Maruti Suzuki Dzire : అందరికీ నచ్చే ఈ బెస్ట్ సెల్లింగ్ కారు 3 మిలియన్ల మార్క్ దాటింది.. 5 స్టార్ సేఫ్టీ, బడ్జెట్ ధర!
Maruti Suzuki Dzire : భారత్‌లో మారుతి సుజుకి కార్లకు మంచి క్రేజ్ ఉంటుంది. ఇటు బడ్జెట్.. అటు సేఫ్టీతోనూ జనాలకు ఇష్టమైన కారుగా ఉంది. అయితే సుజుకి డిజైర్ తాజాగా రికార్డు సృష్టించింది.
మారుతి సుజుకి బెస్ట్ సెల్లర్‌గా డిజైర్ కారు ఉంది. అయితే ఈ కారు ఓ మైలురాయిని దాటింది. మారుతి సుజుకి డిజైర్ డిసెంబర్ 2024 వరకు 30 లక్షల యూనిట్ల ఉత్పత్తిని అధిగమించిందని సంస్థ ప్రకటించింది. మారుతికి చెందిన ఈ సరసమైన కాంపాక్ట్ సెడాన్ కేవలం 16 సంవత్సరాలలో 3 మిలియన్ యూనిట్ల ఉత్పత్తిని తాకింది. ఈ కారు చరిత్ర చూస్తే మొదటిసారిగా 2008 సంవత్సరంలో ప్రారంభించారు. తర్వాత 2012లో 2వ తరం మోడల్‌ను, 2017లో 3వ తరం మోడల్‌ను విడుదల చేసింది. ఇది కాకుండా 4వ తరం డిజైర్ నవంబర్ 2024లో ప్రారంభించారు. 5 స్టార్ సేఫ్టీతో ఈ కారులో అనేక ఫీచర్లు ఉన్నాయి.
విదేశాలకు ఎగుమతి
డిజైర్ అనేక మైలురాళ్లను దాటింది. మారుతి డిజైర్ భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా బాగా ప్రాచుర్యం పొందిన కారు. ఇది 2008 నుండి ఇప్పటివరకు 48 దేశాలకు దాదాపు 2.6 లక్షల యూనిట్లు ఎగుమతి చేసింది. కంపెనీ ప్రధానంగా దక్షిణాసియా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని కీలక ప్రాంతాలను కవర్ చేస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి అత్యధికంగా ఎగుమతి చేసిన మోడళ్లలో డిజైర్ రెండో అతిపెద్దది.
30 లక్షల యూనిట్ల ఉత్పత్తిపై మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఎండీ అండ్ సీఈఓ హిసాషి టేకుచి మాట్లాడుతూ, 'మారుతి సుజుకి డిజైర్ 3 మిలియన్ల ఉత్పత్తి మైలురాయిని సాధించడంలో కీలకపాత్ర పోషించిన మా కస్టమర్‌లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారి ఫీడ్‌బ్యాక్, సపోర్ట్ డిజైర్ వారి అంచనాలను మించి ఉండేలా చూసుకోవడంలో మాకు సాయపడింది. గత నెలలో విడుదల చేసిన తాజా డిజైర్ ఆధునిక డిజైన్, అధునాతన ఫీచర్లు, అసాధారణమైన ఇంధన సామర్థ్యంతో కొత్త ప్రయాణాన్ని నెలకొల్పింది. సెడాన్ విభాగంలో వరుసగా 16 సంవత్సరాలు మమ్మల్ని అగ్రగామిగా చేసింది.' అని ఆయన అన్నారు.
డిజైర్ ఫీచర్లు
కొత్త డిజైర్‌ను భారత మార్కెట్లో కేవలం రూ. 6.79 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. గ్లోబల్ ఎన్‌సీఏపీ నుండి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన ఈ సెడాన్.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌పీ, హిల్ హోల్డ్ అసిస్ట్, ఈబీడీతో కూడిన ఏబీఎస్, బ్రేక్ అసిస్ట్, 3-పాయింట్ సీట్ బెల్ట్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్ వంటి ఫీచర్లను పొందుతుంది.
కొత్త మారుతి సుజుకి డిజైర్ 1.2-లీటర్, మూడు-సిలిండర్ Z-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌ను పొందింది. ఇది కొత్త స్విఫ్ట్‌లో కూడా వస్తుంది. ఈ ఇంజన్ పెట్రోల్ ఎంపికపై 80.46bhp శక్తిని, 111.7Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సీఎన్‌జీలో ఈ పవర్ అవుట్‌పుట్ 68.8bhp, 101.8Nm అవుతుంది. డిజైర్‌ను 5-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్‌తో పెట్రోల్ వేరియంట్‌లలో కొనుగోలు చేయవచ్చు. సీఎన్జీ వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ మాత్రమే అందుబాటులో ఉంది.
మారుతి సుజుకి డిజైర్ వేరియంట్లు, ధరలు
డిజైర్ ఎల్‌ఎక్స్‌ఐ: రూ. 6.79 లక్షలు
డిజైర్ వీఎక్స్ఐ: రూ. 7.79 లక్షలు
డిజైర్ జెడ్ఎక్స్ఐ: రూ. 8.89 లక్షలు
డిజైర్ జెడ్ఎక్స్ఐ ప్లస్: రూ. 9.96 లక్షలు
డిజైర్ ఎజీఎస్ వీఎక్స్ఐ: రూ. 8.24 లక్షలు
డిజైర్ ఎజీఎస్‌జెడ్ఎక్స్ఐ ప్లస్: రూ. 10.14 లక్షలు
డిజైర్ సీఎన్జీ వీఎక్స్ఐ : రూ. 8.74 లక్షలు
డిజైర్ సీఎన్జీ జెడ్ఎక్స్ఐ : రూ. 9.84 లక్షలు