Double your money: మీ పెట్టుబడి ఎన్నేళ్లలో రెట్టింపు అవుతుందో తెలుసుకోవాలనుందా? రూల్ 72 తో ఇలా తెలుసుకోవచ్చు..
Double your money: సాధారణంగా ఎక్కడ, ఎలా ఇన్వెస్ట్ చేస్తే మన పెట్టుబడి అత్యంత త్వరగా రెట్టింపు అవుతుందో తెలుసుకోవాలనుకుంటాం. అందుకు ఒక సింపుల్ రూల్ ఉంది. అదే రూల్ 72. అదేంటో, ఎలా ఉపయోగించాలో చూద్దాం.
Double your money: మన ఇన్వెస్ట్ మెంట్ ఎన్నేళ్లలో రెట్టింపు అవుతుందో తెలుసుకునేందుకు ఒక మార్గం ఉంది. అదే రూల్ 72. ఇది చాలా సింపుల్ రూల్. సింపుల్ మేథమెటికల్ ఈక్వేషన్ తో మన పెట్టుబడి రెట్టింపు అయ్యే టైమ్ తెలుసుకోవచ్చు.
ట్రెండింగ్ వార్తలు
ఫిక్సడ్ డిపాజిట్లు..
పెట్టుబడులకు అత్యంత సురక్షిత మార్గంగా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లను భావిస్తుంటాం. వీటి ద్వారా నమ్మకమైన, కచ్చితమైన రిటర్న్ పొందుతాం. కానీ మిగతా రిస్కీ మార్గాలతో పోలిస్తే, ఈ ఎఫ్డీ ల ద్వారా రిటర్న్ తక్కువ వస్తుంది. వివిధ బ్యాంకులు వివిధ కాల వ్యవధులకు, వేర్వేరు వడ్డీ రేట్లతో ఫిక్స్ డ్ డిపాజిట్లను స్వీకరిస్తుంటాయి. సాధారణంగా వీటి వడ్డీ రేట్లు వార్షికంగా 3% నుంచి 7% వరకు ఉంటుంది. ఏడు శాతం వార్షిక వడ్డీ రేటు అనుకుంటే, రూల్ 72 ప్రకారం.. బ్యాంకుల్లో మీ పెట్టుబడి రెట్టింపు కావడానికి 10. 28 సంవత్సరాలు పడుతుంది. అంటే, మీరు రూ. 1 లక్ష ఏదైనా బ్యాంక్ లో 7% వార్షిక వడ్డీతో పెట్టుబడి పెడితే.. అది రూ. 2 లక్షలుగా మారడానికి 10 సంవత్సరాలకు పైగా సమయం పడుతుంది.
రూల్ 72 ప్రకారం..
=72/7
= 10.28 సంవత్సరాలు
పీపీఎఫ్ లో పెట్టుబడి పెడితే..
పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ కూడా సురక్షితమైన పెట్టుబడి సాధనం. ప్రస్తుతం పీపీఎఫ్ లో పెట్టుబడులు 7.1% వార్షిక వడ్డీ అందిస్తున్నాయి. 2020 ఏప్రిల్ నుంచి అదే వడ్డీ రేటు ఉంది. ఆ లెక్కన పీపీఎఫ్ లో మీ పెట్టుబడి రెట్టింపు కావడానికి 10. 14 సంవత్సరాలు పడుతుంది. అంటే, మీరు రూ. 1 లక్ష పీపీఎఫ్ లో 7.1% వార్షిక వడ్డీతో పెట్టుబడి పెడితే.. అది రూ. 2 లక్షలుగా మారడానికి 10 సంవత్సరాలకు పైగా సమయం పడుతుంది.
రూల్ 72 ప్రకారం..
=72/7.1
= 10.14 సంవత్సరాలు
స్టాక్స్ లో పెట్టుబడి పెడితే..
ఎఫ్డీ, పీపీఎఫ్ లతో పోలిస్తే, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి కొంత రిస్కీనే. కానీ పెట్టుబడులకు రిటర్న్స్ మాత్రం ఎఫ్డీ, పీపీఎఫ్ లతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, కొంత మొత్తాన్ని ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టడం సముచితం. నిఫ్టీ 50 లో పెట్టిన పెట్టుబడులు గత సంవత్సరం 13.5% రిటర్న్ ను అందించాయి. అంటే.. నిఫ్టీ 50 లో పెట్టిన మీ పెట్టుబడి రెట్టింపు కావడానికి రూల్ 72 ప్రకారం 5. 33 సంవత్సరాలు పడుతుంది. మీరు రూ. 1 లక్ష నిఫ్టీ 50 లో 13.5% వార్షిక వడ్డీతో పెట్టుబడి పెడితే.. అది రూ. 2 లక్షలుగా మారడానికి 5.33 సంవత్సరాల సమయం పడుతుంది.
రూల్ 72
=72/13.5
= 5.33 సంవత్సరాలు
మ్యుచ్యువల్ ఫండ్స్ లో..
స్టాక్ మార్కెట్లో నేరుగా పెట్టుబడి పెట్టడానికి తగిన ఆసక్తి, సమయం, ప్రణాళిక లేని వారు సాధారణంగా మ్యుచ్యువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తారు. దీర్ఘకాలంతో మ్యుచ్యువల్ ఫండ్స్ 12% నుంచి 15% రిటర్న్ ఇస్తాయి. అంటే.. మ్యుచ్యువల్ ఫండ్స్ లో పెట్టిన మీ పెట్టుబడి 12% వార్షిక వడ్డీ రేటుతో రెట్టింపు కావడానికి రూల్ 72 ప్రకారం 6 సంవత్సరాలు పడుతుంది. మీరు రూ. 1 లక్ష మ్యుచ్యువల్ ఫండ్స్ లో 12% వార్షిక వడ్డీతో పెట్టుబడి పెడితే.. అది రూ. 2 లక్షలుగా మారడానికి 6 సంవత్సరాల సమయం పడుతుంది.
రూల్ 72
=72/12
= 6 సంవత్సరాలు.