భారత ఎంట్రీ లెవల్ బైక్ సెగ్మెంట్లో హీరో మోటోకార్ప్ ప్రాడక్ట్స్‌కి మంచి డిమాండ్ ఉంది. వీటిల్లో హీరో హెచ్ఎఫ్ 100 ఒకటి. ఇక ఇప్పుడు, ఈ మోడల్‌పై సంస్థ ఒక అప్డేట్ ఇచ్చింది. కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా తన లైనప్‌ని అప్డేట్ చేస్తున్న ఈ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హెచ్ఎఫ్ 100లో కూడా అందుకు తగ్గట్టుగా మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో అత్యంత చౌకైన ధరకు, భారీ మైలేజ్‌ని ఇస్తున్న ఈ బైక్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
హీరో మోటోకార్ప్‌కి చెందిన ఎంట్రీ లెవల్ కమ్యూటర్ బైక్ ఈ హీరో హెచ్ఎఫ్ 100. ఈ బైక్ ఇప్పుడు ఓబీడీ -2బీ కంప్లైన్స్కి అనుగుణంగా అప్డేట్ అయ్యింది. ఈ అప్డేటెడ్ హెచ్ఎఫ్ 100 ధర రూ .60,118 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ), పాత వెర్షన్ కంటే కేవలం రూ .1,100 ఎక్కువ!
హీరో మోటోకార్ప్ మాత్రమే కాదు, దేశంలో ఎంట్రీ లెవల్లో లభిస్తున్న చౌకైన బైక్స్‌లో ఈ హీరో హెచ్ఎఫ్ 100 ఒకటి. కాగా లేటెస్ట్ అప్డేట్తో బైక్ డిజైన్, స్టైలింగ్‌లో ఎలాంటి మార్పులు లేవు అని గుర్తుపెట్టుకోవాలి.
హీరో హెచ్ఎఫ్ 100లో 97.2 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 8,000 ఆర్పీఎమ్ వద్ద 8 బీహెచ్పీ పవర్, 6,000 ఆర్పీఎమ్ వద్ద 8.05 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను జనరేట్ చేస్తుంది. హీరో ప్యాషన్ ప్లస్, స్ల్పెండర్ ప్లస్ కమ్యూటర్ బైకుల్లో కూడా ఈ మోటార్ పనిచేస్తుంది. ఓబీడీ-2బీ అనుసరణకు అనుగుణంగా అప్డేట్ చేసిన ఇంజిన్ మినహా, బైక్ అలాగే ఉంటుంది. సస్పెన్షన్ విధులను ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో ట్విన్ షాక్‌లు పూర్తి చేస్తాయి. కాంబి బ్రేకింగ్‌తో ఇరువైపులా 130 ఎంఎం డ్రమ్ బ్రేకులు ఉంటాయి. ట్యూబ్‌లెస్ టైర్లతో కూడిన 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌పై హెచ్ఎఫ్ 100 బైక్ ప్రయాణిస్తుంది.
కొత్త హీరో హెచ్ఎఫ్ 100 బ్లాక్ విత్ బ్లూ గ్రాఫిక్స్, బ్లాక్ విత్ రెడ్ గ్రాఫిక్స్ అనే రెండు రంగుల్లో లభిస్తుంది. సెల్ఫ్ స్టార్ట్, సైడ్ స్టాండ్ కటాఫ్, అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, 735 ఎంఎం పొడవైన సీటు తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ బైక్ ఐదేళ్ల వారంటీతో లభిస్తుంది. కేవలం 110 కిలోల తేలికపాటి కెర్బ్ బరువు హెచ్ఎఫ్ 100ను చురుకుగా చేస్తుంది. అదే సమయంలో అధిక ఫ్యూయెల్ ఎఫీషియెన్సీని నిర్థరిస్తుంది.
ఈ హీరో హెచ్ఎఫ్ 100 మైలేజ్ సుమారు 70 కేఎంపీఎల్.
హీరో హెచ్ఎఫ్ 100.. ఎంట్రీ లెవల్ బైక్స్ సెగ్మెంట్లో హోండా షైన్ 100, బజాజ్ ప్లాటినా 100 లకు గట్టి పోటీ ఇస్తుంది.
సంబంధిత కథనం