GST On Old Cars : పాత కార్ల అమ్మకాలపై జీఎస్టీ ఎలా వేస్తారు? కన్ఫ్యూజన్ లేకుండా ఈ ఎగ్జాంపుల్ చూడండి!
GST On Old Cars : తాజాగా పాత కారు విక్రయాలపై జీఎస్టీ గురించి ఎక్కువగా చర్చ నడుస్తోంది. 18 శాతం పన్ను చెల్లించడంపై కొందరికి గందరగోళం ఉంది. దీనిపై వివరాలేంటో చూద్దాం..
జీఎస్టీ కౌన్సిల్ పాత వాహనాల విక్రయాల కోసం నిబంధనలను స్పష్టం చేసింది. విక్రేత మార్జిన్‌లపై 18 శాతం పన్ను విధించడంలాంటి వాటి గురించి చెప్పింది. శనివారం జరిగిన 55వ జీఎస్టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే సోషల్ మీడియాలో దీనిపై భిన్నమైన చర్చలు నడుస్తున్నాయి. ఎవరు ఎంత జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందో చూద్దాం..
నిజానికి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే కారు క్రయావిక్రయాలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంటుంది. అంటే సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మే డీలర్లు/సంస్థలు దగ్గర నుంచి 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తారు. పాత, ఉపయోగించిన వాహనాల విక్రయంపై జీఎస్టీ కేవలం వాహనాల కొనుగోలు, పునఃవిక్రయంలో నిమగ్నమైన డీలర్లు, వ్యాపారాలకు మాత్రమే వర్తిస్తుంది. జీఎస్టీలో నమోదు కాని వారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఇందులో కూడా చాల మందికి కన్ఫ్యూజన్ ఉంది. కొనుగోలు తర్వాత సేల్ చేసిన ధర మధ్య ఉండే మార్జిన్ మీదనే 18 శాతం జీఎస్జీ ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మెుత్తం సెకండ్ హ్యాండ్ కారు విలువ మీద జీఎస్డీ ఉండదు.
సెకండ్ హ్యండ్‌లో అమ్మే సమయంలో కారు అసలు ధరలో తరుగుదలను మినహాయిస్తారు. ఇక్కడ ఉదాహరణకు డీలర్ కొన్న ధర కంటే అమ్మిన ధర ఎక్కువగా ఉంటే మార్జిన్ మీద జీఎస్టీ విధిస్తారు. వినియోగ ఎలక్ట్రిక్ వాహనాలకూ ఇది వర్తిస్తుంది. జీఎస్టీ కింద నమోదు కాని వ్యక్తుల మధ్య పాత కార్ల విక్రయానికి జీఎస్టీ వర్తించదు. జీఎస్టీ కింద నమోదైన సంస్థలు, వ్యక్తులు మాత్రం దీనిని చెల్లించాల్సి ఉంటుంది. దీనికోసం రెండు ఉదాహరణలు చూద్దాం..
ఉదాహరణకు ఒక సెకండ్ హ్యాండ్ డీలర్ కారును రూ. 10 లక్షలకు ఇతరులకు అమ్మేశాడు అనుకుందాం. ఆ కారు అసలు కొనుగోలు ధర రూ.20 లక్షలు అనుకుంటే కొన్నేళ్లు గడిచాక అందులో తరుగు 8 లక్షలు పోతుందని ఆదాయపు పన్ను రిటర్న్‌లో చూపించాడు. అంటే 12 లక్షల కారు విలువ. ఇందులో 10 లక్షలకే కారు అమ్మేశాడు కాబట్టి ఎలాంటి జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే కొనుగోలు ధర కంటే అమ్మకం ధర తక్కువ ఉన్నప్పుడు జీఎస్టీ పడదు.
మరో ఉదాహరణ ఏంటంటే.. 10 లక్షలతో ఓ కారును కొని 11 లక్షలకు డీలర్ అమ్మేశాడు అనుకుందాం. అంటే లాభం మార్జిన్ రూ.లక్ష. ఈ మార్జిన్ మీద సంస్థ/డీలర్ 18 శాతం జీఎస్టీ చెల్లించాలి.
అలా సెకండ్ హ్యాండ్ కొనుగోలు ధర కంటే అమ్మకం ధర ఎక్కువగా ఉన్నప్పుడు ఆ లాభం మీధ 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. మెుత్తం రీసేల్ డబ్బుల మీద జీఎట్టీ ఉండదని గుర్తుంచుకోవాలి.
సెకండ్ హ్యాండ్ పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వాహనాలతోపాటుగా అన్ని మోటరు వాహనాల మీద విధించే పన్ను విధానం ఏకరీతిగా ఉండాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని జీఎస్టీ కౌన్సిల్ తెలిపింది. అయితే సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్‌లో మాత్రం దీని గురించి గందరగోళం ఉంది. పన్ను భారంతో అమ్మకాలు తగ్గుతాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.