అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కొత్త హెచ్ఎఫ్ డీలక్స్ ప్రోను ప్రారంభించడంతో దాని హెచ్ఎఫ్ డీలక్స్ శ్రేణిని బలోపేతం చేసింది. ఎంట్రీ-లెవల్ మోటార్‌సైకిల్ విభాగంలో తన ఉనికిని బలోపేతం చేయడానికి తాజా స్టైలింగ్, ఆధునిక ఫీచర్లు, అద్భుతమైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. ఈ కొత్త మోడల్ లో టెక్నాలజీ, స్టైల్ రెండింటినీ కంపెనీ పొందుపరిచింది.
ఐ3ఎస్ టెక్నాలజీ, లో ఫ్రిక్షన్ ఇంజిన్, కొత్త గ్రాఫిక్స్, ఎల్ఈడీ హెడ్ లైట్స్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, లో ఫ్యూయల్ ఇండికేటర్, 18 అంగుళాల వీల్స్, అడ్జస్టబుల్ రియర్ సస్పెన్షన్ వంటి ఫీచర్లు ఈ మోటార్ సైకిల్‌లో ఉన్నాయి. ఈ మోటార్ సైకిల్ ఎక్స్ షోరూమ్ ధరను రూ.73,550గా నిర్ణయించింది. 97.2 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ బైక్ గరిష్టంగా 7.9బిహెచ్‌పీ పవర్, 8.05ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
హీరో మోటోకార్ప్ సీబీఓ అశుతోష్ వర్మ మాట్లాడుతూ..'హెచ్ఎఫ్ డీలక్స్ భారతదేశం అంతటా మిలియన్ల మంది కస్టమర్లకు నమ్మకమైన భాగస్వామిగా ఉంది. ఇది విశ్వసనీయత, ఇంధన సామర్థ్యానికి ప్రసిద్ది చెందింది. కొత్త హెచ్ఎఫ్ డీలక్స్ ప్రోతో, కొత్త తరం భారతీయ రైడర్ల అవసరాలకు అనుగుణంగా బోల్డ్ డిజైన్, అధునాతన ఫీచర్లు, మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఈ నమ్మకాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాం.' అని చెప్పారు.
కంపెనీ ఎంట్రీ లెవల్ బైక్ సెగ్మెంట్లో ఈ బైక్ లాంచ్ చేసింది. ఈ సెగ్మెంట్లో బజాజ్, టీవీఎస్, హోండా వంటి ద్విచక్ర వాహన తయారీదారుల బైక్‌లతో నేరుగా పోటీ పడనుంది. 100 సీసీ సెగ్మెంట్లో హెచ్ఎఫ్ డీలక్స్‌కు డిమాండ్ బాగానే ఉంది. ఇది హీరో స్ప్లెండర్, హోండా షైన్ వంటి మోడళ్లతో పోటీ పడుతుంది.
ఆధునిక డిజిటల్ స్పీడోమీటర్ రియల్-టైమ్ రైడింగ్ డేటాను ప్రదర్శిస్తుంది. రోజువారీ ప్రయాణానికి సౌలభ్యాన్ని పెంచడానికి తక్కువ ఇంధన సూచిక (LFI)ని కలిగి ఉంటుంది. 18-అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లు, 130ఎంఎం వెనక డ్రమ్ బ్రేక్, వెనుక సస్పెన్షన్‌తో కూడిన ఈ మోటార్‌సైకిల్ రైడ్ చేసేందుకు అణువుగా ఉంటుంది.