'ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్​'- జపాన్​ ఔట్​!-india becomes world fourth largest economy surpasses japan says niti aayog ceo ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  'ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్​'- జపాన్​ ఔట్​!

'ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్​'- జపాన్​ ఔట్​!

Sharath Chitturi HT Telugu

ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత దేశం ఆవిర్భవించిందని నీతి ఆయోగ్​ సీఈఓ సుబ్రమణ్యం ప్రకటించారు. ఫలితంగా జపాన్​ ఇప్పుడు 5వ స్థానానికి పడిపోయింది.

ఇప్పుడు భారత్​- 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ!

ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత దేశం అవతరించింది! ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న జపాన్​ 5వ స్థానానికి పడిపోయింది. ఈ విషయాన్ని నీతి ఆయోగ్​ సీఈఓ బీవీఆర్​ సుబ్రమణ్యం ప్రకటించారు. నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.

“భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు 4 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. మన ముందు అమెరికా, చైనా, జర్మనీలు మాత్రమే పెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్నాయి,” అని సుబ్రమణ్యం అన్నారు.

అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) గణాంకాలను ఉటంకిస్తూ.. భారత్ ఇప్పుడు జపాన్​ని అధిగమించిందని నీతి ఆయోగ్ సీఈఓ ధృవీకరించారు. అంతేకాదు 2.5-3 ఏళ్లలో ఇండియా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని తెలిపారు.

2010లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల లిస్ట్​లో భారత్ 10వ స్థానంలో ఉండేది.​ 2019లో.. బ్రిటన్​ని వెనక్కి నెట్టి, 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 6ఏళ్లల్లోనే 4వ స్థానానికి ఎగబాకింది.

భారత్ వృద్ధి అంచనాలు..

2026 దేశ ఆర్థిక సంవత్సరానికి దేశ నామమాత్రపు జీడీపీ దాదాపు 4,187.017 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందిని ఐఎంఎఫ్ వరల్డ్ ఎకనామిక్ ఔట్​లుక్ ఏప్రిల్ ఎడిషన్ నివేదిక అంచనా వేసింది. ఇది జపాన్ జీడీపీ (4,186.431 బిలియన్ డాలర్లు) కంటే కొంచెం ఎక్కువ. భారత ఆర్థిక వ్యవస్థ 2025లో 6.2 శాతం, 2026లో 6.3 శాతం వృద్ధి చెందుతుందని అంచనాలు తీసుకొచ్చింది.

కాగా.. వచ్చే రెండేళ్లలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది.

మొత్తం మీద చూసుకుంటే.. 2025లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 2.8 శాతం, 2026లో 3.0 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ భావిస్తోంది.

భారత వృద్ధిపై నీతి ఆయోగ్ సీఈఓ

భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ధి చెందుతోందని, దేశ జనాభా ఈ వృద్ధికి దోహదపడుతుందని నీతి ఆయోగ్ సీఈఓ తెలిపారు.

“వేగంగా అభివృద్ధి చెందే దశకు చేరుకునేందుకు ఇండియా సిద్ధంగా ఉంది. గతంలో చాలా దేశాలు ఈ స్థితిలో ఉన్నాయి. భౌగోళిక, జనాభా పరంగా భారత్​కు రానున్న 25-30ఏళ్లల్లో చాలా సానుకూల పరిస్థితిలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే విజన్​ డాక్యుమెంట్లు తయారు చేయాలని రాష్ట్రాలకు ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చారు. ఇది భారత వృద్ధిలో ఇప్పటికే కనిపిస్తోంది,” అని సుబ్రమణ్యం అన్నారు.

నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న మోదీ.. 2047 నాటికి భారత్​ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి 24 రాష్ట్రాలు, ఏడు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం