1 BHK homes in Bengaluru: బెంగళూరులో 1 బీహెచ్ కే ఇళ్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్
ప్రధానంగా ఎండ్ యూజర్ ఆధారిత మార్కెట్ అయిన బెంగళూరులో కరోనాకు ముందు 1 బీహెచ్ కే ఇళ్లకు చెప్పుకోదగ్గ డిమాండ్ లేదు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. గత మూడేళ్లలో 1 బీహెచ్కే ఫ్లాట్స్ కు డిమాండ్ చాలా పెరిగిందని రియల్టర్లు చెబుతున్నారు.
బెంగళూరులో గత మూడేళ్లుగా 1 బీహెచ్కే ఇళ్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. బెంగళూరులో ఇంటిని అద్దెకు తీసుకోవడం కంటే కొనడం చాలా అర్ధవంతంగా ఉంటుంది" అని ప్రస్తుతం తూర్పు బెంగళూరులోని వైట్ ఫీల్డ్ ప్రాంతంలో స్థిరపడిన 29 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రియాక్షి శర్మ అన్నారు.
రెంట్ కన్నా కొనడం బెటర్
మంచి వార్షిక వేతన స్కేల్ ఉన్నవారు బెంగళూరులో ఆకాశాన్నంటుతున్న రెంట్స్, సెక్యూరిటీ డిపాజిట్లను చెల్లించడం కన్నా.. సింపుల్ గా ఒక 1 బీహెచ్కే ఫ్లాట్ తీసుకుని ఈఎంఐ చెల్లించడం బెటరని భావిస్తున్నారు. ఒకవేళ, వేరే నగరానికి మారాల్సి వచ్చినా, ఈ ప్రాపర్టీ నుంచి మంచి రెంటల్ ఇన్ కం లభిస్తుందని వివరిస్తున్నారు. మెరుగైన కెరీర్ అవకాశాల కోసం ఐటీ రాజధాని బెంగళూరుకు వెళ్లిన పలువురు మిలీనియల్, జెన్ జెడ్ ప్రొఫెషనల్స్ ఇదే విధంగా ఆలోచిస్తున్నారు.
కోవిడ్ తరువాత మారిన తీరు..
కోవిడ్ -19 మహమ్మారి తరువాత బెంగళూరు (bengaluru) లో 1 బీహెచ్కే రెసిడెన్షియల్ యూనిట్లకు డిమాండ్ బాగా పెరిగిందని డెవలపర్లు, స్థానిక బ్రోకర్లు ఏకగ్రీవంగా అంగీకరించారు. అత్యధిక అద్దె రాబడి ఉన్న నగరాల జాబితాలో బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. ముంబై రెండవ స్థానంలో ఉంది. గత మూడేళ్లలో బెంగళూరులోని 1 బిహెచ్కె అపార్ట్మెంట్లకు డిమాండ్ సుమారు 30% పెరిగింది. కోవిడ్ 19 కారణంగా ఇన్ఫెక్షన్ భయంతో ప్రజలు తమ ఇంటిని పంచుకోవడానికి ఇష్టపడలేదు. చిన్నదైనా పర్లేదు, సురక్షితమైన సొంత ఇల్లు కావాలని కోరుకోవడం ప్రారంభించారు.
అద్దె ఆదాయం కూడా..
అధిక అద్దె లభించే అవకాశాలు కూడా కొనుగోలుదారులను 1 బిహెచ్ కె గృహ యూనిట్లను కొనుగోలు చేయడానికి ప్రోత్సహిస్తాయి. "నేను నా నెలవారీ అద్దెను ఈఎంఐగా మార్చుకుంటాను. నా సెక్యూరిటీ డిపాజిట్ కు కొంచెం జోడించి డౌన్ పేమెంట్ గా ఉపయోగిస్తాను" అని సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రియాక్షి శర్మ చెప్పారు. మరోవైపు, స్థిరమైన అద్దె ఆదాయం లభిస్తుండడంతో చాలా మంది అదొక ఆదాయ వనరుగా భావిస్తూ, బెంగళూరులో ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారు. బెంగళూరులో ప్రాపర్టీ ధరలు ఏటా 10-12% పెరగడంతో, చాలా మంది పెట్టుబడిదారులు సాంప్రదాయ ఎంపిక అయిన 2 బిహెచ్కెకు బదులుగా 1 బిహెచ్కెను ఎంచుకుంటున్నారని పలువురు బిల్డర్లు తెలిపారు.
ఈ గృహ కొనుగోలుదారులు ఎవరు?
ఐటీ కార్యాలయాల సమీపంలో, ముఖ్యంగా ఉత్తర, తూర్పు బెంగళూరులో, నగరంలోని ఆసుపత్రులు, కళాశాలల చుట్టూ 1 బీహెచ్ కే ప్రాజెక్టులు బాగా సేల్ అవుతున్నాయని రియల్టర్లు తెలిపారు. ముఖ్యంగా, సంపన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులు, 27-35 సంవత్సరాల మధ్య వయస్సు గల ప్రారంభ వృత్తి నిపుణులు. సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్స్, డాక్టర్లు 1 బీహెచ్కేలపై అధిక ఆసక్తి చూపుతున్నారు. ఈ పెట్టుబడిదారుల్లో ఎక్కువగా 35-50 సంవత్సరాల వయస్సు గలవారు, వైవిధ్యమైన వృత్తిపరమైన నేపథ్యాల కలయికతో ఉన్నవారు ఉన్నారు.