భారత్ ఈవీ పాలసీ.. భారీ పెట్టుబడులు.. ప్రపంచ తయారీదారులను ఆకర్శించడానికి సుంకాల్లో కోతలు!-india ev policy big investments in lower taxes out govt open electric vehicle making policy with benefits ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  భారత్ ఈవీ పాలసీ.. భారీ పెట్టుబడులు.. ప్రపంచ తయారీదారులను ఆకర్శించడానికి సుంకాల్లో కోతలు!

భారత్ ఈవీ పాలసీ.. భారీ పెట్టుబడులు.. ప్రపంచ తయారీదారులను ఆకర్శించడానికి సుంకాల్లో కోతలు!

Anand Sai HT Telugu

భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల తయారీని భారీగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. అందులో భాగంగా కొత్త ఈవీ పాలసీని తీసుకొచ్చింది.

భారత్ ఈవీ పాలసీ

దేశంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీని పెంచే లక్ష్యంతో కొత్త పథకంతో ముందుకు వచ్చింది భారత్. ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజాలకు డోర్స్ ఓపెన్ చేసే దిశగా ఒక అడుగు ముందుకు వేసింది. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించిన విధానానికి సంబంధించి అధికారిక మార్గదర్శకాలను విడుదల చేసింది. స్థానికంగా పెద్ద మొత్తంలో ఖర్చు చేసి నిర్మించడానికి సిద్ధంగా ఉన్న విదేశీ ఈవీ మేకర్స్‌‌కు దిగుమతి సుంకం కోతలను అందిస్తోంది.

రూ.4,150 కోట్లు పెట్టుబడి

భారత భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఎలక్ట్రిక్ కార్లపై దిగుమతి సుంకాలను తగ్గించే కొత్త ఎలక్ట్రిక్ వాహనాల తయారీ మార్గదర్శకాలను రూపొందించింది. కానీ వాహన తయారీదారులు ముందుగా రూ.4,150 కోట్లు పెట్టుబడి పెట్టాలి. అర్హత సాధించడానికి నియమాలను పాటించాలి. కొత్త నియమాలు ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులను భారతదేశంలో ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

మూడేళ్లలోపు

మార్చి 2024లో ప్రకటించిన ఈ పథకం.., ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారిస్తుంది. వాహన తయారీదారుల నుండి పలు నియమాలను కోరుతుంది భారత్. దరఖాస్తు చేసుకోవడానికి కూడా కంపెనీలు కనీసం రూ.4,150 కోట్ల పెట్టుబడిని ప్రతిజ్ఞ చేయాలి. ఈ పెట్టుబడి ఆమోదం పొందిన తేదీ నుండి మూడు సంవత్సరాలలోపు అమలు చేయాలి. ఈవీ తయారీ ప్లాంట్లు, ఆర్&డీ కేంద్రాలు, ఛార్జింగ్ ఇన్‌ఫ్రా, అనుబంధ సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి ఉపయోగించాలి.

ఈ పథకం స్టార్టప్‌ల కోసం లేదా కొత్తవారి కోసం కాదు. ఆర్థికంగా, సాంకేతికంగా ఇప్పటికే బలంగా ఉన్న పెద్ద అంతర్జాతీయ ఆటోమేకర్లను లక్ష్యంగా చేసుకుంటుంది.

సుంకాల్లో కోత

సుమారు రూ. 29.75 లక్షలు కంటే ఎక్కువ ధర కలిగిన పూర్తిగా తయారైన ఈవీలను దిగుమతి చేసుకోవడంపై 15 శాతం కస్టమ్స్ సుంకం రేటు ఈ పథకంలో ఒకటి. అంటే దిగుమతి చేసుకునే వాహనాలపై పన్ను తగ్గింపు ఉంటుంది. ఈ పథకం కింద కంపెనీలు సంవత్సరానికి 8,000 ఈవీలను మాత్రమే దిగుమతి చేసుకోగలవు. తగ్గించిన సుంకం ప్రయోజనం ఐదు సంవత్సరాల పాటు కొనసాగుతుంది. కంపెనీ ఎంత పెట్టుబడి పెడుతుందనే దానిపై ముడిపడి ఉంటుంది.

ఒక సంస్థ సంవత్సరంలో తన పూర్తి దిగుమతి కోటాను ఉపయోగించకపోతే.. మిగిలిన మొత్తాన్ని తదుపరి సంవత్సరానికి ముందుకు తీసుకెళ్లవచ్చు. కంపెనీలను జవాబుదారీగా ఉంచడానికి, ప్రభుత్వం అంచనా వేసిన సుంకం పొదుపు లేదా కనీస పెట్టుబడి మొత్తం రూ. 4,150 కోట్లకు సమానమైన బ్యాంక్ గ్యారెంటీని డిమాండ్ చేస్తోంది.

గ్లోబల్ ఈవీ తయారీదారులను స్థానికంగా తమ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడానికి ఆహ్వానించడానికి భారతదేశం తీసుకున్న చర్యలలో ఇది ఒకటి. భారతదేశం ద్విచక్ర, త్రిచక్ర ఈవీ విభాగాలలో బాగా రాణించినప్పటికీ.. నాలుగు చక్రాల వాహనాలు ఇప్పటికీ వెనుకబడి ఉన్నాయి.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.