గూగుల్​ మ్యాప్స్​కి దేశీయ ప్రత్యామ్నాయం వచ్చేసింది! అసలేంటి ఈ ‘Mappls’?-indian alternative to google maps mappls fuels swadeshi tech push see full details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  గూగుల్​ మ్యాప్స్​కి దేశీయ ప్రత్యామ్నాయం వచ్చేసింది! అసలేంటి ఈ ‘Mappls’?

గూగుల్​ మ్యాప్స్​కి దేశీయ ప్రత్యామ్నాయం వచ్చేసింది! అసలేంటి ఈ ‘Mappls’?

Sharath Chitturi HT Telugu

గూగుల్ మ్యాప్స్‌కు స్వదేశీ ప్రత్యామ్నాయం వచ్చేసింది! అదే మాపల్స్​. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ 'మ్యాపల్స్​' యాప్​ని వినియోగిస్తూ ఒక వీడియో క్రియేట్​ చేశారు. అసలేంటి ఈ మ్యాపల్స్​?

మ్యాపల్స్​ (Mappls/screenshot)

అరట్టై, జోహో తర్వాత.. దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన 'మ్యాపల్స్​' (Mappls) యాప్ భారత స్వదేశీ సాంకేతికత ప్రయత్నాలకు బలాన్ని చేకూరుస్తోంది!. అత్యధికంగా వినియోగించే గూగుల్ మ్యాప్స్‌కు దేశీయ ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న ఈ నావిగేషన్ మొబైల్ అప్లికేషన్‌కు ప్రభుత్వం నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా ఈ యాప్‌ను ఉపయోగిస్తున్న వీడియోను 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు.

డిజిటల్ మ్యాప్, జియోస్పేషియల్ టెక్నాలజీ సంస్థ అయిన మ్యాప్‌మైఇండియా (MapmyIndia) రూపొందించిన మ్యాప​ల్స్​ యాప్‌లోని ఫీచర్లను వైష్ణవ్ ఆ వీడియోలో ప్రదర్శించారు. "మ్యాప్‌మైఇండియా నుంచి స్వదేశీ 'మ్యాపల్స్​'. మంచి ఫీచర్లు ఉన్నాయి... తప్పక ప్రయత్నించండి," అని ఆయన ఎక్స్​లో రాశారు.

గూగుల్ మ్యాప్స్‌కు ప్రత్యామ్నాయంగా..

గూగుల్ మ్యాప్స్ ప్రజల్లో బాగా ప్రాచుర్యం పొంది ఉన్నప్పటికీ, గతంలో ఈ యాప్ వల్ల కొంతమంది వినియోగదారులు ఇబ్బందులు పడ్డ సందర్భాలూ ఉన్నాయి. నావిగేషన్ తప్పుదారి పట్టడం వల్ల తెలియని ప్రాంతాల్లో చిక్కుకుపోవడం లేదా ప్రమాదాలు జరగడం వంటివి నమోదయ్యాయి.

ఉదాహరణకు, నవంబర్ 2024లో ఉత్తరప్రదేశ్‌లో పెళ్లికి వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు, గూగుల్ మ్యాప్స్ మార్గనిర్దేశం చేయడంతో నిర్మాణంలో ఉన్న వంతెన వైపు వెళ్లి వాహనంతో సహా నదిలో పడి ప్రాణాలు కోల్పోయారు.

అయితే, మ్యాపల్​స్​ యాప్ ఈ తరహా లోపాలను నివారించడానికి ఒక ప్రత్యేకమైన ఫీచర్‌ను అందిస్తోంది! ముందు వంతెన ఉన్నప్పుడు, ఇది వినియోగదారులకు త్రీ-డైమెన్షనల్ జంక్షన్ వ్యూ (3D Junction View)ను చూపిస్తుంది. తద్వారా ఎలాంటి గందరగోళం లేకుండా సరైన మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఇది నావిగేషన్‌ను మెరుగుపరచడానికి సులభమైన ఇంటర్‌ఫేస్, అనేక రకాల ఎంపికలను కూడా అందిస్తుంది.

"ముందు ఓవర్ బ్రిడ్జి లేదా అండర్ పాస్ ఉన్న ప్రతిచోటా, వినియోగదారులు పొరపాటు పడకుండా ఉండేందుకు యాప్ త్రీ-డైమెన్షనల్ జంక్షన్ వ్యూను అందిస్తుంది," అని వైష్ణవ్ తెలిపారు. అంతేకాకుండా, బహుళ అంతస్తుల భవనాల్లో కూడా ఇది పనిచేస్తుందని, వినియోగదారులు చేరుకోవాలనుకుంటున్న వివిధ అంతస్తులకు కూడా మార్గనిర్దేశం చేస్తుందని ఆయన వివరించారు.

ఈ వేదిక మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే.. మ్యాప్ డేటా, వినియోగదారు సమాచారం అంతా భారత్‌లోనే భద్రపరుస్తారు. విదేశీ ప్లాట్‌ఫారమ్‌ల విషయంలో పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో, ఇది డేటా సార్వభౌమాధికారం (Data Sovereignty), భద్రతను అందిస్తుంది.

భారతీయ రైల్వేలో కూడా మ్యాపల్స్​ అద్భుతమైన అవకాశాలను కలిగి ఉందని, దేశంలో రైల్వే నావిగేషన్‌ను మెరుగుపరచడానికి త్వరలో ఒక అవగాహన ఒప్పందం కుదరనుందని మంత్రి తెలిపారు.

భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ అడ్రస్ సిస్టమ్..

మ్యాప్‌మైఇండియా మ్యాపల్స్​ ఒక సమగ్రమైన డిజిటల్ అడ్రస్ సిస్టమ్ గురించి కూడా ప్రస్తావిస్తోంది. ఇది వినియోగదారులకు మరింత కచ్చితమైన ఫలితాలను ఇవ్వడానికి సహాయపడుతుంది.

"దేశంలోనే అగ్రగామి డిజిటల్ మ్యాపింగ్, డీప్-టెక్ సంస్థ అయిన మ్యాప్‌మైఇండియా మ్యాపల్స్​, ఇండియా పోస్ట్‌తో కలిసి పనిచేయడం ద్వారా భారతదేశపు మొట్టమొదటి సమగ్ర డిజిటల్ అడ్రస్ సిస్టమ్ అయిన డిజిపిన్ (DIGIPIN) ను మ్యాపల్స్​ యాప్ ప్లాట్‌ఫారమ్‌లో అనుసంధానం చేయడం జరిగింది," అని మ్యాప్‌మైఇండియా మ్యాప్ల్స్ సహ-వ్యవస్థాపకుడు, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ వర్మ చెప్పారు.

పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఈ డిజిపిన్‌ను ఐఐటీ హైదరాబాద్, ఇస్రో ఎన్‌ఆర్‌ఎస్‌సీ సహకారంతో అభివృద్ధి చేసింది. ఇది ఒక ఓపెన్ సోర్స్, ఇంటర్‌ఆపరబుల్, జియో-కోడెడ్, గ్రిడ్ ఆధారిత డిజిటల్ అడ్రస్ సిస్టమ్.

డిజిపిన్ దేశవ్యాప్తంగా 3.8-మీటర్ల స్క్వేర్ బ్లాక్ పరిమాణానికి ఒక కోడ్‌ను లేదా కోఆర్డినేట్స్​ని రూపొందిస్తుంది. వినియోగదారులు ఆ కోడ్‌ను రూపొందించడానికి డిజిపిన్ ప్లాట్‌ఫారమ్‌పై పిన్ చేయాల్సి ఉంటుంది. దీనిని పోస్టల్ అడ్రస్‌లతో పాటు ఉపయోగించడం ద్వారా కచ్చితత్వం చాలా ఎక్కువగా ఉంటుంది.

మ్యాపల్స్​ పిన్​తో పాటు డిజిపిన్​ని ఉపయోగించడం ద్వారా డిజిటల్ అడ్రస్ జనరేటర్ అంతస్తు, ఇల్లు లేదా ఫ్లాట్ నంబర్‌ను కూడా చూపించవచ్చని రాకేష్ వర్మ తెలిపారు.

"గ్రామీణ ప్రాంతాలు వంటి మ్యాపల్స్​ పిన్ యాక్టివ్‌గా లేని ప్రాంతాలలో, మ్యాపల్స్​ సమీపంలోని ముఖ్యమైన ల్యాండ్‌మార్క్‌ను రిఫరెన్స్ పాయింట్‌గా తీసుకుని పిన్‌ను జనరేట్ చేస్తుంది," అని వర్మ వివరించారు.

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మ్యాపల్స్​ యాప్‌ను సమర్థించడం అనేది దేశీయంగా అభివృద్ధి చెందిన సాంకేతిక సామర్థ్యాలకు లేదా భారతదేశం 'స్వదేశీ' ఉద్యమానికి బలమైన ప్రోత్సాహంగా కనిపిస్తోంది. ఆయన ఈ భారతీయ యాప్‌ను ప్రశంసించడం, కేవలం కొన్ని వారాల క్రితం క్యాబినెట్ సమావేశంలో జోహో కార్పొరేషన్ గురించి ప్రస్తావించిన తర్వాత రావడం గమనార్హం.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం