EPF balance: ఎస్ఎంఎస్ ద్వారా కూడా మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు..
మీ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ లో ఎంత మొత్తం ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అందుకు చాలా మార్గాలున్నాయి. ఆన్ లైన్ లో ఈపీఎఫ్ వెబ్ సైట్ లో పాస్ బుక్ ఆప్షన్ ద్వారా తెలుసుకోవచ్చు. లేదా, అత్యంత సులువుగా, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899 నంబర్ కు ఎస్ఎంఎస్ చేసి కూడా తెలుసుకోవచ్చు.
EPF balance: ప్రావిడెంట్ ఫండ్స్ అనేది ఉద్యోగుల రిటైర్మెంట్ ఫండ్. పదవీ విరమణ అనంతరం ఉద్యోగుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఈ ప్రావిడెంట్ ఫండ్ ఉపయోగపడుతుంది. అందువల్ల, ప్రతీ ఉద్యోగికి యాజమాన్యాలు ఒక పీఎఫ్ ఖాతాను సమకూర్చడం చట్టబద్ధ విధిగా మారింది.
ప్రభుత్వ పథకం
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అనేది భారతదేశంలో అర్హులైన వేతన కార్మికుల కోసం ప్రభుత్వం నిర్దేశించిన పథకం. ఇది ప్రైవేట్, ప్రభుత్వ రంగాలలో పదవీ విరమణ ప్రణాళికకు ఉపయోగపడుతుంది. ఉద్యోగులు, యజమానులు ఇద్దరూ ఉద్యోగి వేతనంలో నిర్ణీత శాతాన్ని క్రమం తప్పకుండా ఈపీఎఫ్ (EPFO) ఖాతాకు జమ చేస్తారు. ఈపీఎఫ్ నుండి రిటైర్మెంట్ కు ముందు కూడా, కొన్ని నిబంధనలకు లోబడి కొంత మొత్తాన్ని పాక్షికంగా విత్ డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్ లో కీలకమైనది యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN). ఇది శాశ్వత సంఖ్య. మీరు ఎన్ని ఉద్యోగాలు మారినా ఈ యూఏఎన్ మారదు. యూఏఎన్ తో మీరు మీ మొబైల్ నంబర్ ను అనుసంధానించుకోవాలి.
ఎస్ఎంఎస్ ద్వారా బ్యాలెన్స్ తెలుసుకోవడం ఎలా?
స్టెప్ 1: మీ స్మార్ట్ ఫోన్ లో మెసేజింగ్ యాప్ ను ఓపెన్ చేయండి. కొత్త సందేశాన్ని రాయడం ప్రారంభించండి.
స్టెప్ 2: మీరు టైప్ చేస్తున్న సందేశంలో, EPFOHO UAN ENG అని టైప్ చేయండి. ఇక్కడ UAN అని ఉన్న చోట మీ 12-అంకెల యూఏఎన్ ను నమోదు చేయండి. చివర్లో ENG అని టైప్ చేయడం వల్ల మీకు ఇంగ్లీష్ లో సమాధానం వస్తుంది. అదే తెలుగులో సమాధానం కావాలనుకుంటే, మీరు ENG అని ఉన్న చోట TEL అని టైప్ చేయండి.
స్టెప్ 3: ఆ మెసేజ్ ను 7738299899 కు SMS చేయండి.
కొద్దిసేపటి తరువాత, మీ తాజా పీఎఫ్ కంట్రిబ్యూషన్, కరెంట్ బ్యాలెన్స్ వివరాలతో ఈపీఎఫ్ఓ నుండి SMS వస్తుంది. ఈ సదుపాయం 10 భాషల్లో అందుబాటులో ఉంది.
గుర్తుంచుకోవలసిన విషయాలు
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు నుండి మాత్రమే ఈ SMS పంపండి.
- ఈపీఎఫ్ఓ KYC అప్ డేట్స్ తో పాటు సభ్యుడి బ్యాలెన్స్ మరియు చివరి PF కంట్రిబ్యూషన్ వివరాలను పంపుతుంది.
- ఈపీఎఫ్ఓ పోర్టల్లోకి లాగిన్ అయ్యి వారి వివరాలను నమోదు చేయాలి.
ఇలా అయితే మెసేజ్ రాదు
మీ యజమాని మీ ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా వివరాలను డిజిటల్ గా ధృవీకరించి సమర్పించనట్లయితే, మీరు SMS నోటిఫికేషన్ ను అందుకోకపోవచ్చు. ఇది జరిగితే, మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ గురించి తెలుసుకోవడానికి దయచేసి వెంటనే మీ ప్రస్తుత యజమానిని సంప్రదించండి.
యూఏఎన్ యాక్టివేషన్
ఈపీఎఫ్ ఖాతాదారులు మొదట వారి యూఏఎన్ (UAN)ను యాక్టివేట్ చేసుకోవాలి. ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ లో వారి మొబైల్ నంబర్ ను నమోదు చేయాలి. ఎస్ఎంఎస్ సదుపాయం ద్వారా వారి ఈపీఎఫ్ బ్యాలెన్స్ ల గురించి సందేశాలు వచ్చే ముందు ఈ ప్రక్రియను ఒకసారి మాత్రమే పూర్తి చేయాలి.