ఏకైక ప్లాట్‌ఫామ్ పేటీఎం. ఇక ఇప్పుడు పేటీఎం.. సినిమా టికెట్లను విక్రయించే 'టికెట్ న్యూ' ప్లాట్‌ఫామ్‌తో పాటు లైవ్ ఈవెంట్లకు టికెట్లను నిర్వహించే 'ఇన్సైడర్' ప్లాట్‌ఫామ్‌ని విక్రయించడం ద్వారా తన మార్కెట్ వాటాను జొమాటోకు అప్పగించనుంది.
ఈ కొనుగోలుతో వచ్చే రెండేళ్లలో నాన్ కోర్ వ్యాపారాల్లో ఆదాయం మూడు రెట్లు పెరుగుతుందని తమ షేర్‌హోల్డర్స్‌కి లెటర్లో పేర్కొంది.
రెస్టారెంట్ టేబుల్ బుకింగ్ సేవలు, ఈవెంట్ ఆర్గనైజింగ్ టికెటింగ్ యూనిట్ నాన్-కోర్ వ్యాపారాలు గత సంవత్సరం జొమాటో మొత్తం ఆదాయంలో కేవలం 2% మాత్రమే ఉన్నాయి. కానీ ఇవి వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగాలు.
జొమాటో ఏడాది క్రితమే టికెటింగ్ వ్యాపారాన్ని ప్రారంభించింది.
ఈ ఒప్పందంలో భాగంగా ప్లాట్‌ఫామ్ పూర్తిగా జొమాటో కొత్తగా ప్రారంభించిన 'డిస్ట్రిక్ట్' మొబైల్ అప్లికేషన్‌కి మారడానికి 12 నెలల ముందు పేటీఎం తన టికెటింగ్ సేవలను కొనసాగిస్తుంది. అదనంగా, పేటీఎం ఎంటర్టైన్మెంట్ టికెటింగ్ వ్యాపారం నుంచి జొమాటో సుమారు 280 మంది ఉద్యోగులను తీసుకోనుంది.
పేటీఎం తన మూవీ టికెటింగ్ వ్యాపారాన్ని అంతర్గతంగా నిర్మించింది. 2017- 2018 మధ్య ఇన్సైడర్, టికెట్న్యూని 2.68 బిలియన్ రూపాయలకు కొనుగోలు చేసింది.
వేగంగా వృద్ధి చెందుతున్న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ని మూసివేయాలని ఆర్బీఐ తేల్చిచెప్పినప్పటి నుంచి పేటీఎం.. ఇప్పుడు తన ప్రధాన చెల్లింపులు, ఆర్థిక సేవల కార్యకలాపాలపై దృష్టి పెట్టడానికి ఈ వ్యాపారాల నుంచి నిష్క్రమిస్తోంది.
జొమాటో షేరు ధర..
ఫుడ్ డెలివరీ బిజినెస్‌లో జొమాటో రారాజుగా కొనసాగుతోంది. బ్లింకిట్ వ్యాపారం కూడా వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో సంస్థ దూసుకెళుతోంది. అందుకే జొమాటో షేర్లు గత కొన్ని నెలలుగా భారీగా పెరుగుతూ వస్తున్నాయి. శుక్రవారం ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి జొమాటో షేరు ధర 1.2శాతం నష్టంతో రూ. 260 వద్ద ముగిసింది. కానీ జొమాటో స్టాక్ నెల రోజుల్లో 17.19శాతం, 6 నెలల్లో 60.25శాతం, ఏడాదిలో ఏకంగా 183శాతం మేర పెరగడం విశేషం. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 108.65శాతం వృద్ధి చెందాయి.
మరి పేటీఎం నుంచి సినిమా టికెట్ బుకింగ్ బిజినెస్‌ని కొనుగోలు చేయడంపై జొమాటో షేర్లు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.
సంబంధిత కథనం