Hero Splendor EV : హీరో స్ప్లెండర్ ఎలక్ట్రిక్ బైక్.. మరో రెండేళ్లలో మార్కెట్‌లోకి తీసుకొచ్చేలా ప్లానింగ్
Hero Splendor Electric Bike : హీరో స్ప్లెండర్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయయి. మరో రెండేళ్లలో ఇది మార్కెట్‌లోకి రానుందని, ఏడాదికి 2 లక్షల యూనిట్లు విక్రయించేలా హీరో కంపెనీ ప్రణాళికలు వేస్తుందని అంటున్నారు.
దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీల్లో ఒకటైన హీరో మోటోకార్ప్ ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించింది. ప్రస్తుతం కంపెనీ పోర్ట్ ఫోలియోలో ఉన్న ఏకైక ఎలక్ట్రిక్ మోడల్ విడా వి1. ఈ విభాగంలో ఓలా ఎలక్ట్రిక్, బజాజ్ ఆటో, టీవీఎస్ఎల్ మోటార్స్, ఏథర్ ఎనర్జీ వంటి అనేక ఇతర కంపెనీలు ఉన్నాయి. ఇలా చూస్తే ఈవీ సెగ్మెంట్‌లో ఈవీ చాలా వెనకే ఉంది. అందుకే కంపెనీ ఇప్పుడు ఈ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టాలనుకుంటోంది. వచ్చే 2-3 ఏళ్లలో 6 కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లను తీసుకురానున్నట్లు పరిశ్రమ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇందులో ఎంట్రీ లెవల్ బైక్స్, స్కూటర్లు కూడా ఉంటాయి.
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరో స్ప్లెండర్ ఎలక్ట్రిక్ వేరియంట్‌ను కూడా కంపెనీ తయారు చేస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కంపెనీ ఎలక్ట్రిక్ ప్రాజెక్టులో దీన్ని కూడా చేర్చారు. జైపూర్‌లోని టెక్నాలజీ సెంటర్ సీఐటీలో 2 ఏళ్లుగా ఈ ప్రొడక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నారని అంటున్నారు. దీన్ని 2027లో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. స్ప్లెండర్ ప్రాజెక్టు పేరు ఏఈడీఏ అని చెబుతున్నారు. ఈ మోడల్ వచ్చాక ప్రతి సంవత్సరం సుమారు రెండు లక్షల యూనిట్లను విక్రయించాలని కంపెనీ యోచిస్తోంది. స్ల్పెండర్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోటార్ సైకిల్.
2026లో 10,000 యూనిట్ల వార్షిక అమ్మకాలతో విడా లింక్స్ అనే ఎలక్ట్రిక్ బైక్‌ను ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది. ఈ మోడల్ ప్రధానంగా అభివృద్ధి చెందిన అంతర్జాతీయ మార్కెట్ కోసం ఉంటుంది. కొనుగోలుదారుల అభిప్రాయాలు, ధరలను దృష్టిలో ఉంచుకుని 2027లో ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను తీసుకురావాలని కంపెనీ చూస్తుంది.
ఏఈడీఏ ప్రాజెక్టు కమ్యూటర్ సెగ్మెంట్ లేదా రోజువారీ వ్యాపార వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని వచ్చేలా ఉంది. 150సీసీ, 250సీసీ ఐసీఈ మోడళ్లకు సమానమైన మరో రెండు మోటార్ సైకిళ్లను ఏడీజెడ్ఏ అని పిలువబడే ప్రాజెక్ట్ కింద ప్లాన్ చేస్తున్నారు. ఇది స్టైల్, మంచి పనితీరు కోసం చూస్తున్న యువ రైడర్లను లక్ష్యంగా చేసుకుంటుంది. 2027-28 వరకు ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌లో తనదైన ముద్ర వేయాలని హీరో అనుకుంటుంది.