ఇక సీఎన్జీ ఆప్షన్‌తో రాబోతున్న హోండా ఎలివేట్‌ కారు.. అమ్మకాలు పెంచుకునే ఆలోచనలో కంపెనీ!-honda elevate introduces cng option for customers across india ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఇక సీఎన్జీ ఆప్షన్‌తో రాబోతున్న హోండా ఎలివేట్‌ కారు.. అమ్మకాలు పెంచుకునే ఆలోచనలో కంపెనీ!

ఇక సీఎన్జీ ఆప్షన్‌తో రాబోతున్న హోండా ఎలివేట్‌ కారు.. అమ్మకాలు పెంచుకునే ఆలోచనలో కంపెనీ!

Anand Sai HT Telugu

సీఎన్జీ వాహనాలకు డిమాండ్ పెరుగుతుండటంతో చాలా పెద్ద కంపెనీలు సైతం ఈ వైపుగా ఆలోచిస్తున్నాయి. ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కూడా తన ప్రసిద్ధ కార్ మోడళ్లలో ఒకదానికి సీఎన్జీ ఆప్షన్ పెట్టనుంది.

హోండా ఎలివేట్

సీఎన్జీ వాహనాలకు భారతీయులలో చాలా మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా తన ప్రసిద్ధ కార్ మోడళ్లలో ఒకటైన ఎలివేట్ కారు మోడల్‌కు సీఎన్జీ ఆప్షన్ జోడించింది. కంపెనీ తన కస్టమర్లకు రెట్రోఫిట్టింగ్ ద్వారా సీఎన్జీ ఆప్షన్‌ను అందించడానికి ముందుకు వచ్చింది.

సీఎన్జీ ఆప్షన్

హోండా ఎలివేట్ కారు కొనాలనుకునే ఔత్సాహికులు రాబోయే రోజుల్లో సీఎన్జీ ఆప్షన్‌తో కూడా ఈ కారును కొనుగోలు చేయగలుగుతారు. దీన్ని కొనుగోలు చేసేటప్పుడు వారంటీ, బీమాతో ఎటువంటి సమస్యలు ఉండవని గమనించాలి. సాధారణంగా సీఎన్జీ కిట్‌లను అమర్చేటప్పుడు వారంటీ, బీమాను క్లెయిమ్ చేయడంలో పెద్ద సమస్య ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో చాలా మంది సీఎన్జీ తయారీదారులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తమ కిట్‌లను తయారు చేయరు. ఈ రకమైన కిట్లు ప్రమాదకరమైనవి కూడా.

బీమా, వారంటీ

దీని ఫలితంగా వారంటీ, బీమా క్లెయిమ్‌లతో సమస్యలు వస్తాయి. అయితే హోండా డీలర్లు, హోండా రెట్రోఫిట్ చేసే సీఎన్జీ కిట్‌లు అన్ని నిబంధనలకు అనుగుణంగా తయారు చేస్తారు. అందువల్ల వినియోగంలో కూడా దీనికి ఎటువంటి చట్టపరమైన సమస్యలు ఎదురుకావు. రాబోయే రోజుల్లో హోండా ఎలివేట్ అమ్మకాలు రెట్టింపు అవుతాయని కంపెనీ భావిస్తోంది. ఎలివేట్ ఇప్పటికే కంపెనీ బెస్ట్ సెల్లింగ్ కార్ మోడల్. భారతదేశంలో హోండా అమ్మకానికి అందిస్తున్న ఏకైక ఎస్‌యూవీ మోడల్ ఇదే.

మైలేజీ అంచనా

అధిక మైలేజీ కోరుకునే వారిని ఆకర్షించడానికి ఎలివేట్ కారు మోడల్‌లో సీఎన్జీ ఆప్షన్‌ను ప్రవేశపెట్టారు. దీని అధికారిక మైలేజ్ వివరాలు ఇంకా అందుబాటులో లేవు. ఇది కిలో సీఎన్జీకి 26 కి.మీ నుండి 28 కి.మీ మైలేజీని అందిస్తుందని వార్తలు వస్తున్నాయి.

భారతదేశంలో హోండా ఎలివేట్ 1.5-లీటర్ i-VTEC DOHC ఇంజిన్ ఎంపికతో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది గరిష్టంగా 89 kW శక్తిని, 145 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటారు 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో అందిస్తారు. ఇది లీటరుకు గరిష్టంగా 16.92 కి.మీ మైలేజీని ఇస్తుంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.