BYD India : తెలంగాణలో అతి పెద్ద 'ఈవీ' ఫ్యాక్టరీ.. కేంద్రం నో చెబుతుందా?
BYD India investment : దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ బీవైడీ.. తెలంగాణ ఆధారిత ఎంఈఐఎల్‌తో కలిసి 1 బిలియన్ డాలర్ విలువ చేసే ఎలక్ట్రిక్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. కానీ ఈ ప్రతిపాదనపై కేంద్రం సానుకూలంగా లేదని తెలుస్తోంది.
BYD India investment : ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉంది. దీనిని క్యాష్ చేసుకునేందుకు దేశంలోనే కాకుండా అంతర్జాతీయ సంస్థలు కూడా పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో అతి పెద్ద ఈవీ ఫ్యాక్టరీ, బ్యాటరీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రచించింది చైనాకు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ బీవైడీ. మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్) అనే సంస్థతో కలిసి 1బిలియన్ డాలర్ల (రూ. 8వేల కోట్లు) పెట్టుబడులకు ప్లాన్ చేసింది. కానీ ఈ ప్రతిపాదనను ఆమోదించేందుకు కేంద్రం సానుకూలంగా లేదని సమాచారం.
1 బిలియన్ డాలర్ల పెట్టుబడి..
ఇండియాలో లేటెస్ట్ ఎంట్రీ ఇచ్చింది బీవైడీ. ఇటీవలే పలు మోడల్స్ లాంచ్ చేసింది. ఇక ఇక్కడ ఓ మేన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేయాలని భావించింది. కేంద్రానికి ప్రతిపాదనను కూడా పంపించింది. ఆమోదం లభిస్తే.. కార్యకలాపాలను మొదలుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ఎంఈఐఎల్ చెప్పింది.
BYD investment in Telangana : దేశంలో ఎలక్ట్రిక్ బస్సులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఎంఈఐఎల్కు చెందిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్.. తెలంగాణ ప్రభుత్వం నుంచి 150 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఏడాదికి 10వేలకుపైగా ఎలక్ట్రిక్ బస్సులను రూపొందించే విధంగా ఓ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది. ఇక ఇప్పుడు బీవైడీతో జాయింట్ వెంచర్‌ను ప్రారంభించి, ఈవీ సెగ్మెంట్లో సంచలనం సృష్టించాలని అనుకుంటోంది. కేంద్రం నుంచి అనుమతులు లభించిన తర్వాత.. తెలంగాణ నుంచి పర్మీషన్లు తీసుకుని భూమిని కొనుగోలు చేయాలని ఎంఈఐఎల్ భావిస్తోంది.
ఇదీ చూడండి:- Tesla in India : ఇండియా కోసం టెస్లా క్రేజీ ప్లాన్..
కేంద్రం ఆందోళన ఇదే..!
ప్రపంచంలో అతిపెద్ద ఈవీ మేన్యుఫ్యాక్చరింగ్ సంస్థల్లో ఒకటైన బీవైడీ.. ఇండియాలోకి వస్తే పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుందన్న మాట నిజమే. అయితే.. ఇదొక చైనా కంపెనీ కావడమే ఇక్కడ ఉన్న అసలైన సమస్య! భద్రతాపరమైన కారణాలతో బీవైడీ చేసిన ప్రతిపాదనపై కేంద్రం సానుకూలంగా లెదని నివేదికలు బయటకొచ్చాయి.
BYD India news : "బీవైడీ ప్రతిపాదనపై కేంద్ర హోంశాఖ, విదేశాంగశాఖలు సౌకర్యంగా లేవు. సరిహద్దు దేశాలను ఇండియా మార్కెట్ నుంచి దూరం పెట్టాలన్న భారత ప్రభుత్వ విధానానికి ఇది వ్యతిరేకంగా ఉండటం ఇందుకు ఓ కారణం. మరీ ముఖ్యంగా భద్రతాపరమైన సమస్యలే ఇక్కడ కీలకం," అని ఓ నివేదిక పేర్కొంది.
ఇలాంటి జాయింట్ వెంచర్లలో విదేశీ సంస్థల ఆధిపత్యమే ఎక్కువగా ఉంటోందని, స్థానిక సంస్థల ప్రభావం తక్కువేనని కేంద్రం అభిప్రాయపడుతోంది. అలాంటిది.. చైనా కంపెనీకి ఇండియాలో ఎక్కువ ఆధిపత్యాన్ని సమర్పించే పరిస్థితి ప్రస్తుతం లెదని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
సంబంధిత కథనం