యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, స్నాప్‌చాట్ వంటివి ఇప్పుడు మనిషి జీవితంలో ఒక భాగమైపోయాయి. ఈ నేపథ్యంలోనే పెద్ద సంఖ్యలో కంటెంట్ క్రియేటర్లు కూడా పుట్టుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా యూట్యూబ్‌లో తమ కంటెంట్‌ని పబ్లీష్ చేస్తూ చాలా మంది యూట్యూబర్లు లక్షల్లో సంపాదిస్తున్నారు. మీరు ఫాలో అయ్యే వారి వార్షిక ఆదాయం గురించి మీకు తెలిసే ఉంటుంది! ప్రముఖ యూట్యూబర్ రన్వీణ్ అల్లాబాదియా (బీర్‌బైసెప్స్) నెలకు సుమారు రూ. 35లక్షలు.. అంటే ఏడాదికి 4,20,00,000 లక్షలు సంపాదిస్తున్నాడు. ఛానెల్ క్లిక్ అయితే చాలు, చాలా మంది ఇలా లక్షల్లో సంపాదిస్తున్నరు. అయితే, యూట్యూబ్ ద్వారా అసలు ఎన్ని విధాలుగా సంపాదించవచ్చో మీకు తెలుసా?
యూట్యూబ్ ఛానెల్ ద్వారా సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాము..
1. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్- మీరు ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు.. యాడ్ ప్లే అయితే, కంటెంట్ క్రియేటర్‌కి కొంత మొత్తంలో ఆదాయం జనరేట్ అవుతున్నట్టు అర్థం. కంపెనీలు యాడ్స్ ప్లే చేసేందుకు యూట్యూబ్‌కి డబ్బులు ఇస్తాయి. వాటిల్లో కొంత మొత్తాన్ని యూట్యూబ్.. క్రియేటర్లకు ఇస్తుంది. దీనిని యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్ అంటారు. ఒకవేళ మీరు యూట్యూబ్ ప్రీమియం తీసుకుంటే, యాడ్స్ ప్లే అవ్వవు. కానీ మీరు కట్టిన ప్రీమియం మొత్తంలో కొంత భాగం క్రియేటర్‌కి వెళుతుంది.
అయితే, ఛానెల్ పెట్టిన వెంటనే యూట్యూబ్ యాడ్స్ ఆన్ అవ్వవు! ఇందుకు కొన్ని రూల్స్ ఉన్నాయి. 12 నెలల్లో మీకు 1000 మంది సబ్స్క్రైబర్లు ఉండాలి. దానితో పాటు 4వేల వాచ్ హవర్స్ (లాంగ్ వీడియోలు) లేదా 90 రోజుల్లో 10 మిలియన్ షార్ట్స్ వ్యూస్ వచ్చి ఉండాలి. కొత్త ఛానెల్ కాబట్టి దీనికి కాస్త సమయం పడుతుంది. ఒక్కసారి యాడ్స్‌కి ఎలిజిబుల్ అయితే, మీకు రెవెన్యూ స్టార్ట్ అవుతుంది.
ఈ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్‌తో యాడ్స్ మాత్రమే కాదు మరికొన్ని లాభాలు కూడా ఉన్నాయి. అవి.. సూపర్ ఛాట్స్, సూపర్ థాంక్స్, ఛానెల్ మెంబర్షిప్ ఫీచర్స్. సూపర్ థ్యాంక్స్ అంటే, మీ పని నచ్చి ఎవరైనా మీకు డబ్బులు గిఫ్ట్ చేయడం. కొందరు కొన్ని వీడియోలను మెంబర్స్ కోసమే పెడుతుంటారు. వాటిని చూడాలంటే మెంబర్షిప్ తీసుకోవాలి. ఈ మధ్య యూట్యూబ్ షాపింగ్ అన్న ఆప్షన్ కూడా తీసుకొచ్చారు. మీ ప్రాడక్ట్స్‌ని ఇక్కడ సేల్ చేసుకోవచ్చు. ఇలా.. వీటి ద్వారా కూడా మీరు డబ్బులు సంపాదించొచ్చు.
బ్రాండ్ డీల్స్- యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్‌తో కన్నా ఈ బ్రాండ్ డీల్స్‌తోనే ఎక్కువ సంపాదించవచ్చు. ఇంకా చెప్పాలంటే, ఇన్ఫ్లుయెంజర్లు విపరీతంగా డబ్బులు సంపాదిస్తోంది ఈ బ్రాండ్ డీల్స్‌తోనే! ఛానెల్ ప్రారంభించి, మీకు మంచి వ్యూస్ వస్తుంటే.. కొన్ని బ్రాండ్స్ మీ దగ్గరికి వస్తాయి. తమ ప్రాడక్ట్స్‌ని ప్రమోట్ చేయమంటాయి. ఈ విధంగా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. మీకు నచ్చే యూట్యూబర్లు.. వీడియో మధ్యలో ఇలాంటి కంటెంట్‌ని పెడుతుండటం మీరు చూసే ఉంటారు. బ్రాండ్ డీల్స్‌తోనే లక్షల్లో సంపాదిస్తున్న వారు చాలా మంది ఉన్నారు.
అఫీలియేటెడ్ ఇన్కమ్- మీ ఫేవరెట్ యూట్యూబర్లు కొన్ని లింక్స్ ఇచ్చి, మీకు ఆసక్తి ఉంటే కొనుగోలు చేసుకోవచ్చు అని చెబుతుండటం మీరు చూసే ఉంటారు. వీరికి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లేదా ఇతర ఈ-కామర్స్ సంస్థలతో టై-అప్ ఉంటుంది. మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఏదైనా ప్రాడక్ట్ కొంటే, అందులో కొంత మొత్తం క్రియేటర్‌కి కూడా వస్తుంది.
కంటెంట్ కోర్సులు- ఈ మధ్యకాలంలో యూట్యూబ్ క్రియేటర్లు బాగా ఉపయోగించుకుంటున్న ఆప్షన్ ఇది! 'హౌ టు స్టార్ట్ యూట్యూబ్', 'హౌ టు డూ డే ట్రేడింగ్' అంటూ చాలా మంది కోర్సులను విక్రయిస్తున్నారు. మీరు ఆ కోర్సులు వాడాలంటే డబ్బులు కట్టి తీసుకోవాలి. ఇది కూడా యూట్యూబర్లకు మంచి రెవెన్యూ ఆప్షన్.
మెర్చెండైజ్- ఇంకొందరు క్రియేటర్లు తమ ప్రాడక్ట్స్‌ని మెర్చెండైజ్ చేస్తున్నారు. ఇది మంచి బిజినెస్ మార్కెటింగ్! దీని ద్వారా బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. డబ్బులు కూడా జనరేట్ అవుతాయి. బిజినెస్ వృద్ధి చెందుతుంది.
కంటెంట్ లైసెన్స్- యూట్యూబర్ల వీడియో ఏదైనా వైరల్ అయితే, దానిని వాడుకునేందుకు చాలా మంది (ముఖ్యంగా మీడియా) ముందుకొస్తారు. మీరు మీ వీడియోని లైసెన్స్ చేసుకుని, డబ్బులు అడగొచ్చు.
నేటి సోషల్ మీడియా యుగంలో ఇన్ప్లుయెంజర్లు చాలా ఫేమస్ అవుతున్నారు. చాలా డబ్బులు సంపాదిస్తున్నట్టు వీడియోలు చేస్తున్నారు. వారిలాంటి లైఫ్‌స్టైల్ కావాలని చాలా మంది కలలు కంటున్నారు. అయితే, యూట్యూబ్ ఛానెల్ ద్వారా డబ్బులు సంపాదించాలంటే, ముందు ఛానెల్ క్లిక్ అవ్వాలి. దానికి సమయం పడుతుందని గుర్తించాలి. ఇవాళ పెట్టి, రేపు ఆదాయం రావాలంటే కష్టం అని గుర్తుపెట్టుకోవాలి.