2000 rupee note scrapping: 2 వేల నోటు రద్దు ఆర్థిక వ్యవస్థపై చూపే ప్రభావం ఎంత?-how will scrapping of 2000 rupees banknotes impact indian economy and banks ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  How Will Scrapping Of 2000 Rupees Banknotes Impact Indian Economy And Banks?

2000 rupee note scrapping: 2 వేల నోటు రద్దు ఆర్థిక వ్యవస్థపై చూపే ప్రభావం ఎంత?

HT Telugu Desk HT Telugu
May 20, 2023 04:12 PM IST

2000 rupee note scrapping: రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు మే 19న ఆర్బీఐ చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. దేశంలో కరెన్సీ నోట్ల చెలామణికి సంబంధించి 2016లో పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం తరువాత.. ఈ రూ. 2 వేల నోటు రద్దు నిర్ణయమే అది పెద్దది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

2000 rupee note scrapping: 2016 నవంబర్ 8న రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు (note ban) చేస్తూ తీసుకున్న నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపింది. సర్క్యులేషన్ లో ఉన్న సుమారు 86% కరెన్సీ ఇకపై చెల్లబోదంటూ తీసుకున్న ఆ నోట్ల రద్దు నిర్ణయం దేశంలోని అన్ని వర్గాల ప్రజలను తీవ్ర ఇబ్బందుల పాలు చేసింది. అంతేకాదు, ఆ నిర్ణయం ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని కూడా తదనంతర కాలంలో నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా, రూ. 2 వేల నోట్ల (2000 rupee note)ను చెలామణి నుంచి ఉపసంహరిస్తూ ఆర్బీఐ (RBI) చేసిన ప్రకటనపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ట్రెండింగ్ వార్తలు

2000 rupee note scrapping: పెద్ద ప్రభావమేం ఉండదు..

అయితే, రూ. 2 వేల నోట్ల రద్దు సాధారణ జన జీవనంపై కానీ, దేశ ఆర్థిక వ్యవస్థపై కానీ పెద్దగా ప్రభావం చూపబోదని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. 2018 -19 లోనే 2000 నోట్ల (2000 rupee note) ముద్రణను నిలిపేశారని, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రూ. 2 వేల నోట్లలో పేద, మధ్య తరగతి వర్గాల వద్ద ఉన్నవి తక్కువేనని వివరిస్తున్నారు. ఏటీఎం (ATM)లలో నుంచి రూ. 2 వేల నోట్లు రావడం కూడా ఆగిపోయి చాలాకాలమైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అదీకాక, భారత్ లో డిజిటల్ కరెన్సీ (digital currency) వాడకం ఈ మధ్య కాలంలో విస్తృతంగా పెరిగింది. మరోవైపు, రూ. 500, రూ. 200, రూ. 100 సహా చిన్న నోట్లు మార్కెట్లో అవసరమైన స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. అదీకాక, ప్రస్తుతం చెలామణిలో ఉన్న నోట్లలో రూ. 2 వేల నోట్ల వాటా కేవలం 10.8% అన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి.

2000 rupee note scrapping: లోక్ సభ ఎన్నికల కోసం..

రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకుంటూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం ప్రధానంగా రాజకీయ వర్గాలపై తీవ్ర ప్రభావం చూపనుందని ఆర్థిక రంగ నిపుణులు వివరిస్తున్నారు. ముఖ్యంగా నగదు లావాదేవీలు ఎక్కువగా జరిగే , రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, సినీ రంగంలో ఉన్న సంస్థలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. త్వరలో లోక్ సభ ఎన్నికలతో పాటు, పలు కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పార్టీలు, ఆ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న ఆశావహులైన నాయకులు ప్రచార ఖర్చుల కోసం పెద్ద ఎత్తున నగదును సిద్ధం చేసుకోవడం ఇప్పటికే ప్రారంభించారు. వారు సాధారణంగా పెద్దదైన రూ. 2 వేల నోట్లనే అందుకు ఎంపిక చేసుకుంటారు. అలా, భారీ మొత్తంలో రూ. 2 వేల నోట్లను అక్రమంగా నిల్వ చేసుకున్నవారికి ఈ నిర్ణయం అశనిపాతంగా మారనుంది. రూ. 2 వేల నోటును రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కచ్చితమైన కారణాలను ఆర్బీఐ వెల్లడించలేదు.

2000 rupee note scrapping: కొనుగోళ్లు పెరిగే అవకాశం

అంతేకాకుండా, రూ. 2 వేల నోట్లు పెద్ద ఎత్తున తమ వద్ద ఉన్నవారు వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి బదులుగా, బంగారం, భూములు వంటి వాటిపై పెట్టుబడులు పెట్టే అవకాశముంది. అందువల్ల, భూములు, స్థిరాస్తులు, బంగారం, గృహోపకరణాల అమ్మకాలు కొంత పెరిగే అవకాశముంది.

WhatsApp channel