కియా క్యారెన్స్కి ఈవీ టచ్ ఇచ్చేందుకు దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ ఏర్పాట్లు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ మోడల్ ఇప్పుడు దక్షిణ కొరియాలో దర్శనమిచ్చింది. ఆల్-ఎలక్ట్రిక్ ఎంపీవీ భారీ క్యామోఫ్లాజ్లో కెమెరాలకు చిక్కింది. ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్ వెహికిల్‌పై మరిన్ని వివరాలు బయటకు వచ్చాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకోండి..
భారత ప్యాసింజర్ వాహన మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఇప్పటికే పలు ఆటోమొబైల్ కంపెనీలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేశాయి. కియా కూడా ఈవీ6, ఈవీ9 వంటి మోడళ్లతో ఈ జాబితాలో చేరింది. అయితే ఈ రెండూ ప్రీమియం సెగ్మెంట్లో ఉన్నాయి. ఇప్పుడు, హ్యుందాయ్ గ్రూప్ ఆధ్వర్యంలోని దక్షిణ కొరియా ఆటో దిగ్గజం మాస్-మార్కెట్ విభాగంలోని అవకాశాలను అందిపుచ్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే కియా కారెన్స్ ఈవీని సిద్ధం చేస్తోంది. ఈ క్యారెన్స్ ఈవీ.. దేశంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా మారింది.
దక్షిణ కొరియాలో కనిపించిన కియా కారెన్స్ ఈవీ ప్రోటోటైప్ కొన్ని కీలక డిజైన్ వివరాలను వెల్లడించింది. నోస్‌కి కనెక్టెడ్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్ (డీఆర్ఎల్) స్ట్రిప్‌తో త్రిభుజాకార ఆకారంలో ఉండే ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ ఇందులో ఉన్నాయి. లైటింగ్ డిజైన్ చూడటానికి కియా ఈవీ6ను పోలి ఉంటుంది. కానీ ఛార్జింగ్ పోర్ట్ పొజిషనింగ్ కారెన్స్ ఈవీలో భిన్నంగా ఉంటుంది. ఈ ఏడాది ప్రారంభంలో భారతదేశంలో లాంచ్ అయిన హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌ని ఇది పోలి ఉంటుంది.
కారెన్స్ ఈవీలో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్) లభ్యతను తాజా స్పై షాట్స్ సూచిస్తున్నాయి. విండ్ షీల్డ్‌లో ఒక కెమెరా ఉంది. ఇది ఏడీఏఎస్ లభ్యతను ధృవీకరిస్తుంది. అలాగే, బంపర్‌లో ఫ్రెంట్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. ఇటీవల లాంచ్ చేసిన కియా సైరోస్‌లో పరిచయం చేసిన సైడ్ సెన్సార్లు రాబోయే కియా కారెన్స్ ఈవీలో కూడా ఉంటాయని భావిస్తున్నారు. కియా కారెన్స్ ఐసీఈలో లభించే వాటితో పోలిస్తే అల్లాయ్ వీల్స్‌కు భిన్నమైన డిజైన్ ఉండొచ్చు. ఎలక్ట్రిక్ కారు కావడంతో, ఈవీ అల్లాయ్ వీల్స్ ఏరోడైనమిక్ డిజైన్ ఎలిమెంట్స్‌తో వస్తాయి.
కియా కారెన్స్ ఈవీలో 12.3 ఇంచ్ డ్యూయెల్ డిజిటల్ డిస్ప్లే సెటప్, 12.3 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 12.3 ఇంచ్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. వైర్లెస్ ఫోన్ ఛార్జర్, డ్యూయల్ జోన్ ఆటో ఏసీ, పనోరమిక్ సన్‌రూఫ్ కూడా ఇందులో ఉండనున్నాయి.
సేఫ్టీ ఫీచర్ విషయానికొస్తే కియా కారెన్స్ ఈవీ లెవల్ 2 ఏడీఎఎస్ సూట్, ఫ్రెంట్- రేర్ పార్కింగ్ సెన్సార్లు, స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్ బ్యాగులు, 360 డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరాను పొందుతుంది.
పవర్ట్రెన్ గురించి కియా ఎటువంటి సమాచారాన్ని వెల్లడించలేదు. కానీ ఇది వివిధ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌తో వస్తుందని భావిస్తున్నారు. కియా క్యారెన్స్ ఈవీ రేంజ్ 400 కి.మీ నుంచి 500 కి.మీ మధ్యలో ఉంటుందని తెలుస్తోంది.
కియా క్యారెన్స్ ఈవీ ఇండియా లాంచ్, ఫీచర్స్, ధరతో పాటు ఇతర వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.
సంబంధిత కథనం