Billionaires in India : బిలియనీర్ల జాబితాలో భారత్ @3- ‘మైండ్‌బ్లోయింగ్’ డేటా..
Billionaires in India : భారత దేశం బిలియనీర్ల సంఖ్య శరవేగంగా దూసుకెళుతోంది. తాజాగా బయటకొచ్చిన ఒక రిపోర్టు ప్రకారం ప్రపంచ బిలియనీర్ల జాబితాలో ఇండియా 3వ స్థానంలో నిలిచింది.
దేశంలో బిలియనీర్ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇక ఇప్పుడు బిలియనీర్లు అధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. 2024 నాటికి ఇండియాలో 185 మంది బిలియనీర్లు ఉన్నారని యూబీఎస్ తన తాజా ‘బిలియనీర్స్ యాంబీషన్స్’ రిపోర్టులో పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం.. 835 మంది బిలియనీర్లతో యునైటెడ్ స్టేట్స్ అగ్రస్థానంలో ఉంది. 427 మందితో తరువాతి స్థానంలో ఉన్న చైనా నిలిచింది.
భారతదేశం బిలియనీర్ల సంఖ్యలో 'ఫాస్ట్ గ్రోత్'ని ఈ నివేదిక హైలైట్ చేస్తోంది. ఏడాది కాలంలో 32 కొత్త పేర్లు ఈ జాబితాలో యాడ్ అయ్యాయి. ఇది 21 పర్సెంట్ గ్రోత్! 2015 నుంచి దేశంలో బిలియనీర్ల సంఖ్య రెట్టింపు అయిందని, 123 శాతం పెరిగిందని యూబీఎస్ నివేదిక తెలిపింది.
భారత్‌లో బిలియనీర్ల సంపద పెరుగుదల..
భారత బిలియనీర్ల మొత్తం సంపద గత ఏడాదితో పోలిస్తే 42.1 శాతం పెరిగి 905.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది దేశ బలమైన ఆర్థిక వేగాన్ని ప్రతిబింబిస్తోంది. ప్రపంచ సంపద సృష్టిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని, ఈ వృద్ధికి భారత్ ఆర్థిక చైతన్యమే కారణమని నివేదిక పేర్కొంది.
అమెరికా టాప్- చైనా మాత్రం..
అమెరికా 2024లో 84 మంది బిలియనీర్లను చేర్చుకోగా, వారి మొత్తం సంపద 4.6 ట్రిలియన్ డాలర్ల నుంచి 5.8 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. కాగా మొత్తం బిలియనీర్ల సంపద 1.8 ట్రిలియన్ డాలర్ల నుంచి 1.4 ట్రిలియన్ డాలర్లకు పడిపోవడంతో చైనా 93 మంది బిలియనీర్లను కోల్పోయింది! అయినప్పటికీ రెండో స్థానంలో కొనసాగుతోంది.
ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య 2015లో 1,757 నుంచి 2024 నాటికి 2,682కు పెరగ్గా.. మొత్తం సంపద 121 శాతం పెరిగి 14 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని యూబీఎస్ నివేదిక తెలిపింది.
రాబోయే దశాబ్దంలో భారతదేశ బిలియనీర్ల సంఖ్య "గణనీయమైన" పెరుగుదలను చూస్తుందని నివేదిక అంచనా వేసింది. గతంలో చైనా తరహా వృద్ధిని ఇండియా చూస్తుందని పేర్కొంది.
పబ్లిక్ లిస్టెడ్ ఫ్యామిలీ ఓన్డ్ వ్యాపారాల్లో భారత్.. ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో ఉందని, ఈ తరహా వ్యాపారాలను ఈ అధ్యయనంలో 108 మందిని గుర్తించినట్టు నివేదిక తెలిపింది. భారత ఆర్థిక పరివర్తనలో కుటుంబ వ్యాపారాలు కీలక పాత్ర పోషించాయని, సంప్రదాయ పరిశ్రమలు, ఫార్మాస్యూటికల్స్, ఎడ్టెక్, ఫిన్టెక్, ఫుడ్ డెలివరీ వంటి కొత్త ఆర్థిక రంగాల్లో తమ విజయాన్ని నొక్కిచెప్పాయని యూబీఎస్ నివేదిక పేర్కొంది.
బిలియనీర్ల సంఖ్య పెరుగుదలతో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది.
సంబంధిత కథనం