కాల్పుల విరమణ ఎఫెక్ట్​- దుమ్మురేపిన భారత స్టాక్​ మార్కెట్​.. 4ఏళ్లల్లో తొలిసారి ఇలా..-indian stock market news sensex nifty gains big 16 lakh crore added to mcap 10 key highlights ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  కాల్పుల విరమణ ఎఫెక్ట్​- దుమ్మురేపిన భారత స్టాక్​ మార్కెట్​.. 4ఏళ్లల్లో తొలిసారి ఇలా..

కాల్పుల విరమణ ఎఫెక్ట్​- దుమ్మురేపిన భారత స్టాక్​ మార్కెట్​.. 4ఏళ్లల్లో తొలిసారి ఇలా..

Sharath Chitturi HT Telugu

భారత్-పాక్ కాల్పుల విరమణ నుంచి అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం వరకు అనేక సానుకూల వార్తల నేపథ్యంలో దేశీయ సూచీలు దుమ్మురేపాయి. సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో అత్యంత భారీగా లాభపడ్డాయి.

బీఎస్​ఈ సెన్సెక్స్​..

భారత్​- పాకిస్థాన్​ కాల్పుల విరమణ, అమెరికా- చైనా వాణిజ్య యుద్ధాని బ్రేక్​ పడటం వంటి అత్యంత సానుకూల పరిణామాల మధ్య దేశీయ సూచీలు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని అతి భారీ లాభాలతో ముగించాయి. బెంచ్​మార్క్​ సూచీలు సెన్సెక్స్​, నిఫ్టీ50.. దాదాపు 4శాతం మేర లాభపడ్డాయి. ఇండెక్స్​లు ఒక్క ట్రేడింగ్​ సెషన్​లో ఈ స్థాయిలో లాభాలను చూడటం 4ఏళ్లల్లో ఇదే తొలిసారి! అంతేకాదు, తాజా బుల్​ రన్​తో సోమవారం ఒక్కరోజే బీఎస్​ఈ సెన్సెక్స్​ కంపెనీల మార్కెట్​ క్యాపిటల్​ దాదాపు రూ. 16లక్షల కోట్లు పెరిగింది.

బీఎస్ఈ సెన్సెక్స్ 2,975 పాయింట్లు (3.74 శాతం) పెరిగి 82,430 వద్ద స్థిరపడింది. ఆల్ టైమ్ గరిష్ట స్థాయి అయిన 85,978 నుంచి 4 శాతం దూరంలో, ఈ రోజు 82,495.97 వద్ద గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 916.70 పాయింట్లు (3.82%) పెరిగి 24,944.80 పాయింట్ల వద్ద ముగిసింది.

ఇదిలా ఉండగా, బీఎస్​ఈలో లిస్టయిన అన్ని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,6,06,576 లక్షల కోట్లు పెరిగి రూ.4,4,4,42,42,700 కోట్లకు చేరుకుంది. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ ముగిసే సమయానికి ఈ సంఖ్య రూ.4,16,40,850.46గా ఉంది.

ప్రధాన సూచీలే కాదు, బ్రాడ్​ మార్కెట్​ ఇండెక్స్​లు కూడా దుమ్మురేపాయి. బీఎస్​ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 3.85 శాతం పెరిగి 43,731.60 వద్ద స్థిరపడగా, బీఎస్​ఈ స్మాల్​క్యాప్ ఇండెక్స్ 4.18 శాతం పెరిగి 48,693.75 వద్ద ముగిసింది.

భారత స్టాక్​ మార్కెట్​ పెరగడానికి ముఖ్య కారణాలు..

  1. భారత్​- పాకిస్థాన్​ల మధ్య కొన్ని రోజుల క్రితం వరకు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీని వల్ల సూచీలు ఒత్తిడికి గురయ్యాయి. కాగా కాల్పుల విరమణను ఇరు వర్గాలు ప్రకటించడంతో సెంటిమెంట్​ ఒక్కసారిగా మారింది. ఇరు దేశాల మధ్య యుద్ధం జరగదని, పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందనే నమ్మకంతో ఈరోజు సూచీలు పెరిగాయి.
  2. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ చైనాపై విపరీతంగా ట్యాక్స్​లు వేసిన విషయం తెలిసిందే. చైనా కూడా సుంకాలు వేసింది. ఈ పరిస్థితులు ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య టారీఫ్​ వార్​కి తెరలేపాయి. కానీ ఇప్పుడు ఇరు దేశాలు వాణిజ్య ఒప్పందానికి దగ్గరగా వచ్చాయి. ఫలితంగా పరస్పరం వేసుకున్న టారీఫ్​లను 90 రోజుల పాటు ఉపసంహరించుకున్నాయి. ఇది మార్కెట్​కి మంచి చేసింది. అనిశ్చితి తొలగడంతో మదుపర్ల సెంటిమెంట్​ బలపడింది. అమెరికా- చైనా వాణిజ్య ఒప్పందంపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.
  3. రెండు స్టాక్స్ మినహా నిఫ్టీ50 స్టాక్స్ అన్నీ గ్రీన్​లో ముగిశాయి. అదానీ ఎంటర్​ప్రైజెస్ 7.7 శాతం వృద్ధితో అగ్రస్థానంలో నిలిచింది. ఇన్ఫోసిస్ కూడా 7.69 శాతం లాభపడింది. ఆ తర్వాత శ్రీరామ్ ఫైనాన్స్, ట్రెంట్, విప్రో 6-7 శాతం మధ్య లాభపడ్డాయి. నిఫ్టీ 50 షేర్లలో ఇండస్ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా మాత్రమే నష్టపోయాయి.
  4. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ సహా అన్ని ప్రధాన సెక్టోరల్ ఇండెక్స్​లు సోమవార ట్రేడిగ్​ సెషన్​లో లాభపడ్డాయి. అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మాంద్యం భయాలను తగ్గించడంతో నిఫ్టీ ఐటీ 6.7 శాతం పెరిగి టాప్ పెర్ఫార్మర్​గా నిలిచింది. నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఆటో టాప్ గెయినర్స్​గా నిలిచాయి.
  5. ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ లిమిటెడ్, భారతీ హెక్సాకామ్ లిమిటెడ్, యూపీఎల్ లిమిటెడ్, సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్, ఎస్ఆర్ఎఫ్ లిమిటెడ్, ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్ సహా 110 షేర్లు సోమవారం 52 వారాల గరిష్టాన్ని తాకాయి. యాక్టివ్ క్లోతింగ్ కంపెనీ లిమిటెడ్, సెంచురీ ఎన్కా లిమిటెడ్, శ్యామ్ టెలికాం లిమిటెడ్ వంటి కొన్ని ప్రముఖ కంపెనీలు సహా మొత్తం 48 స్టాక్స్ 52 వారాల గరిష్టాన్ని తాకాయి.
  6. యస్ బ్యాంక్ (52.75 కోట్లు), వొడాఫోన్ ఐడియా (41.42 కోట్లు), రిలయన్స్ పవర్ (16.48 కోట్లు), సుజ్లాన్ ఎనర్జీ (8.95 కోట్లు), జీఎల్టీ ఇన్ఫ్రా (8.04 కోట్లు) వాల్యూమ్​ పరంగా మోస్ట్​ యాక్టివ్​ స్టాక్స్​గా ఉన్నాయి.
  7. సూచీల బలమైన ర్యాలీ మధ్య ఈ రోజు ట్రేడింగ్​లో తొమ్మిది స్టాక్స్ 20 శాతం పెరిగాయి. బిర్లా కార్పొరేషన్, ఎన్డీఆర్ ఆటో కాంపోనెంట్స్, మ్యాన్ ఇండస్ట్రీస్, గిన్నీ ఫిలమెంట్స్, ఎన్డీఏ సెక్యూరిటీస్, ఇన్​స్పైరిసిస్ సొల్యూషన్స్, జీఏసీఎం టెక్నాలజీస్, హై ఎనర్జీ బ్యాటరీస్, ఐఎఫ్జీఎల్ రిఫ్రాక్టరీస్ షేర్లు 20 శాతం పెరిగాయి.
  8. 322 స్టాక్స్ అప్పర్ సర్క్యూట్ లిమిట్లను తాకాయి. జాగిల్ ప్రీపెయిడ్, మ్యాన్ ఇండస్ట్రీస్, బిర్లా కార్పొరేషన్, సెంకో గోల్డ్, ఐటీఐ, 63 మూన్స్ టెక్ వంటి కంపెనీలు ఈ లిస్ట్​లో ఉన్నాయి.
  9. జెన్సోల్ ఇంజనీరింగ్, జేపీ అసోసియేట్స్, హౌసింగ్ డెవలప్​మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్​కేఐఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహా దాదాపు 35 స్టాక్స్ ఈ రోజు లోయర్ సర్క్యూట్ లిమిట్లను తాకాయి.
  10. “టెక్నికల్​గా నిఫ్టీ50 అప్​ట్రెండ్​లో కొనసాగుతోంది. 25,200 లెవల్స్​ వరకు నిఫ్టీ50 వెళ్లొచ్చు. 24,400- 24,600 లెవల్స్​ సపోర్ట్​గా ఉన్నాయి,” అని రెలిగేర్​ బ్రోకింగ్​కి చెందిన సీనియర్​ వైస్​ ప్రెసిడెట్​ మిశ్ర తెలిపారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.