అమ్మకాల్లో ఈ కంపెనీ అదుర్స్.. కేవలం 31 రోజుల్లో 4 లక్షలకు పైగా టూ వీలర్స్ సేల్స్
Hero MotoCorp : ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కొత్త సంవత్సరం శుభారంభం చేసింది. 2025 జనవరిలో కంపెనీ 4,42,873 యూనిట్ల అమ్మకాలను సాధించింది.
ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కొత్త సంవత్సరంలో అమ్మకాల్లో దూసుకెళ్లింది. జనవరి 2025లో కంపెనీ 4,42,873 యూనిట్లను విక్రయించింది. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 2.14 శాతం వృద్ధి. భారత మార్కెట్లో హీరో అమ్మకాలు 40 శాతానికి పైగా పెరిగాయి. దీంతోపాటు కంపెనీ ఎగుమతుల్లో 140 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది.
హీరో మోటోకార్ప్ 2025లో మోటార్ సైకిళ్లు, స్కూటర్లతో సహా అనేక కొత్త ద్విచక్ర వాహనాలను విడుదల చేసింది. ఈ కొత్త మోడళ్లలో ఎక్స్ ట్రీమ్ 250ఆర్, ఎక్స్ పల్స్ 210, డెస్టిని 125, క్సూమ్ 125, క్సోమ్ 160 (మ్యాక్సీ స్కూటర్) ఉన్నాయి. ఈ కొత్త మోడళ్లు హీరో మోటోకార్ప్‌కు అద్భుతమైన అమ్మకాలకు దారితీశాయి.
హీరో మోటోకార్ప్ అమ్మకాల గణాంకాలు జనవరి 2025లో చూసుకుంటే 4,42,873 యూనిట్లను నమోదు చేసింది. గత ఏడాది జనవరి 2024లో ఈ సంఖ్య 4,33,598 యూనిట్లుగా ఉంది. మంత్ ఆన్ మంత్ (ఎంఓఎం) అమ్మకాలు కూడా పెరిగాయి. 2024 డిసెంబర్‌లో 3,24,906 యూనిట్లు అమ్ముడుపోగా, 2025 జనవరిలో ఈ సంఖ్య 36.31 శాతం పెరిగి 4,42,873 యూనిట్లకు చేరింది.
మోటార్ సైకిళ్లు వర్సెస్ స్కూటర్లు
హీరో మోటోకార్ప్ అమ్మకాల్లో ఎక్కువ భాగం మోటార్ సైకిళ్ల ద్వారానే జరుగుతున్నాయి. మొత్తం అమ్మకాల్లో మోటార్ సైకిళ్ల వాటా 90.39 శాతంగా ఉంది.
మోటార్ సైకిళ్ల అమ్మకాలు : 2025 జనవరిలో 4,00,293 యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే 2024 జనవరితో పోలిస్తే స్వల్పంగా(-0.49 శాతం) తగ్గింది.
స్కూటర్ల అమ్మకాలు : స్కూటర్ల అమ్మకాల్లో విపరీతమైన వృద్ధి నమోదైంది. 2025 జనవరిలో అమ్మకాలు 42,580 యూనిట్లుగా ఉన్నాయి. ఇది గత ఏడాది జనవరితో పోలిస్తే 34.99 శాతం పెరిగింది.
దేశీయ, అంతర్జాతీయ మార్కెట్
కంపెనీ దేశీయ మార్కెట్లో 4,12,378 యూనిట్లను విక్రయించింది. ఇది 2024 డిసెంబర్ కంటే 40.19 శాతం ఎక్కువ. గత ఏడాది జనవరితో పోలిస్తే స్వల్పంగా 2.03 శాతం క్షీణించింది. కంపెనీ 30,495 యూనిట్లను ఎగుమతి చేసింది. ఇది 140.80 శాతం పెరుగుదల. అంటే హీరో మోటోకార్ప్ బైక్‌లు, స్కూటర్లు ఇప్పుడు విదేశాల్లో కూడా బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి.
హీరో మోటోకార్ప్ తన వీఐడీఏ బ్రాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలను కూడా ప్రారంభించింది. 2025 జనవరిలో 6,669 యూనిట్ల వీఐడీఏ వీ2 స్కూటర్లు అమ్ముడయ్యాయి. వీఐడీఏ వి2 మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీఐడీఏ వీ2 లైట్ ధర రూ.96 వేలు, వీఐడీఏ వీ2 ప్లస్ ధర రూ.1.15 లక్షలు, వీఐడీఏ వీ2 ప్రో ధర రూ.1.35 లక్షలు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లకు వినియోగదారుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
హీరో మోటోకార్ప్ ఆధిపత్యం జనవరి 2025లో కనబరిచింది. కొత్త మోడళ్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎగుమతులు విపరీతంగా పెరగడంతో కంపెనీ మార్కెట్లో తనదైన ముద్ర వేస్తోంది.