Hyundai India Q2: క్యూ2లో 16 శాతం తగ్గిన హ్యుందాయ్ ఇండియా నికరలాభం; ఆదాయంలోనూ క్షీణతే; నష్టాల్లో స్టాక్
Hyundai India Q2 results: హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2 ఫలితాలను మంగళవారం వెల్లడించింది. ఈ త్రైమాసికంలో కార్యకలాపాల నుండి కంపెనీ ఆదాయం 8% తగ్గి రూ .18,659.69 కోట్ల నుండి రూ .17,260 కోట్లకు పడిపోయింది. సంస్థ నికర లాభం కూడా 16% తగ్గి, రూ. 1,375 కోట్లకు పడిపోయింది.
Hyundai India Q2 results: హ్యుందాయ్ మోటార్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నిరాశాపూరిత ఫలితాలను ప్రకటించింది. ఈ క్యూ 2 (Q2FY25) లో హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ నికర లాభం, ఆదాయం రెండూ తగ్గాయి. ఐపీఓ ద్వారా భారత స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్ అయిన తర్వాత హ్యుందాయ్ మోటార్ వెల్లడించిన మొదటి ఆదాయ నివేదిక ఇది.
16 శాతం క్షీణత
బలహీనమైన మార్కెట్ సెంటిమెంట్లు, భౌగోళిక రాజకీయ కారణాల వల్ల సెప్టెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో హ్యుందాయ్ మోటార్ ఇండియా కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.1,628.46 కోట్ల నుంచి 16 శాతం క్షీణించి రూ.1,375.47 కోట్లకు పరిమితమైంది. అలాగే, ఈ క్యూ2 (Q2FY25) లో కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం రూ.18,659.69 కోట్ల నుంచి 7.5 శాతం క్షీణించి రూ.17,260.38 కోట్లకు పరిమితమైంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం 1,91,939 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. కంపెనీ దేశీయ అమ్మకాలు 5.75 శాతం క్షీణించి 1,49,639 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఎగుమతి పరిమాణం 42,300 యూనిట్లుగా ఉంది.
మళ్లీ పుంజుకుంటామన్న హ్యుందాయ్
‘‘మార్కెట్ పరిస్థితులు మందకొడిగా ఉన్నప్పటికీ, 2024-25 హెచ్ 1 ఆర్థిక సంవత్సరంలో మేము విజయవంతంగా లాభదాయకతను కొనసాగించాము. దీనికి ప్రధాన కారణం మా చురుకైన, నిరంతర వ్యయ నియంత్రణ చర్యలు. రాబోయే నెలల్లో క్రెటా ఈవీని మాస్ మార్కెట్ కోసం విడుదల చేస్తాం. ఇది ఈవీ మార్కెట్లో గేమ్ ఛేంజర్ అవుతుందని ఆశిస్తున్నాం’’ అని హ్యుందాయ్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అన్సూ కిమ్ అన్నారు. నిర్వహణ స్థాయిలో, సెప్టెంబర్ త్రైమాసికంలో వడ్డీ, పన్ను, తరుగుదల, అమోర్టైజేషన్ (ఇబిటా) ముందు ఆటో మేజర్ ఆదాయం రూ .2,441 కోట్ల నుండి 10% తగ్గి రూ .2,205 కోట్లకు, ఎబిటా మార్జిన్ 13.1% నుండి 12.8% కు తగ్గింది. మధ్యాహ్నం గం.2.10 సమయానికి హ్యుందాయ్ మోటార్ (Hyundai India) షేరు బీఎస్ఈ లో 2.60 శాతం నష్టంతో రూ.1,775.00 వద్ద ట్రేడవుతోంది.