ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న హైదరాబాద్‌కు చెందిన దిగ్గజ ఫార్మా కంపెనీ... 25 శాతం ఔట్!-hyderabad dr reddys layoffs pharma major cuts workforce cost by 25 percent employees above 1 crore package asked to quit ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న హైదరాబాద్‌కు చెందిన దిగ్గజ ఫార్మా కంపెనీ... 25 శాతం ఔట్!

ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న హైదరాబాద్‌కు చెందిన దిగ్గజ ఫార్మా కంపెనీ... 25 శాతం ఔట్!

Anand Sai HT Telugu

Dr Reddy’s layoffs : హైదరాబాద్‌కు చెందిన దిగ్గజ ఫార్మా కంపెనీ ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు ఉద్యోగుల్లో 25 శాతం కోత విధించేందుకు చూస్తోందని వార్తలు వస్తున్నాయి.

డాక్టర్ రెడ్డీస్ (Photo-mint)

హైదరాబాద్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించబోతోంది. బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం కంపెనీ తన ఉద్యోగుల్లో 25 శాతం కోత విధించబోతోంది. ఏడాదికి కోటి రూపాయలకు పైగా సంపాదించే వారితో సహా పలువురు సీనియర్ అధికారులను రాజీనామా చేయమని కోరినట్టుగా తెలుస్తోంది.

కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్(ఆర్‌అండ్‌డీ) విభాగంలో పనిచేస్తున్న 50-55 ఏళ్ల మధ్య వయసున్న ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్) కల్పించాలని అనుకుంటున్నారని సమాచారం. ఇప్పటికే వివిధ శాఖల్లో అధిక వేతనం పొందుతున్న పలువురు ఉద్యోగులను రాజీనామా చేయాల్సిందిగా కోరినట్టుగా తెలుస్తోంది.

డాక్టర్ రెడ్డీస్ ఆదాయం

2024 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ లాభం 2 శాతం పెరిగి రూ.1,413 కోట్లకు చేరింది. హైదరాబాద్‌కు చెందిన ఈ ఫార్మా కంపెనీ గత ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో రూ.1,379 కోట్ల లాభాన్ని ఆర్జించింది. కంపెనీ ఆదాయం రూ.8,359 కోట్లకు పెరిగిందని డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ తెలిపింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ.7,215 కోట్లుగా ఉంది. డాక్టర్ రెడ్డీస్‌కు ఇటీవల ఆదాయపు పన్ను శాఖ నుంచి రూ.2,395 కోట్ల షోకాజ్ నోటీసులు అందాయి. ఈ మేరకు డాక్టర్ రెడ్డీస్ ఇటీవల స్టాక్ ఎక్సేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది.

స్టాక్ మార్కెట్‌లో

డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ షేర్లు 2025లో ఇప్పటివరకు దాదాపు 19 శాతం పడిపోయాయి. ఏప్రిల్ 11న ఈ షేరు 1.46 శాతం లాభంతో రూ.1,110 వద్ద ముగిసింది. 2025 ఏప్రిల్ 7న ఈ షేరు రూ.1,025.90 వద్ద కనిష్ఠాన్ని తాకింది. 52 వారాల కనిష్ఠ స్థాయికి చేరుకుంది. 2024 ఆగస్టులో షేరు ధర రూ.1,420.20కి పెరిగింది. 52 వారాల గరిష్ట స్థాయి ఇది.

Anand Sai

eMail

సంబంధిత కథనం