ఆ రెండు ఎఫ్‌డీలను ఆపేసి.. కొత్తగా రెండు ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్ తీసుకొచ్చిన ఇండియన్ బ్యాంక్!-indian bank 2 new fixed deposits ind secure and ind green with higher rates and discontinues two another fds ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఆ రెండు ఎఫ్‌డీలను ఆపేసి.. కొత్తగా రెండు ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్ తీసుకొచ్చిన ఇండియన్ బ్యాంక్!

ఆ రెండు ఎఫ్‌డీలను ఆపేసి.. కొత్తగా రెండు ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్ తీసుకొచ్చిన ఇండియన్ బ్యాంక్!

Anand Sai HT Telugu

ఇండియన్ బ్యాంక్ అధిక వడ్డీ రేట్లతో రెండు కొత్త ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలను ప్రవేశపెట్టింది. వీటిని ఇండ్ సెక్యూర్, ఇండ్ గ్రీన్ పేర్లతో విడుదల చేశారు. ఈ ఎఫ్‌డీ పథకాలలో వడ్డీ రేటు వివరాలు చూద్దాం..

ఇండియన్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్

క్రమం తప్పకుండా ఆదాయం పొందాలనుకునే వారికి బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు మంచి ఆప్షన్. ఇది మీ పెట్టుబడిపై నిర్దిష్ట కాలానికి హామీతో కూడిన రాబడిని ఇస్తుంది. ఇండియన్ బ్యాంక్ కూడా అనేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లు అందిస్తోంది. ఈ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. రెండు కొత్త ప్రత్యేకమైన రిటైల్ టర్మ్ డిపాజిట్ పథకాలను ప్రవేశపెట్టింది. అవే IND Secure, IND Green. అయితే ఒకప్పుడు బాగా ప్రాచుర్యం పొందిన ఇండ్ సూపర్ 400 డేస్, ఇండ్ సుప్రీం 300 డేస్ టర్మ్ డిపాజిట్ పథకాలను నిలిపివేశారు. కొత్తగా ప్రవేశపెట్టబడిన ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల గురించి తెలుసుకుందాం..

ఇండ్ సెక్యూర్ ఫిక్స్‌డ్ డిపాజిట్

ఇండియన్ బ్యాంక్ కొత్తగా ప్రవేశపెట్టిన ఇండ్ సెక్యూర్ ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ 444 రోజుల కాలపరిమితితో వస్తుంది. ఈ పథకంలో సాధారణ పౌరులకు సంవత్సరానికి 7.15 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. సీనియర్ సిటిజన్లు 7.65 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. సూపర్ సీనియర్లు (80 ఏళ్లు పైబడినవారు) 7.90 శాతం వడ్డీ రేటును తీసుకోవచ్చు. ఉదాహరణకు ఈ పథకంలో మీరు రూ.5 లక్షలు జమ చేస్తే టెన్యూర్ అయిపోయేసరికి రూ.42630 వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు రూ.46685 వడ్డీ లభిస్తుంది. ఈ పథకంలో కనీసం రూ.1,000 నుండి గరిష్టంగా రూ.3 కోట్ల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ప్రత్యేక డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30, 2025 వరకు మాత్రమే.

ఇండ్ గ్రీన్ ఫిక్స్‌డ్ డిపాజిట్

మరో కొత్త స్కీమ్ ఇండ్ గ్రీన్. ఇది 555 రోజుల వ్యవధితో అందుబాటులో ఉంది. ఈ పథకంలో సాధారణ పౌరులకు సంవత్సరానికి 6.80 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. సీనియర్ సిటిజన్లు 7.30 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. సూపర్ సీనియర్ సిటిజన్లు 7.55 శాతం వడ్డీ రేటును తీసుకోవచ్చు. ఈ పథకంలో కూడా కనీసం రూ.1,000 నుండి గరిష్టంగా రూ.3 కోట్ల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

ఇండియన్ బ్యాంక్ మునుపటి ఇండ్ సూపర్ 400 డేస్, ఇండ్ సుప్రీం 300 డేస్ రిటైల్ టర్మ్ డిపాజిట్ పథకాలు మే 8, 2025 నుండి అధికారికంగా నిలిపివేస్తారు. ఈ పథకాల కింద కొత్త డిపాజిట్లు ఇకపై అందుబాటులో ఉండవు. ఒకప్పుడు అధిక వడ్డీ రేట్లతో ఆకర్షణీయంగా ఉన్న ఈ పథకాలను ఎందుకు నిలిపివేసిందనే దానిపై బ్యాంకు స్పష్టమైన కారణాలను ఇంకా చెప్పలేదు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.