Honda Activa E Vs Suzuki E Access : హోండా యాక్టివా ఈ Vs సుజుకి ఈ యాక్సెస్.. ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్?
Honda Activa E Vs Suzuki E Access : మార్కెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు జోరుగా ఉన్నాయి. తాజాగా ఆటో ఎక్స్‌పోలో సుజుకి ఈ యాక్సెస్ కూడా ఎంట్రీ ఇచ్చింది. మరోవైపు హోండా యాక్టివా ఈ స్కూటర్ కూడా వచ్చింది. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్ అని చూద్దాం..
హోండా స్కూటర్ అండ్ మోటార్‌సైకిల్ ఇండియా, సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా భారత ద్విచక్ర వాహన మార్కెట్లో దుమ్మురేపేందుకు సిద్ధమయ్యాయి. దిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో హోండా యాక్టివా ఈ కూడా ప్రదర్శిస్తున్నారు. సుజుకి ఈ-యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా విడుదలైంది. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బాగుంటుందనేది తెలుసుకుందాం..
బ్యాటరీ, మైలేజీ
హోండా యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 1.5 కిలోవాట్ కెపాసిటీ గల రెండు రీప్లేస్ చేయగల బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. పూర్తిగా ఛార్జ్ చేస్తే 102 కి.మీల రేంజ్ అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 80 కి.మీ. ఇది ఎకాన్, స్టాండర్డ్, స్పోర్ట్ అనే 3 రైడింగ్ మోడ్‌లను పొందుతుంది.
సుజుకి ఈ యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ 3.07 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది. ఇది పూర్తిగా ఛార్జ్ చేస్తే 95 కి.మీల రేంజ్ ఇస్తుంది. గరిష్టంగా 71 కేఎంపీహెచ్ వేగంతో ఉంటుంది. ఇందులో ఎకో, రైడ్ ఎ, రైడ్ బి అనే మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. కొత్త ఈ యాక్సెస్‌తో పోలిస్తే యాక్టివా ఈ కొంచెం ఎక్కువ రేంజ్ అందిస్తుంది.
ఫీచర్లు
హోండా యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 7.0-అంగుళాల టీఎఫ్‌టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, హెచ్ స్మార్ట్ కీతో సహా పలు ఫీచర్లతో వస్తుంది. ఇది ఎల్ఈడీ హెడ్‌లైట్, డీఆర్ఎల్‌లు, టైలాంప్‌తో ఆకర్షణీయమైన డిజైన్‌తో ఉంటుంది. ప్రయాణీకుల రక్షణ కోసం డిస్క్/డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది.
సుజుకి ఈ యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో టీఎఫ్‌టీ డ్యాష్‌బోర్డ్, స్మార్ట్ కీ, నావిగేషన్ సిస్టమ్, సైడ్-స్టాండ్ అలర్ట్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ వంటి వివిధ ఫీచర్లు ఉన్నాయి. ఇది అధునాతన డిజైన్‌ను కలిగి ఉంది. ఎల్ఈడీ హెడ్‌లైట్‌ను కలిగి ఉంది. రెండు స్కూటర్లలో చాలా వరకు ఒకే విధమైన ఫీచర్లు ఉన్నాయి.
ధర ఎంతంటే
హోండా యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్టాండర్డ్ అండ్ రోడ్‌సింక్ డుయో అనే రెండు వేరియంట్‌ల ఎంపికలో విడుదల చేశారు. ఎక్స్-షోరూమ్ ధర రూ.1.17 లక్షల నుండి రూ.1.52 లక్షల వరకు ఉంది. సుజుకి ఇ-యాక్సెస్ రాబోయే నెలల్లో విక్రయిస్తారు. దీని ధర రూ. 1 లక్ష నుండి రూ. 1.20 లక్షల(ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా.
యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పెరల్ షాలో బ్లూ, పెరల్ మిస్టీ వైట్, పెరల్ సెరినిటీ బ్లూ, మ్యాట్ ఫాగీ సిల్వర్ మెటాలిక్, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్ అనే 5 కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఈ యాక్సెస్ మెటాలిక్ మ్యాట్ బ్లాక్, పెరల్ గ్రే వైట్, పెరల్ జేడ్ గ్రీన్ అనే మూడు కలర్ ఆప్షన్స్‌లో ఉంటుంది.