ITR filing 2024 : మీ ఐటీఆర్‌లో తప్పులను ఇలా సరిచేసుకోవచ్చు..
Revised ITR filing : ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో తప్పులు చేశారా? చింతించాల్సిన అవసరం లేదు. రివైజ్డ్ ఐటీఆర్ ఫైలింగ్‌తో ఆ తప్పులను సరిచేసుకోవచ్చు. పూర్తి వివరాలు..
ఐటీఆర్ ఫైలింగ్ డెడ్‌లైన్ సమీపిస్తోంది. జులై 31 తర్వాత గడువును పొగడించమని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా చాలా మంది చివరి నిమిషాల్లో హడావుడిగా ఆదాయపు పన్ను రిటర్నులను ఫైల్ చేస్తుంటారు. హడావుడి కారణంగా తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఐటీఆర్‌లోని తప్పులను సరిచేసుకునేందుకు ఆదాయపు పన్నుశాఖ వెసులుబాటును కల్పిస్తుంది. అది రివైజ్డ్ ఐటీఆర్. పన్ను రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు తప్పు బ్యాంక్ ఖాతా నంబర్ ఇస్తే, మినహాయింపును తప్పుగా క్లెయిమ్ చేయడం లేదా వడ్డీ ఆదాయాన్ని తప్పుగా ప్రకటించడం వంటి తప్పులు జరిగితే.. ఈ రివైజ్డ్ ఐటీఆర్‌ని ఉపయోగించుకోవచ్చు. దీని వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
రివైజ్డ్ ఐటీఆర్ అంటే ఏమిటి?
ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 139 (5) ప్రకారం పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులను దాఖలు చేసేటప్పుడు తప్పిదాలతో చేస్తే సవరించిన ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయవచ్చు. అలా చేయడానికి ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు. ఇది ఉచితం.
ఇంతకుముందు, రిటర్న్ ఫైలింగ్ గడువుకు ముందు ఐటిఆర్ దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారులు మాత్రమే రివైజ్డ్ ఐటీఆర్ దాఖలు చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు, ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేసిన వారితో సహా ప్రతి ఒక్కరూ ఈ ఆప్షన్ని ఉపయోగించుకోవచ్చు.
ఏదేమైనా, రివైజ్డ్ ఐటీఆర్ ఫైలింగ్ కన్నా మీరు దాఖలు చేసిన ఐటిఆర్‌ని ‘డిస్కార్డ్’ చేసి మళ్లీ కొత్తగా ఫైల్ చేసుకోవచ్చు. అయితే ఇలా చేయాలంటే అప్పటికి మీ ఐటీఆర్ వెరిఫై అయ్యి ఉండకూడదని గుర్తుపెట్టుకోవాలి.
రివైజ్డ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడానికి చివరి తేదీ ఏది?
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139(5) ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరానికి (2024-25 మదింపు సంవత్సరం) సవరించిన ఐటీఆర్ దాఖలు చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 31, 2024.
రివైజ్డ్ ఐటీఆర్‌ను ఎన్నిసార్లు దాఖలు చేయవచ్చు?
ఎన్ని రివైజ్డ్ రిటర్న్స్ సబ్మిట్ చేయవచ్చనే విషయంలో ఎలాంటి పరిమితులు లేవు. సవరించిన రిటర్నులను కొన్ని షరతులకు లోబడి మళ్లీ రివైజ్ చేసుకోవాల్సి ఉంటుంది.
రివైజ్డ్ ఐటీఆర్‌ని ఇలా ఫైల్ చేయండి..
స్టెప్ 1: ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌ని సందర్శించి, మీ ఖాతాలోకి లాగిన్ అవ్వండి.
స్టెప్ 2: జనరల్ ఇన్ఫర్మేషన్ వద్ద పార్ట్ ఏ ఓవర్లో, డ్రాప్‌డౌన్‌లో పేర్కొన్న విధంగా సెక్షన్ 139(5) కింద రివైజ్డ్ రిటర్న్ ఎంచుకోండి.
స్టెప్ 3: మీ ఒరిజినల్, సరైన ఆదాయపు పన్ను రిటర్న్ వివరాలను ఇవ్వండి.
స్టెప్ 4: మీకు వర్తించే ఐటీఆర్ ఫారమ్‌ని ఎంచుకోండి.
స్టెప్ 5: రివైజ్డ్ రిటర్న్ ఫారంలో దిద్దుబాట్లు లేదా అప్డేట్స్ చేయండి.
స్టెప్ 6: రివైజ్డ్ రిటర్న్ సబ్మిట్ చేసే ముందు, వివరాలను జాగ్రత్తగా ధృవీకరించండి.
స్టెప్ 7: రివైజ్డ్ రిటర్న్ సబ్మిట్ చేయాలి.
పైన చెప్పిన విధంగా మీరు మీ ఆదాయపు పన్ను రిటర్నుల్లో తప్పులను సరిచేసుకోవచ్చు. రివైజ్డ్ ఐటీఆర్ ఫైలింగ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
సంబంధిత కథనం