US Green Card: యూఎస్ గ్రీన్ కార్డ్ పొందడానికి ఈ సులువైన మార్గం ఉంది తెలుసా..?
US Green Card: విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం అమెరికా వెళ్లినవారికి అక్కడి గ్రీన్ కార్డ్ (US Green Card) సంపాదించడం ఒక స్వప్నం. గోల్డెన్ వీసా (EB-5 or golden visa) తో కూడా గ్రీన్ కార్డ్ పొందే అవకాశమున్న విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.
US Green Card: గోల్డెన్ వీసాగా పిలిచే ఈబీ 5 (EB-5 or golden visa) వీసా తో కూడా గ్రీన్ కార్డ్ ను పొందవచ్చు. హెచ్ 1 బీ వీసాకు భారీ వెయిటింగ్ టైమ్ ఉన్న పరిస్థితుల్లో చాలా మంది భారతీయులు ఇప్పుడు ఈబీ 5 లేదా గోల్డెన్ వీసా కోసం అప్లై చేస్తున్నారు.
ఈబీ 5 లేదా గోల్డెన్ వీసా
అమెరికాకు చెందిన ఈబీ 5 వీసా (EB-5) కోసం దరఖాస్తు చేస్తున్న వారిలో భారతీయులు అత్యధికంగా ఉన్నారు. ఈబీ 5 వీసా గురించి తెలియని వారికి, ఆ వీసా విధానంపై అనుమానాలు ఉన్నవారికి అవగాహన కల్పించడం కోసం యూఎస్ ఇమ్మిగ్రేషన్ ఫండ్ (U.S. Immigration Fund USIF) ఢిల్లీలో అక్టోబర్ 28 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు ఒక కార్యక్రమం నిర్వహిస్తోంది. సెమినార్ తో పాటు రోడ్ షోలను కూడా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా భారత్ లోని ఇన్వెస్టర్లకు ఈబీ 5 వీసా విధానంపై అవగాహన కల్పిస్తామని యూఎస్ ఇమ్మిగ్రేషన్ ఫండ్ (USIF) ప్రెసిడెంట్ నికోలస్ ఏ తెలిపారు. ఈబీ 5 వీసా అనేది ఒక శాశ్వత నివాస (permanent residency) అవకాశం కల్పించే వీసా విధానం. ఈ వీసా పొందిన వారు అమెరికాలో ఎక్కడైనా నివసించవచ్చు. ఎక్కడైనా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందవచ్చు. ఆతరువాత వారికి గ్రీన్ కార్డ్ ను ఇచ్చే విషయంలో కూడా ప్రయారిటీ ఉంటుంది.
1990 నుంచి..
అమెరికాలో ఈ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఈబీ 5 లేదా గోల్డెన్ వీసా విధానాన్ని 1990లో ప్రారంభించారు. కనీసం 8 లక్షల డాలర్లను అమెరికాలో పెట్టుబడి పెట్టి, అమెరికాలో కనీసం 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేవారికి ఈ ఈబీ 5 వీసా ఇస్తారు. ఈ వీసా పొందిన వారు అమెరికాలో ఎక్కడైనా నివసించవచ్చు. ఎక్కడైనా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందవచ్చు. ఈ వీసా ప్రొగ్రామ్ ద్వారా ఇప్పటివరకు చాలా మంది భారతీయులు అమెరికాలో శాశ్వత నివాస సౌకర్యాన్ని పొందారు. గత కొన్ని సంవత్సరాలుగా భారత్ నుంచి ఈబీ 5 లేదా గోల్డెన్ వీసా దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగింది.