Hyundai Electric Car : బడ్జెట్ రెడీ చేసుకోండి.. హ్యుందాయ్ క్రెటా ఈవీ రెడీ.. ఒక్క ఛార్జ్‌తో 450 కి.మీ!
Hyundai Creta Electric Car : మార్కెట్‌లోకి కొత్త కొత్త ఎలక్ట్రిక్ కార్లు వస్తున్నాయి. ఈ సెగ్మెంట్‌లో అమ్మకాలు పెరగడంతో అన్ని కంపెనీలు ఫోకస్ చేస్తున్నాయి. హ్యుందాయ్ క్రెటా ఈవీ కూడా ఈవీ మార్కెట్‌లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో కంపెనీలు కూడా ఈ సెగ్మెంట్‌లో కార్లను తయారు చేస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీల ఎలక్ట్రిక్ కార్లు రోడ్ల మీద తిరుగుతున్నాయి. కొన్నేళ్లుగా భారతీయ వినియోగదారుల్లో ఎలక్ట్రిక్ కార్లలకు డిమాండ్ పెరుగుతోంది. ఇందులో టాటా మోటార్స్ ఇప్పటికీ ఏకపక్ష ఆధిపత్యాన్ని కొనసాగిస్తోందనే చెప్పాలి. ఎందుకంటే భారతదేశంలో మొత్తం ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ వాటా 65 శాతంగా ఉంది.
ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ తన బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ క్రెటా ఎలక్ట్రిక్ వేరియంట్‌ను వచ్చే సంవత్సరంలో అంటే 2025లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. హ్యుందాయ్ క్రెటా ఈవీని భారత రోడ్లపై పలుమార్లు స్పాట్ టెస్టింగ్ చేశారు. వార్తా వెబ్సైట్ గాడివాడిలో ప్రచురించిన ఒక వార్త ప్రకారం.. రాబోయే హ్యుందాయ్ క్రెటా ఈవీ.. ఎంజీ జెడ్ఎస్ ఈవీ, మహీంద్రా ఎక్స్‌యూవీ 400, టాటా కర్వ్ ఈవీ, రాబోయే మారుతి సుజుకి ఈవీ ఎక్స్‌తో పోటీపడుతుంది. హ్యుందాయ్ క్రెటా ఈవీ గురించి మరిన్ని వివరాలు చూద్దాం..
హ్యుందాయ్ క్రెటా ఈవీకి కొత్త అల్లాయ్ వీల్ వస్తుంది. అదే సమయంలో వినియోగదారులు కారులో క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్‌ను కూడా చూడవచ్చు. అంతేకాక హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ 3-స్పోక్ డిజైన్ కలిగిన ఐసీఈ క్రెటాతో పోలిస్తే కొత్త స్టీరింగ్ వీల్‌ను పొందుతుంది.
హ్యుందాయ్ క్రెటా ఈవీలో ఏసీ వెంట్స్, పనోరమిక్ సన్ రూఫ్, ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ కోసం రెండు 10.25-అంగుళాల టచ్ స్క్రీన్లు లభించే అవకాశం ఉంది. భద్రత కోసం ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 6-ఎయిర్ బ్యాగులు, 360-డిగ్రీ కెమెరా, లెవల్-2 ఏడీఎఎస్ టెక్నాలజీని కూడా ఇవ్వవచ్చు.
హ్యుందాయ్ క్రెటా ఈవీ పవర్ట్రెయిన్ విషయానికి వస్తే ఇది 45 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. సుమారుగా 138 బీహెచ్పీ గరిష్ట శక్తిని, 255 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. హ్యుందాయ్ క్రెటా ఈవీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 450 కిలోమీటర్లకు పైగా రేంజ్ ఇవ్వనుందని వార్తలు వస్తున్నాయి.