Billionaires in India: కెనడా, యూకే ల్లో కన్నా మన దగ్గరే బిలియనీర్లు ఎక్కువ
Billionaires in India: అత్యధిక సంఖ్యలో బిలియనీర్లు ఉన్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. తొలి రెండు స్థానాల్లో అమెరికా, చైనా ఉన్నాయి. మొత్తం 15 దేశాల జాబితాలో చివరి స్థానంలో జపాన్ ఉండడం విశేషం.
Billionaires in India: భారత్ సంపన్న దేశం కానీ భారతీయులు పేదవారన్న మాట ఎలా ఉన్నా.. అత్యంత సంపన్నుల సంఖ్యను పెంచుకోవడంలో భారత్ దూసుకుపోతోంది. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ (World of Statistics) గణాంకాల ప్రకారం.. అత్యధిక సంఖ్యలో బిలియనీర్లు ఉన్న దేశాల జాబితాలో భారత్ అనేక అభివృద్ధి చెందిన దేశాలను అధిగమించి మూడో స్థానానికి చేరింది.
Billionaires in India: ఫస్ట్ అమెరికా.. లాస్ట్ జపాన్
ఈ జాబితాలో మొత్తం 735 మంది బిలియనీర్ల సంఖ్యతో అమెరికా తొలి స్థానంలో నిలిచింది. అలాగే, 495 బిలియనీర్లతో చైనా రెండో స్థానంలో ఉంది. 169 బిలియనీర్లతో భారత్ మూడో స్థానం కైవసం చేసుకుంది. జర్మనీ, యూకే, ఇటలీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, స్వట్జర్లాండ్, కెనడా, జపాన్ వంటి దేశాలు ఈ జాబితాలో భారత్ కన్నా దిగువనే ఉన్నాయి. ఈ 15 దేశాల జాబితాలో చివరి స్థానంలో జపాన్ ఉంది. జపాన్ లో కేవలం 40 మంది బిలియనీర్లు మాత్రమే ఉన్నారు. ఈ జాబితాలో 100 కన్నా ఎక్కువ మంది బిలియనీర్లు ఉన్న దేశాల్లో అమెరికా, చైనా, భారత్ లతో పాటు రష్యా, జర్మనీ మాత్రమే ఉన్నాయి. భారత్ తరువాతి స్థానాల్లో వరుసగా జర్మనీ (126), రష్యా, (105), హంకాంగ్ (66), ఇటలీ (64), కెనడా(63), తైవాన్ (52), యూకే (52), బ్రెజిల్ (51), ఆస్ట్రేలియా (47), ఫ్రాన్స్ (43), స్విట్జర్లాండ్ (41), జపాన్ (40) ఉన్నాయి.
Billionaires in India: ముకేశ్ అంబానీ రిచెస్ట్ ఇండియన్
అత్యంత సంపన్న భారతీయుల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. ఆ జాబితా ప్రకారం అత్యంత సంపన్న భారతీయుడిగా 87 బిలియన్ డాలర్ల సంపదతో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ నిలిచారు. రెండో స్థానంలో 48.3 బిలియన్ డాలర్ల సంపదతో ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీ ఉన్నారు. ఆ తరువాతి స్థానాల్లో వరుసగా హెచ్సీఎల్ చైర్మన్ శివ నాడార్ (24.5 బిలియన్ డాలర్లు), సైరస్ పూనావాలా (22.8 బిలియన్ డాలర్లు), సావిత్రి జిందాల్ అండ్ ఫ్యామిలీ (17.9 బిలియన్ డాలర్లు), లక్ష్మి మిట్టల్ (16.9 బిలియన్ డాలర్లు), దిలీప్ సాంఘ్వీ (16.2 బిలియన్ డాలర్లు), రాధాకిషన్ దామానీ (15.8 బిలియన్ డాలర్లు), కుమార్ మంగళం బిర్లా (14.9 బిలియన్ డాలర్లు), ఉదయ్ కోటక్ (14.5 బిలియన్ డాలర్లు) తదితరులు ఉన్నారు.
Billionaires in India: ముంబైలోనే అత్యధికం..
భారత్ లోని నగరాల్లో బిలియనీర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న సిటీగా ముంబై నిలిచింది. ఇక్కడ 66 మంది బిలియనీర్లు ఉన్నారు. అలాగే, ఢిల్లీలో 39 మంది, బెంగళూరులో 21 మంది బిలియనీర్లు ఉన్నారు. ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా 236.1 బిలియన్ డాలర్ల సంపదతో ఫ్రాన్స్ కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ అండ్ ఫ్యామిలీ నిలిచింది. టాప్ 10 బిలియనీర్లలో ఏడుగురు అమెరికాకు చెందిన వారేకావడం విశేషం. వారు ఎలాన్ మస్క్ ( 174.5 బిలియన్ డాలర్లు ), జెఫ్ బెజోస్ (128.5 బిలియన్ డాలర్లు), లారీ ఎలిసన్ (118.3 బిలియన్ డాలర్లు), వారెన్ బఫెట్ (115.3 బిలియన్ డాలర్లు), బిల్ గేట్స్ (113.1 బిలియన్ డాలర్లు), స్టీవ్ బాల్మర్ (95.6 బిలియన్ డాలర్లు), మైఖేల్ బ్లూమ్ బర్గ్ (94.5 బిలియన్ డాలర్లు).